సాక్షి, హైదరాబాద్: దళితబంధు ఉపాధి యూనిట్ల ప్రారంభం నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో అమలు చేసింది. దళిత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుని స్థిరపడాలనే లక్ష్యంతో యు ద్ధప్రాతిపదికన అమలుకు ఉపక్రమించింది.
ఈ క్రమంలో సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రితోపాటు హుజూరాబాద్‌లో 20వేల దళిత కుటుంబాలకు సాయం అందించేలా నిర్ణయించగా, ఇప్పటివరకు 18,064 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమచేసింది. ఒక్కో లబ్ధిదారు నుంచి దళిత రక్షణ నిధి కింద రూ.10వేల చొప్పున వెనక్కు తీసుకోవడంతో ఒక్కొక్కరి ఖాతాలో రూ.9.90 లక్షలు నిల్వ ఉన్నాయి.
లబ్ధిదారు ఏర్పాటుచేసే యూనిట్‌కు కలెక్టర్ అనుమతితో నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల్లో ఇప్పటివరకు యాభైలోపు యూనిట్లు మాత్రమే ప్రారంభమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఎంపికలో జాప్యం...
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భారీగా ఆర్థిక లబ్ధి కలిగే కేటగిరీలో దళితబంధు రెండోది. ఓవర్సీ స్ విద్యానిధి పథకం కింద ఎంపికైన విద్యార్థికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం చేస్తుండగా... దళితబంధు కింద రూ.10 లక్షలు ఇస్తున్నారు. అయితే దళితబంధు లబ్ధిదారుల సంఖ్య విద్యానిధి లబ్ధిదారుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. దళితబంధు లబ్ధిదారుడు ఆర్థిక వనరుల అభివృద్ధిలో భాగంగా ఒక ఉపాధిని ఎంచుకోవాల్సి ఉంటుంది.
దీనికోసం ఎస్సీ కార్పొరేషన్ 120 రకాల ఆలోచనలతో లబ్ధిదారులకు అవగాహన కల్పించింది. అయినా చాలామంది ఇప్పటికీ ఉపాధి యూనిట్‌ను ఖరారు చేసుకోలేదు. కేవలం 6 వేల మంది మాత్రమే కార్లు, ట్రాక్టర్లు, డెయిరీ, పౌల్ట్రీ యూనిట్లను ఎంచుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలను సైతం అధికారులకు ఇవ్వలేదు. ఆయా యూనిట్లు, వాటి నిర్వహణ తదితరాలపై స్పష్టత ఉన్నప్పుడే కలెక్టర్ ఆమోదంతో ఖాతాలోని నిధులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికీ ఈ ప్రక్రియ ప్రారంభ దశలో ఉంది.
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్‌తో...
హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఆ తర్వాత శాసన మండలి ఎన్నికలు రావడంతో దాదాపు రెండున్నర నెలలు ఎన్నికల కోడ్ అమలైంది. అందువల్ల దళితబంధు యూనిట్ల ఏర్పాటులో జాప్యం జరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం కోడ్ తొలగిపోవడంతో నెలాఖరులోగా యూనిట్లను ప్రారంభించే ప్రక్రియను వేగవంతం చేస్తామని అంటున్నాయి. అయితే, మెజార్టీ లబ్ధిదారులు ఇంకా యూనిట్లను ఎంపిక చేసుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో గ్రౌండింగ్ ప్రక్రియ మరింత ఆలస్యంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment