
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళితబంధు పథకం లబ్ధిదారుల గుర్తింపు కోసం చేపట్టిన సర్వే చురుకుగా సాగుతోంది. శుక్రవారం ప్రారంభమైన ఇంటింటి సర్వే శనివారానికి ఊపందుకుంది. సర్వేలో దాదాపు 400 మంది జిల్లా అధికారులు పాలుపంచుకుంటున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, హుజూరాబాద్, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీలను మొత్తం ఏడు యూనిట్లుగా విభజించారు. ప్రతి యూనిట్‌ను ఐదు క్లస్టర్లుగా విభజించారు. క్లస్టర్ల బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు ‘దళితబంధు’యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తున్నారు.
అందులో లబ్ధిదారుల పేరు, వయసు, ఫోన్, రేషన్‌కార్డు, ఆధార్ నంబర్లు, సమగ్ర కుటుంబసర్వే నంబరు, చిరునామా, కుటుంబసభ్యులు ఎందరు? వారి వయసు, ఆధార్, ఫోన్ తదితర వివరాలు సేకరిస్తున్నారు. అనంతరం ప్రతివ్యక్తి ఫొటోను ట్యాబ్‌లో పొందుపర్చి అప్‌లోడ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఈ సాఫ్ట్‌వేర్, యాప్‌లను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ సాఫ్ట్‌వేర్ తెలుగు, ఇంగ్లిష్ రెండుభాషల్లోనూ అందుబాటులో ఉంది. సర్వే సమయంలోనే ఏ యూనిట్ అంటే ఆసక్తి ఉంది? అన్న వివరాలు కూడా తీసుకుంటున్నారు. 2014లో సమగ్ర కుటుంబసర్వేనే దళితబంధు సర్వేకు ప్రామాణికంగా తీసుకున్నారు.
సమగ్ర కుటుంబసర్వే గణాంకాల ప్రకారం... రాష్ట్రంలో 20,900 దళిత కుటుంబాలున్నాయి. సమగ్ర కుటుంబసర్వే తర్వాత మరో రెండు, మూడు వేల వరకు కొత్త కుటుంబాలు పెరిగాయి. ఆ కొత్త కుటుంబాల కోసం ఖాళీ దరఖాస్తులు (లబ్ధిదారుల సమాచార పత్రం) ఇచ్చి వివరాలు నమోదు చేస్తున్నారు. అందరి వివరాలు ఏ రోజుకారోజు కరీంనగర్ కలెక్టరేట్‌లో పొందుపరుస్తున్నారు. సీఎంసభకు ముందురోజు అంటే ఈ నెల 26వ తేదీ నుంచి కలెక్టరేట్, ఇతర ప్రభుత్వవిభాగాల సిబ్బంది ఉరుకులు, పరుగులు పెడుతూ ఇంటింటి సర్వే పనులు చేస్తుండటం గమనార్హం.