Huzurabad assembly constituency
-
ఆపింది.. మీరంటే మీరే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు పథకం నిలిపివేత రాజకీయ రగడకు దారితీసింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నిక ముగిసే వరకు ఆ పథకాన్ని ఆపాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) ఆదేశించడంతో స్థానికంగా ఉన్న ప్రధాన పార్టీల నేతలు, దళితులు ఆందోళనలకు దిగారు. పథకం నిలిచిపోవడానికి కారణం ‘మీరంటే.. మీరు’అంటూ పోటాపోటీ నిరసనలకు దిగారు. సోమవారంరాత్రి సీఈసీ నుంచి ప్రకటన వెలువడగానే హుజూరాబాద్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అర్ధరాత్రి దాటాక మొదలైన ఈ నిరసనలు మంగళవారం కూడా కొనసాగాయి. ఇటు గులాబీ శ్రేణులు, అటు కాషాయదళాలు పరస్పరం సీఎం కేసీఆర్, ఈటల రాజేందర్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. సోమవారం అర్ధరాత్రి దాటాక హుజూరాబాద్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్–బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నిరసనలకు దిగారు. ►జమ్మికుంటలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ►జమ్మికుంట అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ విజయ ఆధ్వర్యంలో ఈటలదహనానికి వచ్చారు. అక్కడ బీజేపీ నేతలు ఎదురుపడటంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ►జమ్మికుంట మండలం కోరపల్లిలోనూ బీజేపీ–టీఆర్ఎస్ నాయకులు దిష్టిబొమ్మ దహనాలకు యత్నించడంతో తోపులాట జరిగింది. ►వీణవంక మండలం వలబాపూర్ రహదారిపై ఈటలకు వ్యతిరేకంగా దళితులు ధర్నా చేశారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను దహనం చేశా రు. వీణవంక బస్టాండ్ వద్ద మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. 15 గ్రామా ల్లో ఈటల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. జమ్మికుంటలో పోలీసులు, బీజేపీ నేతల వాగ్వాదం -
టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తావా?
హుజూరాబాద్: ‘హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకవేళ ఆ పార్టీ ఓడిపోతే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? కేసీఆర్‌కు దమ్ముంటే సమాధానమివ్వాలి’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. హుజూరాబాద్‌లో సైలెంట్ ఓటింగ్ జరగబోతోందని, బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఇక ఎవరితరమూ కాదన్నారు. అసెంబ్లీలో ఇప్పటికే బీజేపీ తరఫున డబుల్ ‘ఆర్’(రాజాసింగ్, రఘునందన్‌రావు) ఉన్నారని, త్వరలో మరో ‘ఆర్’(రాజేందర్) అడుగు పెట్టబోతున్నారని జోస్యం చెప్పారు. ఇక నుంచి సీఎంకు అసెంబ్లీలో బీజేపీ ట్రిపుల్ ‘ఆర్’సినిమా చూపించబోతోందని వ్యాఖ్యానించారు. ఆదివారం హుజూరాబాద్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఎన్నికల శంఖారావం పూరించారు. సంజయ్ మాట్లాడుతూ..కరెన్సీ నోట్లతో ఓట్లను కొనాలని టీఆర్ఎస్ పార్టీ చూస్తోందని, అయినా ఆపార్టీకి డిపాజిట్ కూడా దక్కదని పేర్కొన్నారు. బీజేపీకి ఓటేయాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. దళితబంధుకు షరతుల్లేకుండా రూ.10 లక్షలు ఇస్తున్నామని ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడేమో ఏవేవో షరతులు పెడుతున్నారని ఆరోపించారు. స్వీయమానసిక ధోరణి రుద్దుతున్నారు: ఈటల హుజూరాబాద్‌లో రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన కేసీఆర్.. స్వీయ మానసిక ధోరణిని ప్రజలపై రుద్దుతున్నారని మాజీమంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. 13, 14 తేదీల్లో తనపై తానే దాడి చేయించుకుంటానని ఓ మంత్రి, ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారని, ఈటల బరిగీసి కొట్లాడుతడు తప్ప చిల్లర పనులు చేయడని స్పష్టం చేశారు. కంకణం కట్టుకుందాం.. కమలాన్ని గెలిపిద్దాం ప్రజా సంగ్రామయాత్ర తొలిదశ పూర్తయిన నేపథ్యంలో ఆదివారం చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సతీసమేతంగా పూజలు నిర్వహించారు. తొలిదశ యాత్ర విజయవంతమైందన్నారు. కమలాన్ని గెలుపొందించాలని కంకణం కట్టుకుందాం అని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థిగా ‘ఈటల’ సాక్షి, న్యూఢిల్లీ: హుజూరాబాద్ ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను బీజేపీ అధి ష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. -
ఈటల డైలాగులకు ఆగం కావద్దు: మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పే సెంటిమెంట్ డైలాగులకు ఆగం కావద్దని, పనులు చేసేవాళ్లు, ప్రజల కష్టాలు తీర్చేవాళ్లే మనకు కావాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్‌లో మహిళా స్వయంసహాయక సంఘాలకు రూ.కోటీ 25 లక్షల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏడేళ్ల మంత్రి ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని అడగడం తప్పా. ఒక్క మహిళా సంఘ భవనం ఎందుకు నిర్మించలేదని అడిగితే కొందరు ఉలిక్కిపడుతున్నారు. నన్ను అనరాని మాటలంటున్నారు. నోటికొచ్చినట్టు తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను తిట్టడం న్యాయమా.. ప్రజలే చెప్పాలి’అని అన్నారు. తొందరలోనే మున్సిపల్ పరిధిలో 4 చోట్ల మహిళా సంఘాల భవనాలు కట్టిస్తామని చెప్పారు. రాష్ట్రమంతటా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టినా హుజూరాబాద్‌లో మాత్రం కట్టించలేదని ఇక్కడి మహిళలు చెబుతున్నారని, ఇది ఎవరి నిర్లక్ష్యమని అన్నారు. కొందరు సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు కావాలంటున్నారని, త్వలోనే ఆ కార్యక్రమాన్ని అన్ని చోట్లా ప్రారంభిస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆడపిల్ల పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, కానీ తమ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ప్రతీ పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తోందని అన్నారు. హుజూరాబాద్ పట్టణంలో ఏ గల్లీ రోడ్లు చూసినా ఆధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీలు కూడా సక్రమంగా లేవని పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రూ.35 కోట్లు మంజూరు చేశామని, పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. అలాగే సైదాపూర్–బోర్నపల్లి రోడ్డు అధ్వానంగా ఉందని, దానికోసం రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేసి సొంత ఇళ్లకు పంపిస్తానని హామీ ఇచ్చారు. ‘కొందరు బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇస్తున్నారట, మీకు రూపాయి బొట్టు బిళ్లలిచ్చేవారు కావాలా? రూ.2 వేల ఫించన్ ఇచ్చేవాళ్లు కావాలా? రూ.60 గడియారం కావాలా? లక్ష రూపాయల కల్యాణలక్ష్మి ఇచ్చేవాళ్లు కావాలా? గడియారాలకు, బొట్టుబిళ్లలకు మోసపోతారా? దీనిపై హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలి’అని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే...
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక తెరపైకి వచ్చినప్పటి నుంచి సీఎం కేసీఆర్ కొంగ జపం చేస్తున్నారని, ఒక్క అసెంబ్లీ స్థానం గెలవడానికి ఆయన దిగజారి వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ ఎ. రేవంత్‌రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్ దళితబంధు సభలో సీఎం అన్నీ అబద్ధాలు చెప్పారని, ఆయన మాటల్లో పిరికితనం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. అబద్ధాల పునాదులపై బీటలు వారుతున్న గులాబీ కోటను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బెల్లయ్య నాయక్, సిరిసిల్ల రాజయ్య, అనిల్‌కుమార్ యాదవ్, మెట్టు సాయికుమార్, నర్సారెడ్డి తదితరులతో కలసి రేవంత్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో దళితులను పాచికలా వాడుకున్న కేసీఆర్... ఏడున్నరేళ్లలో ఎప్పుడూ అంబేడ్కర్, జగజ్జీవన్‌రాంల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించలేదని విమర్శించారు. నెక్లెస్ రోడ్డులో అంబేడ్కర్ భారీ విగ్రహం పెడతానని చెప్పి ఇప్పటివరకు తట్టెడు మట్టి కూడా తీయలేదని దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల చొప్పున భూపంపిణీ, దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేత, 4 వేల సింగిల్ టీచర్ స్కూళ్ల మూసివేత, 9.50 లక్షల మంది దళితుల ఉపాధి దరఖాస్తుల తిరస్కృతి, ఇసుక మాఫియాను అడ్డుకున్న దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగం, దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ వంటి ఉదంతాలన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వ ‘ఘనత’లేనని చురకలంటించారు. దళితులకు అన్యాయం చేసిన వారిలో మొదటి ముద్దాయి కేసీఆరేనని రేవంత్ ఆక్షేపించారు. ఒక్క శాసనసభ ఎన్నికలో గెలవడం కోసం కేసీఆర్ తన భార్య శోభను కూడా రాజకీయాల్లోకి తెచ్చారని, ఆయన పాపాలను కడుక్కోవడానికి శోభమ్మను ముందుకు తెస్తున్నారని దుయ్యబట్టారు. 6 నెలల్లోగా ఇస్తారా? రాష్ట్రంలోని 30 లక్షల కుటుంబాలకు దళితబంధు కింద రూ. 10 లక్షలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వాలని, ఇందుకోసం శాసనసభను సమావేశపరిచి ఒక రోజంతా చర్చ చేసి తీర్మానం చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. దళిత కుటుంబాలకు ఆరు నెలల్లోపు రూ. 10 లక్షలు ఇస్తామంటే కాంగ్రెస్ పక్షాన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో వచ్చే తుపానుకు కేసీఆర్ కొట్టుకుపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. దళితులను మోసం చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ ఇంటి ముందు చావు డప్పు మోగిస్తామని, రావిర్యాల సభ తర్వాత హుజూరాబాద్‌పై దండెత్తుతామని రేవంత్ చెప్పారు. -
పోలీసుల నిర్బంధంలో హుజూరాబాద్
ఇల్లందకుంట (హుజురాబాద్): హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలీసుల నిర్బంధం, చీకటిరాజ్యం నడుస్తోందని మాజీమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. జమ్మికుంటలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హుజూరాబాద్ ప్రజల మీద తోడేళ్లలాగా విరుచుకుపడుతున్నారని, బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీని తెలంగాణలో నిషేధిత పార్టీగా చూస్తున్నారని.. చరిత్రలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ మరింత దిగజారి నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇంటెలిజెన్స్ ప్రభాకర్‌రావు టీం సభ్యులు ఇంటింటికీ వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారని, వారిపై కేంద్ర హోంమంత్రికి, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రశ్నించేవారందరినీ ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. నక్సలైట్లకు అన్నం పెట్టినవారిని వేధించినప్పటి పరిస్థితులు మళ్లీ ఇప్పుడు పునరావృతమవుతున్నాయని పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని ఈటల డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎర్రబెల్లి సంపత్‌రావు, జీడీ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ ఫోకస్: ఈటల బాటలో నడిచేదెవరు?
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైందనే వార్తల నేపథ్యంలో ఆయన వెంట నడిచే పార్టీ నేతలు ఎవరున్నారనే దానిపై టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ అయిన మరుక్షణం నుంచే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులను కట్టడి చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్‌ను పార్టీ రంగంలోకి దించింది. రాష్ట్ర స్థాయిలో మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్‌తో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి హుజూరాబాద్ నేతల కట్టడి వ్యూహాన్ని అమలు చేస్తోంది. మండలాల వారీగా ఇన్చార్జీలను నియమించి స్థానిక ప్రజా ప్రతినిధులంతా పార్టీ వెంట నడిచేలా ప్రకటనలు ఇప్పించడంలో సఫలమైంది. హుజూరాబాద్‌లో నేటికీ ఈటల వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్న నేతలు, క్రియాశీల కార్యకర్తలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఏనుగు మినహా..! ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత టీఆర్ఎస్ ముఖ్య నేతలెవరూ ఆయనతో భేటీ అయిన దాఖలాల్లేవు. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తులా ఉమ మాత్రమే ఈటలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రవీందర్‌రెడ్డి ఒక్కరు మాత్రమే వివిధ పార్టీల నేతలతో ఈటల జరుపుతున్న మంతనాల్లో పాల్గొంటున్నారు. ఈటల బీజేపీ లేదా ఇతర పార్టీల్లో చేరడమో, సొంత పార్టీని ఏర్పాటు చేయడమో జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏనుగు రవీందర్‌రెడ్డి ఒక్కరే ఆయన వెంట నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో టీఆర్ఎస్లో క్రియాశీలంగా పనిచేసి ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ వంటి వారు ఈటలతో భేటీ అయినా ఆయనతో నడిచే పరిస్థితులు కనిపించడం లేదు. ఈటల దారిపై స్పష్టత వస్తేనే.. ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్తో పనిచేస్తున్న వారితోపాటు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన వారి నడుమ చాలా నియోజకవర్గాల్లో అంతర్గత పోరు నడుస్తోంది. సుమారు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ప్రస్తుతం టీఆర్ఎస్ గొడుగు కిందే పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ అవకాశాలు వస్తాయనే ఆశతో స్థానికంగా ఇబ్బందులున్నా పార్టీలోనే కొనసాగుతున్నారు. తాండూరు, కొల్లాపూర్, నకిరేకల్ వంటి నియోజకవర్గాల్లో అడపాదడపా విభేదాలు బయటపడినా ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ను వీడేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన నెలరోజులవుతున్నా ఈటల వైపు నుంచి స్థిరమైన నిర్ణయాలేవీ వెలువడకపోవడాన్నీ అసంతృప్త నేతలు విశ్లేషించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈటల దారిపై స్పష్టత వస్తేనే అసంతృప్త నేతలు నిర్ణయం తీసుకునే వీలుంది. -
హు‘జోరు’ ఎవరిదో..?
టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలో విజేత ఎవరవుతారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఇక్కడ మరోసారి సత్తా చాటాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే, ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. వైఎస్ సంక్షేమ పథకాలే అండగా వైఎస్సార్ సీపీ, గతంలో జరిగిన అభివృద్ధి మంత్రంతో తెలుగుదేశం పార్టీలు బరిలో ఉన్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎవరెన్నిసార్లు గెలిచారు: కాంగ్రెస్ - 5, టీడీపీ -4, టీఆర్ఎస్-2, స్వతంత్రులు-2 ప్రస్తుత ఎమ్మెల్యే: ఈటెల రాజేందర్ (టిఆర్ఎస్) రిజర్వేషన్: జనరల్ నియోజకవర్గ ప్రత్యేకతలు: తెలంగాణ ఉద్యమ చైతన్యం, ఎస్సీ ఓట్ల ప్రభావం, బీసీలు కీలకం, పార్టీల కన్నా వ్యక్తులకే ప్రాధాన్యత ప్రస్తుతం బరిలో నిలిచింది: 9 ప్రధాన అభ్యర్థులు వీరే.. ఈటెల రాజేందర్(టిఆర్ఎస్) కేతిరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్) సందమల్ల నరేశ్ (వైఎస్సార్సీపీ) ముద్దసాని కశ్యప్‌రెడ్డి (టిడిపి) పైడిపెల్లి అరుణ్, హుజూరాబాద్: నియోజకవర్గ ఆవిర్భావం తర్వాత 13సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు అన్ని పార్టీలను ఆదరించారు. చివరికి మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులను గెలిపించి పార్టీల కంటే వ్యక్తులే ముఖ్యమని చాటారు. 2008, 2010 ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌కు భారీ మెజార్టీని అందించి తెలంగాణ సెంటిమెంట్‌కు అండగా నిలిచారు. మొత్తంగా ఉప ఎన్నికలతో కలిపి నాలుగుసార్లు టీఆర్ఎస్ తరపున గెలిచి శాసనసభా పక్ష నేతగా ఉన్న ఈటెల మరోసారి బరిలో నిలిచారు. ఇక 2008 ఉప ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన ప్రముఖ కాంట్రాక్టర్ కేతిరి సుదర్శన్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డికి ఆయున సోదరుడు. మాజీ మంత్రి స్వర్గీయ ముద్దసాని దామోదర్‌రెడ్డి తనయుడు కశ్యప్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. యువకుడైన సందమల్ల నరేశ్ వైఎస్సార్సీపీ నుంచి రేసులో ఉన్నారు. చేతులు కాలుతూనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు కేటాయించిన 1978 నుంచి ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఒక్కసారి కూడా ఆ పార్టీ గెలవలేదు. 1989లో కాంగ్రెస్‌కే చెందిన కేతిరి సాయిరెడ్డి విజయం సాధించినప్పటికీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఆ తర్వాత రెండుసార్లు టీడీపీ, 2004 నుంచి టిఆర్ఎస్ వైపే ప్రజలు మొగ్గుచూపారు. కనీసం ఇప్పుడైనా ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్సే ఇచ్చిందన్న బలమైన ప్రచారంతో ఇప్పుడైనా పాగా వేయూలనే ఆశల్లో ఉంది. సిద్దిపేట తర్వాత అంతటి ఉద్యమ నేపథ్యమున్న హుజూరాబాద్‌లో మరోసారి గులాబి జెండా ఎగరడం ఖాయమని టిఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విభిన్నమైన తీర్పును ఇచ్చే హుజూరాబాద్ ఓటర్లు ఈసారి వుళ్లీ సెంటిమెంట్‌కే పట్టం కడతారా అన్న ఉత్కంఠ నెలకొంది. ముద్దసాని దామోదర్‌రెడ్డి ఒక్కరే ఇక్కడి నుంచి సాధారణ ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు గెలిచారు. టీఆర్ఎస్ ఆవిర్భావంతో టీడీపీ కంచుకోట బీటలువారింది. మొదటిసారి వైఎస్సార్సీపీ ఇక్కడ పోటీ చేస్తోంది. దివంగత రాజశేఖర్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలతో లబ్ధి పొందిన వేలాది మంది నియోజకవర్గంలో ఉన్నారు. వారి ఆదరణ తనకు అనుకూలంగా మారుతుందని నరేశ్ ఆశిస్తున్నారు. ఆ పథకాలను కొనసాగిస్తామంటూ ఆయన ప్రచారం చేస్తున్నారు. ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. నే.. గెలిస్తే.. - హుజూరాబాద్, జమ్మికుంటలలో తాగునీటి సమస్య పరిష్కారం - పాలిటెక్నిక్ కళాశాలతోపాటు కొత్త విద్యాసంస్థల ఏర్పాటు - రెవెన్యూ డివిజన్ ఏర్పాటు - ఈటెల రాజేందర్ (టిఆర్ఎస్) - మండలకేంద్రాల్లో స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు, క్రీడా విద్యకు ప్రాధాన్యం - జమ్మికుంటలో ఆర్టీసీ డిపో ఏర్పాటు - వైఎస్ పథకాల అమలుకు కృషి - సందమల్ల నరేశ్ (వైఎస్సార్సీపీ) - హుజూరాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పన - పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ - పరిశ్రమలు ఏర్పాటుతో యువతకు ఉపాధి కల్పన - కేతిరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్) - అన్ని మండలాల్లో పరిశ్రమల ఏర్పాటు. - మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం - గ్రామాల్లో కనీస వసతుల కల్పన - రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. - ముద్దసాని కశ్యప్‌రెడ్డి (టీడీపీ)