
హైదరాబాద్: తన సవాల్‌ను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్వీకరించలేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి విమర్శించారు. డ్రగ్స్ కేసులో తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే భాగ్యలక్ష్మి ఆలయానికి రావాలని శనివారం సవాల్ చేశారు రోహిత్‌రెడ్డి.
ఈ రోజు(ఆదివారం) భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చిన రోహిత్ రెడ్డి.. తన సవాల్‌ను బండి సంజయ్ స్వీకరించలేదంటూ ఎద్దేవా చేశారు. దాంతో సంజయ్ చేసిన ఆరోపణలు తప్పని ప్రజలకు అర్థమైందన్నారు. బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, మతం పేరుతో రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికల అఫిడవిట్‌లో తాను తప్పుడు పత్రాలు సమర్పించినట్లు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ చేసిన ఆరోపణులు నిరూపించాలని సవాల్ విసిరారు రోహిత్‌రెడ్డి. రఘునందన్ చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే రఘునందన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.