మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కును అందజేస్తున్న మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పే సెంటిమెంట్ డైలాగులకు ఆగం కావద్దని, పనులు చేసేవాళ్లు, ప్రజల కష్టాలు తీర్చేవాళ్లే మనకు కావాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్‌లో మహిళా స్వయంసహాయక సంఘాలకు రూ.కోటీ 25 లక్షల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏడేళ్ల మంత్రి ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని అడగడం తప్పా. ఒక్క మహిళా సంఘ భవనం ఎందుకు నిర్మించలేదని అడిగితే కొందరు ఉలిక్కిపడుతున్నారు. నన్ను అనరాని మాటలంటున్నారు. నోటికొచ్చినట్టు తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను తిట్టడం న్యాయమా.. ప్రజలే చెప్పాలి’అని అన్నారు.
తొందరలోనే మున్సిపల్ పరిధిలో 4 చోట్ల మహిళా సంఘాల భవనాలు కట్టిస్తామని చెప్పారు. రాష్ట్రమంతటా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టినా హుజూరాబాద్‌లో మాత్రం కట్టించలేదని ఇక్కడి మహిళలు చెబుతున్నారని, ఇది ఎవరి నిర్లక్ష్యమని అన్నారు. కొందరు సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు కావాలంటున్నారని, త్వలోనే ఆ కార్యక్రమాన్ని అన్ని చోట్లా ప్రారంభిస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆడపిల్ల పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, కానీ తమ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ప్రతీ పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తోందని అన్నారు. హుజూరాబాద్ పట్టణంలో ఏ గల్లీ రోడ్లు చూసినా ఆధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీలు కూడా సక్రమంగా లేవని పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రూ.35 కోట్లు మంజూరు చేశామని, పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు.
అలాగే సైదాపూర్–బోర్నపల్లి రోడ్డు అధ్వానంగా ఉందని, దానికోసం రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే డబుల్ బెడ్‌రూం ఇళ్లు పూర్తి చేసి సొంత ఇళ్లకు పంపిస్తానని హామీ ఇచ్చారు. ‘కొందరు బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇస్తున్నారట, మీకు రూపాయి బొట్టు బిళ్లలిచ్చేవారు కావాలా? రూ.2 వేల ఫించన్ ఇచ్చేవాళ్లు కావాలా? రూ.60 గడియారం కావాలా? లక్ష రూపాయల కల్యాణలక్ష్మి ఇచ్చేవాళ్లు కావాలా? గడియారాలకు, బొట్టుబిళ్లలకు మోసపోతారా? దీనిపై హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలి’అని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్‌ఎస్ నేత కౌశిక్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గందె రాధిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment