హు‘జోరు’ ఎవరిదో..? | who will win from Huzurabad assembly constituency for general elections ? | Sakshi
Sakshi News home page

హు‘జోరు’ ఎవరిదో..?

Published Tue, Apr 22 2014 1:39 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

హు‘జోరు’ ఎవరిదో..? - Sakshi

హు‘జోరు’ ఎవరిదో..?

టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో విజేత ఎవరవుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.  ఇక్కడ మరోసారి సత్తా చాటాలని టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుంటే, ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. వైఎస్ సంక్షేమ పథకాలే అండగా వైఎస్సార్ సీపీ, గతంలో జరిగిన అభివృద్ధి మంత్రంతో తెలుగుదేశం పార్టీలు బరిలో ఉన్నాయి.
 
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం
ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 5,
టీడీపీ -4, టీఆర్‌ఎస్-2, స్వతంత్రులు-2
ప్రస్తుత ఎమ్మెల్యే: ఈటెల రాజేందర్ (టిఆర్‌ఎస్)
రిజర్వేషన్: జనరల్
నియోజకవర్గ ప్రత్యేకతలు: తెలంగాణ ఉద్యమ  చైతన్యం,
ఎస్సీ ఓట్ల ప్రభావం, బీసీలు కీలకం, పార్టీల కన్నా వ్యక్తులకే ప్రాధాన్యత
ప్రస్తుతం బరిలో నిలిచింది: 9
 ప్రధాన అభ్యర్థులు వీరే..
 ఈటెల రాజేందర్(టిఆర్‌ఎస్)
 కేతిరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్)
 సందమల్ల నరేశ్ (వైఎస్సార్‌సీపీ)
 ముద్దసాని కశ్యప్‌రెడ్డి (టిడిపి)
 
పైడిపెల్లి అరుణ్, హుజూరాబాద్: నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత 13సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు అన్ని పార్టీలను ఆదరించారు. చివరికి మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులను గెలిపించి పార్టీల కంటే వ్యక్తులే ముఖ్యమని చాటారు. 2008, 2010 ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌కు భారీ మెజార్టీని అందించి తెలంగాణ సెంటిమెంట్‌కు అండగా నిలిచారు.
 
 మొత్తంగా ఉప ఎన్నికలతో కలిపి నాలుగుసార్లు టీఆర్‌ఎస్ తరపున గెలిచి శాసనసభా పక్ష నేతగా ఉన్న ఈటెల మరోసారి బరిలో నిలిచారు. ఇక 2008 ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ప్రముఖ కాంట్రాక్టర్  కేతిరి సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డికి ఆయున సోదరుడు. మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయుడు కశ్యప్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. యువకుడైన సందమల్ల నరేశ్ వైఎస్సార్‌సీపీ నుంచి రేసులో ఉన్నారు.
 
 చేతులు కాలుతూనే ఉన్నాయి
 కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు కేటాయించిన 1978 నుంచి ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు. 1989లో కాంగ్రెస్‌కే చెందిన కేతిరి సాయిరెడ్డి విజయం సాధించినప్పటికీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆ తర్వాత రెండుసార్లు టీడీపీ, 2004 నుంచి టిఆర్‌ఎస్ వైపే ప్రజలు మొగ్గుచూపారు.
 
 కనీసం ఇప్పుడైనా ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్సే ఇచ్చిందన్న బలమైన ప్రచారంతో ఇప్పుడైనా పాగా వేయూలనే ఆశల్లో ఉంది. సిద్దిపేట తర్వాత అంతటి ఉద్యమ నేపథ్యమున్న హుజూరాబాద్‌లో మరోసారి గులాబి జెండా ఎగరడం ఖాయమని టిఆర్‌ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విభిన్నమైన తీర్పును ఇచ్చే హుజూరాబాద్ ఓటర్లు ఈసారి వుళ్లీ సెంటిమెంట్‌కే పట్టం కడతారా అన్న ఉత్కంఠ నెలకొంది.  ముద్దసాని దామోదర్‌రెడ్డి ఒక్కరే ఇక్కడి నుంచి సాధారణ ఎన్నికల్లో  వరుసగా నాలుగుసార్లు గెలిచారు.
 
 టీఆర్‌ఎస్ ఆవిర్భావంతో టీడీపీ కంచుకోట బీటలువారింది. మొదటిసారి వైఎస్సార్‌సీపీ ఇక్కడ పోటీ చేస్తోంది. దివంగత రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వేలాది మంది నియోజకవర్గంలో ఉన్నారు. వారి ఆదరణ తనకు అనుకూలంగా మారుతుందని నరేశ్  ఆశిస్తున్నారు.  ఆ పథకాలను కొనసాగిస్తామంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు.  ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
 నే.. గెలిస్తే..
-    హుజూరాబాద్, జమ్మికుంటలలో తాగునీటి సమస్య పరిష్కారం
-    పాలిటెక్నిక్ కళాశాలతోపాటు కొత్త విద్యాసంస్థల ఏర్పాటు
-   రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
 - ఈటెల రాజేందర్ (టిఆర్‌ఎస్)
 
- మండలకేంద్రాల్లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు, క్రీడా విద్యకు ప్రాధాన్యం
-   జమ్మికుంటలో ఆర్టీసీ డిపో ఏర్పాటు
-    వైఎస్ పథకాల అమలుకు కృషి
 - సందమల్ల నరేశ్ (వైఎస్సార్సీపీ)
 
-  హుజూరాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పన
-   పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ
- పరిశ్రమలు ఏర్పాటుతో యువతకు ఉపాధి కల్పన
- కేతిరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్)
 
-   అన్ని మండలాల్లో పరిశ్రమల ఏర్పాటు.
 -   మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
-   గ్రామాల్లో కనీస వసతుల కల్పన
-   రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.
 - ముద్దసాని కశ్యప్‌రెడ్డి (టీడీపీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement