కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌తో కలసి నెహ్రూ పనిచేశారు. రాజ్యాంగ పరిరక్షణకు తోడ్పడ్డారు. నాడు కాంగ్రెస్ తెచి్చన సంస్కరణలతోనే నేడు మోదీ ప్రధాని అయ్యారు. –ఖర్గే
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘‘ఒకరు 20 అడుగులు, మరొకరు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ పేద దళితులకు చేసిందేమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయి. కేవలం ప్రకటనలు చేస్తే సరిపోదు. పేద దళితుల కోసం చేసిందేమిటో చెప్పాలి..’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. నేటి ప్రభుత్వాలు భావ ప్రకటనా స్వేచ్ఛను, హక్కులను హరిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో జరిగిన ‘జైభారత్ సత్యాగ్రహ సభ’లో మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
దళితుల పేరు చెప్పి మోసం..
కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్ దళితుల పేరు చెబుతూ మోసం చేస్తున్నారని ఖర్గే విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఇవ్వకుండా దళితులను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక దళితుల కోసం ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేవలం పేపర్లలో ప్రకటనలు ఇస్తే సరిపోదన్నారు.
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. భావ ప్రకటన స్వేచ్ఛను, హక్కులను హరిస్తున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దేశానికి ఎంతో సేవ చేసిందని.. కానీ ఆగమేఘాలపై రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ప్రతిపక్షాలపై కక్షగట్టలేదన్నారు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బలహీనపర్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
మీరు చేసిందేంటో చెప్పండి..
కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారని, నాడు చేసిన కాంగ్రెస్ తెచి్చన సంస్కరణలతోనే నేడు మోదీ ప్రధాని అయ్యారని, అమిత్‌షా హోంమంత్రి అయ్యే అవకాశం వచి్చందని ఖర్గే చెప్పారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌తో కలిసి నెహ్రూ పని చేశారని, రాజ్యాంగ పరిరక్షణకు తోడ్పడ్డారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు దేశానికి చేసినదేమిటో చెప్పాలన్నారు. దేశ సేవలో వారి పాత్ర ఏమిటని ప్రశ్నించారు.
పైగా ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ.. అదేమీ చేయకపోగా ఎయిర్‌పోర్టులు, రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో ప్రైవేటీకరణతో నేడు ఉద్యోగాల సంఖ్య 40వేలకు తగ్గిందని చెప్పారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రేవంత్‌రెడ్డి, భట్టి పాదయాత్రలు చేపట్టారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment