‘దళిత బంధు’తో రాజకీయ లాభం కోరుకోవడం తప్పా?
దళితబంధు తమాషా పథకం కాదు. ఎన్నికలున్నాయని హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని పెడుతున్నారని కొందరంటున్నరు. మా పార్టీ సన్నాసుల మఠమా? మాదీ రాజకీయ పార్టీయే. టీఆర్‌ఎస్ అధికారంలో ఉండి, సీఎం ఉంటేనే ఇలాంటి పథకం సాధ్యం. ఏ పని చేయనోడే లాభం కోరుకుంటే.. చేసిన రాజకీయ పార్టీగా లాభం కోరుకోవడం తప్పా. ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సమయమున్నా.. ‘దళిత బంధు’ను హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం అక్కడి ప్రజల అదృష్టం.
►రాష్ట్ర సాధన కోసం చాలా మంది మహనీయులు పనిచేశారు. 1969 నాటి ఉద్యమం తెలంగాణ సమాజానికి చాలా నేర్పించింది. మర్రి చెన్నారెడ్డి ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లారు. 14 సీట్లలో 11 మంది ఎంపీలను గెలిపించుకున్నారు. తెలంగాణ కష్టపడి సాధించిన రాష్ట్రం, ఎవరూ అప్పనంగా ఇవ్వలేదు.
►ఏ పూటకు ఆ పూట రాజకీయాలు చేయొద్దు. శాశ్వతంగా అధికారం ఎవరికీ ఉండదు. ఇది రాచరిక వ్యవస్థ కాదు. ఎన్టీఆర్ అవకాశం ఇస్తే నేను ఎమ్మెల్యే అయిన. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నా ప్రసంగం విని స్పీకర్ కౌగిలించుకున్నారు. తెలంగాణ తెచ్చుడు.. చచ్చుడు ప్రతీదానికి కేసీఆర్‌దే బాధ్యత.
సాక్షి, హైదరాబాద్: ‘‘కొందరు బ్రోకర్ గాండ్లు అడ్డంపొడుగు మాట్లాడుతున్నరు. దేవుడు నోరిచ్చిండని కుక్కలు మొరిగినట్లు మొరుగుతమంటే.. ప్రజలు ఏది వాస్తవమో అవాస్తవమో గమనిస్తరు. కాకరకాయ, గీకరకాయలు అనకుంట ఎన్నికలతో లింకు లేకుంటనే.. ప్రజలకు అవసరమైన వాటితో ముందుకు వెళ్తున్నం. ప్రజలు ఆశీర్వదిస్తున్నరు. మాకు కొంతలో కొంత మంచి జరుగుతూ వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నం. మేమేమన్నా ఓట్లు గుంజుకుంటున్నమా? జనం ఓట్లు వేస్తేనే గెలుస్తున్నాం..’’ అని టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ప్రజల అనుభవాలు, ఆకాంక్షల మేరకే తమ ప్రభుత్వం ముందుకు పోతోందని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హుజూరాబాద్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి బుధవారం తెలంగాణభవన్ వేదికగా టీఆర్‌ఎస్‌లో చేరారు. కౌశిక్‌రెడ్డికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమాలు, విపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్ చెప్పిన అంశాలు, చేసిన విమర్శలు ఆయన మాటల్లోనే..
నన్ను తిట్టినట్టు ఎవరినీ తిట్టలే..
‘‘వంకర టింకర చెప్పేటోడు అక్కడొకడు ఇక్కడొకడు ఉంటడు. తెలంగాణ కోసం జెండా ఎత్తింది మొదలు నన్ను తిట్టినట్టు ప్రపంచంలో ఎవరినీ తిట్టలేదనుకుంటా. ఎవరేమన్నా భయపడకుండా తెలంగాణ సాధించిన. ఎన్నికల రాజకీయాలు చిల్లర ముచ్చట.. ఓసారి గెలుస్తం.. మరోసారి ఓడిపోతం. కొందరు అధికారంలోకి రావడం గొప్ప విషయం అనుకుంటరు. దానికోసం ఒకడు బాగా ఒర్రుతడు. మనకు తిట్లురావా, నీ ఒక్కడికే తిట్లు వచ్చా. సంస్కర వంతులు, సంయమనం పాటించే వారు తిట్టరు. చెడు జరిగితే విమర్శిస్తారు. కానీ ప్రతిదానిని అడ్డగోలుగా వక్రీకరించి కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లు కొందరు ఉంటారు. ఇలాంటి ప్రతీప శక్తులు (నెగెటివ్ ఫోర్సెస్) ఎప్పుడూ ఉంటయి. అలాంటి వారి కోసం నిర్మాణాత్మకంగా పనిచేసేవారు తమ ప్రయాణం ఆపబోరు.
హరీశ్‌రావుతో సీఎం కేసీఆర్ మాటామంతీ
వరుసలో ఉన్నవారికి పదవులు వస్తాయి
కష్టపడి సాధించిన తెలంగాణను బాగుచేసే బాధ్యత కౌశిక్‌రెడ్డి లాంటి యువకులపై ఉంది. కౌశిక్‌రెడ్డికి హామీ ఇస్తున్నా ఆయనను కేవలం హూజురాబాద్, కరీంనగర్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా పనిచేసే అవకాశాలు వస్తాయి. ముందు నాగలి తర్వాత వెనుక నాగలి అన్నట్టుగా వరుసలో ఉన్న వారికి పదవులు ఆటోమేటిగ్గా వస్తాయి. కార్యకర్తలు కూడా ఆయన వెంట గట్టిగా ఉండాలె. పార్టీలో ఎదిగే యువతకు భవిష్యత్తు అవకాశాలు ఉంటాయి. నాయకులు ఇక్కడ నుంచే వస్తరు..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కౌశిక్‌రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కౌశిక్‌రెడ్డి వెంట వచ్చిన హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలకు కూడా కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment