
హుజూరాబాద్: ఎంపీగా హుజూరాబాద్ నియోజకవర్గానికి బండి సంజయ్ చేసిందేమీ లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. బుధవారం హుజూరాబాద్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో చెప్తామని.. ప్రజలకు మీరేం చేశారో చెప్పే ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు.
గడిచిన ఏడేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడమే బీజేపీ చేసిన అభివృద్ధా అని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే బీజేపీ నాయకులు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీగా వ్యవహరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని బీజేపీ నాయకులకు హితవు పలికారు.
మరో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని కొనలేమని కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు లేఖ రాసిందని, బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలపై మంత్రి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బండి సంజయ్ టీఆర్‌ఎస్‌పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, దళిత బంధుపై బీజేపీ నాయకులు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment