అదనంగా రక్షణ నిధి
పథకం అమలు, పర్యవేక్షణ.. ఫలితాలను అంచనా వేయడం.. లబ్ధిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం.. ఈ మూడు ముఖ్యమైన అంశాలు దళిత బంధు పథకంలో ఉంటాయి. ఈ పథకం ద్వారా రూ.10 లక్షల నగదు అందిస్తారు. అదనంగా లబ్ధిదారుడు–ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఎవరికైనా ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధి నుంచి వారికి సహాయం అందుతుంది. ఈ పథకం ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబాల పరిస్థితి ఆపదల కారణంగా మళ్లీ దిగజారకుండా ఈ నిధి రక్షక కవచంగా నిలుస్తుంది.
నేరుగా ఖాతాల్లోకి రూ. 10 లక్షలు
కుటుంబం యూనిట్‌గా అర్హులైన దళిత కుటుంబాలకు నేరుగా ఆర్థికసాయం చేసి, వారికి ఇష్టమైన పనిని ఎంచుకుని, అభివృద్ధి చెందే అవకాశాన్ని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. దళారుల బాధలేకుండా.. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేస్తాం.
‘హుజూరాబాద్’లో 20,929 కుటుంబాలకు...
హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్‌లో 4,346, వీణవంకలో 3,678, జమ్మికుంటలో 4,996, ఇల్లంతకుంటలో 2,586.. కలిపి హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తంగా 20,929 దళిత కుటుంబాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వారిలో అర్హులైనవారిని పథకానికి ఎంపిక చేస్తారు. ఈ పథకాన్ని పరిపూర్ణ స్థాయిలో అర్హులందరికీ వర్తింపజేస్తామని సీఎం ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితుల సాధికారత కోసం అమలు చేయనున్న కొత్త పథకానికి ‘తెలంగాణ దళిత బంధు’ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్‌లోని హుజూరాబాద్ నియోజవర్గంలో దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. తొలుత ఈ నియోజకవర్గంలోని మండలాల్లో దళిత కుటుంబాల స్థితిగతులపై అధ్యయనం చేసి.. అర్హులను గుర్తించి, పథకాన్ని వర్తింపజేస్తామని వెల్లడించారు. ‘దళిత సాధికారత పథకం– పైలట్ ప్రాజెక్టు ఎంపిక– అధికార యంత్రాంగం విధులు’ అంశాలపై కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కార్యాలయం వివరాలను వెల్లడించింది. ఇప్పటికే నిర్ణయించిన మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘దళిత బంధు’ పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
పథకానికి ఈ ఏడాది రూ.1,200 కోట్లు కేటాయించాలని ఇప్పటికే నిర్ణయించామని.. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టు అమలు కోసం అదనంగా మరో రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్లను ఖర్చు చేయనున్నామని తెలిపారు. ఆ నియోజకవర్గంలో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దడం, మరింతగా మెరుగుపర్చడంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సులువు అవుతుందన్నారు. పైలట్ ప్రాజెక్టు అమల్లో కలెక్టర్లతోపాటు కొందరు అధికారులు పాల్గొంటారని.. వారితో త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని వెల్లడించారు.
ప్రగతి భవన్‌లో దళిత సాధికారత కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా..
దళిత బంధు అమలులో అలసత్వం వహిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని సీఎం కేసీఆర్ అధికారులను హెచ్చరించారు. ‘‘పథకాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయాల్సి ఉంది. మూస పద్ధతిలో కాకుండా ప్రభుత్వ ఆలోచనలను అందుకుని పనిచేసే అధికార, ప్రభుత్వ యంత్రాంగం ఎంపిక జరగాలి. ఎంపిక చేసిన అధికారులు దళిత బంధు పథకాన్ని ఆషామాషీగా కాకుండా మనసుపెట్టి అమలు చేయాలి. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ఈ పథకం అమల్లో ముందుకు సాగాలి. మనం తినేటప్పుడు ఎంత లీనమై రసించి ఆరగిస్తామో, మనకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఎంత దీక్ష కనబరుస్తామో.. దళిత బంధు పథకం అమల్లో అధికారులు అంతే తాదాత్మ్యం చెంది పనిచేయాలి’’ అని పేర్కొన్నారు. కుల, ధన, లింగ భేదాలతో వ్యక్తులపై వివక్ష చూపి, ప్రతిభావంతులను ఉత్పత్తి రంగానికి దూరంగా ఉంచడం.. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగానే కాకుండా మొత్తం జాతికే నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు.
దళిత కుటుంబాల ప్రొఫైల్
రాష్ట్రవ్యాప్తంగా దళిత కుటుంబాల ప్రొఫైల్ రూపొందించాలని, వారి జీవన స్థితిగతులను అందులో పొందుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దళితుల సమస్యలు అన్నిచోట్లా ఒకే రీతిలో ఉండవని.. గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ అనేవిధంగా విభజించాలని సూచించారు. ఆయా సమస్యలకు అనుగుణంగా దళిత బంధు అమలు చేయాలన్నారు.
హుజూరాబాద్ నుంచి ఎందుకంటే?
‘దళిత బంధు’ పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం నుంచే ఎందుకు ప్రారంభిస్తున్నారన్న వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. ‘‘సీఎం కేసీఆర్ గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన సింహగర్జన సభ మొదలుకొని.. తాను ఎంతగానో అభిమానించిన రైతుబీమా పథకం దాకా చాలా వరకు కరీంనగర్ జిల్లా నుంచే మొదలుపెట్టారు. రైతుబంధు పథకాన్ని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. ఈ ఆనవాయితీని, సెంటిమెంటును కొనసాగిస్తూ.. దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. ఆయన స్వయంగా ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. తేదీ, ఇతర వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు’’ అని తెలిపింది.
చిత్తశుద్ధి, నిబద్ధత గల అధికారులు కావాలి
‘‘క్షేత్రస్థాయిలో దళిత బంధును పటిష్టంగా అమలు చేయడం కోసం.. దళితుల అభివృద్ధిపై మనసుపెట్టి నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరం. వారు అధికారులుగా కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా భావించి పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి చిత్తశుద్ధి, దళితులపై ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించండి’’ అని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment