
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని నరేంద్ర మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్‌ల అప్రజాస్వామిక పాలనకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బుద్ధిచెప్పాలని మాజీమంత్రి పొన్నాల లక్ష్మ య్య పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని, దేశంలోని రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టిన ఘనత బీజేపీకే దక్కుతుందని ఆయన అన్నారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న బీజేపీ ప్రభుత్వానికి లోపాయికారీగా కేసీఆర్ మద్దతునిస్తున్నారని, అటు బీజేపీ, ఇటు టీఆర్‌ఎస్‌లకు బుద్ధి చెప్పేందుకు హుజూరాబాద్ ఉప ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలని పొన్నాల కోరారు.