tanneru harish rao
-
హరీశ్.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)సాక్షి, హైదరాబాద్: ఇప్పటికైనా మంత్రి హరీశ్‌రావు బుద్ధి తెచ్చుకొని పిచ్చి పనులు చేయకుండా ఉండాలని ఈ సిద్దిపేట గడ్డ నుంచే హెచ్చరిస్తున్నానని హుజూర్బాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కుట్రలు, డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నవారికి హుజూరాబాద్‌లో ఎదురైన అనుభవమే రాబోయే కాలంలోనూ తప్పదని హెచ్చరించారు. త్వరలోనే సిద్దిపేటలో దళితగర్జన సభ పెడతామని, దానికి తానే నాయకత్వం వహిస్తానన్నారు. ఉపఎన్నికలో విజయం సాధించిన ఈటల శుక్రవారం సిద్దిపేటలోని రంగదాంపల్లి అమరవీరులస్తూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ఈటలకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈటల మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు హరీశ్‌రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే ట్రబుల్ షూటర్ పేరిట రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నిక జరిగినా అక్కడికి వెళ్లి సిద్దిపేటను అభివృద్ధి చేసిన విధంగానే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానంటూ అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అబద్ధాల మంత్రిగా పేరు సంపాదించారని విమర్శించారు. దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారిగా నగరానికి.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపొందిన అనంతరం మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తొలిసారిగా శనివారం హైదరాబాద్ రానున్నారు. అసెంబ్లీ ఎదుటనున్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటలకు పౌరసన్మానం జరగనుంది. బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించాక ఆదివారం మొదటిసారిగా కొత్త కార్యవర్గం ఢిల్లీలో సమావేశం కానుంది. పార్టీ జాతీయకార్యవర్గ సభ్యుడి హోదాలో ఈటల మొదటిసారిగా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. -
ఈటల డైలాగులకు ఆగం కావద్దు: మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పే సెంటిమెంట్ డైలాగులకు ఆగం కావద్దని, పనులు చేసేవాళ్లు, ప్రజల కష్టాలు తీర్చేవాళ్లే మనకు కావాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన హుజూరాబాద్‌లో మహిళా స్వయంసహాయక సంఘాలకు రూ.కోటీ 25 లక్షల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఏడేళ్ల మంత్రి ఒక్క ఇల్లు కూడా ఎందుకు కట్టలేదని అడగడం తప్పా. ఒక్క మహిళా సంఘ భవనం ఎందుకు నిర్మించలేదని అడిగితే కొందరు ఉలిక్కిపడుతున్నారు. నన్ను అనరాని మాటలంటున్నారు. నోటికొచ్చినట్టు తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను తిట్టడం న్యాయమా.. ప్రజలే చెప్పాలి’అని అన్నారు. తొందరలోనే మున్సిపల్ పరిధిలో 4 చోట్ల మహిళా సంఘాల భవనాలు కట్టిస్తామని చెప్పారు. రాష్ట్రమంతటా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టినా హుజూరాబాద్‌లో మాత్రం కట్టించలేదని ఇక్కడి మహిళలు చెబుతున్నారని, ఇది ఎవరి నిర్లక్ష్యమని అన్నారు. కొందరు సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు డబ్బులు కావాలంటున్నారని, త్వలోనే ఆ కార్యక్రమాన్ని అన్ని చోట్లా ప్రారంభిస్తామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆడపిల్ల పెళ్లికి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని, కానీ తమ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా ప్రతీ పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇస్తోందని అన్నారు. హుజూరాబాద్ పట్టణంలో ఏ గల్లీ రోడ్లు చూసినా ఆధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీలు కూడా సక్రమంగా లేవని పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే రూ.35 కోట్లు మంజూరు చేశామని, పనులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. అలాగే సైదాపూర్–బోర్నపల్లి రోడ్డు అధ్వానంగా ఉందని, దానికోసం రూ.6 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు పూర్తి చేసి సొంత ఇళ్లకు పంపిస్తానని హామీ ఇచ్చారు. ‘కొందరు బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు, గ్రైండర్లు ఇస్తున్నారట, మీకు రూపాయి బొట్టు బిళ్లలిచ్చేవారు కావాలా? రూ.2 వేల ఫించన్ ఇచ్చేవాళ్లు కావాలా? రూ.60 గడియారం కావాలా? లక్ష రూపాయల కల్యాణలక్ష్మి ఇచ్చేవాళ్లు కావాలా? గడియారాలకు, బొట్టుబిళ్లలకు మోసపోతారా? దీనిపై హుజూరాబాద్ ప్రజలు ఆలోచన చేయాలి’అని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక తదితరులు పాల్గొన్నారు. -
‘కేంద్ర బడ్జెట్ రాష్ట్రాలను ఆదుకునెలా ఉండాలి’
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ (2021–22) రాష్ట్రాలను ఆదుకొనేలా ఉండాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఆర్థిక సంఘం సిఫారసుల అమలు నుంచి వికలాంగులకు అందించే సాయం వరకు కేంద్రం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను ఆయన నిర్మలా సీతారామన్‌కు వివరించారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి హరీశ్‌రావుతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రోస్, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడు జీఆర్ రెడ్డి, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. భేటీలో హరీశ్‌రావు వెలిబుచ్చిన అభిప్రాయాలు... ⇔ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లను బడ్జెట్లో పొందుపరిచి సంపూర్ణంగా అమలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అందులో కొన్నింటిని కేంద్రం అంగీకరించట్లేదు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయకపోవడం వల్ల 2020–21లో తెలంగాణ రూ. 723 కోట్లు నష్టపోయింది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి. ఆర్థిక సంఘం సిఫారసులను యథాతథంగా అమలుపరిచే సంప్రదాయాన్ని కొనసాగించాలి. ⇔ కేంద్రం వసూలు చేస్తున్న సెస్, సర్‌చార్జీలను రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో కలపట్లేదు. దీంతో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. వచ్చే బడ్జెట్ నుంచి సెస్, సర్‌చార్జీలను రద్దు చేసి వాటి స్థానంలో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల రేట్లను పెంచి అధిక నిధులు వచ్చేలా బడ్జెట్‌ను రూపొందించాలి. ⇔ కరోనా వల్ల నష్టపోయిన సంపదను కూడదీసుకోవడంలో భాగంగా జీఎస్డీపీలో 2 శాతం అదనంగా రాష్ట్రాలకు రుణాలు తీసుకొనే అవకాశమిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ప్రజా పెట్టుబడి (పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్)ను ప్రోత్సహించాలి. ఎలాంటి షరతులు లేకుండా ఈ అదనపు రుణాలు తీసుకొనే వెసులుబాటును వచ్చే బడ్జెట్లోనూ కొనసాగించాలి. ⇔ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ›ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం అందించాలి. గత రెండేళ్లకు కలిపి రూ. 900 కోట్లు వెంటనే విడుదల చేయాలి. వచ్చే ఐదేళ్లపాటు ఈ సాయాన్ని కొనసాగించాలి. ⇔ మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ రాయితీ పథకాన్ని దేశవ్యాప్తంగా 50 శాతం జిల్లాలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. గత బడ్జెట్ ప్రసంగంలో ఈ రాయితీ 100 శాతం జిల్లాల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదు. దీన్ని వెంటనే అమలు చేయాలి. ఇందుకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలి. ⇔ బిహార్‌లో ప్రకటించిన విధంగా కరోనా టీకాలను దేశమంతా ఉచితంగా పంపిణీ చేయాలి. ⇔ వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కేంద్రం ఎన్నో ఏళ్ల నుంచి కేవలం రూ. 200 మాత్రమే ఎన్ఎస్ఏపీ కింద సాయం చేస్తోంది. దీన్ని రూ. వెయ్యికి పెంచాలి. జీఎస్టీ పరిహారాన్ని సత్వరమే రాష్ట్రాలకు విడుదల చేయాలి. -
స్ట్రైయిట్ టాక్ - తన్నీరు హరీశ్ రావు
-
ఏ మాత్రం అర్థం లేదు: మంత్రి హరీశ్‌రావు
-
11 మంది డీలర్ల లైసెన్స్ రద్దు చేశాం: హరీశ్‌రావు
సాక్షి, సంగారెడ్డి: రాష్ట్రంలో రైతు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటి నలభై లక్షల ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించినట్లు చెప్పారు. రూ. 14 వేల కోట్లు రైతు బంధు ద్వారా సంవత్సరానికి ఖర్చు పెడుతున్నామని, సంగారెడ్డి జిల్లా అభివృద్ధి సీఎం కేసీఆర్ ఆలోచనకు దగ్గరగా ఉందన్నారు. కాగా సంగారెడ్డి జిల్లాలో 55 శాతం పత్తి సాగు జరుగుతున్నందున.. కల్తీ విత్తనాలు అమ్మిన 11 మంది డీలర్ల లైసెన్స్ రద్దు చేశామని ఆయన చెప్పారు. (పరిశ్రమల కాలుష్యం, కరోనాపై మంత్రి సమీక్ష) కంది ఎలా ఉన్న రూ. 5800 ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. రైతులు అధికారుల దగ్గరికి వెళ్లడం కాదు.. అధికారులే రైతుల దగ్గరికి వెళ్లాలన్నారు. 4 నెలల్లో రైతు బంధు వేదికల నిర్మాణాలు జరగాలన్నారు. జిల్లాలో 116 రైతు బందు వేదికలు ఒకేరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరగాలని ఆయన అధికారులకు సూచించారు. రైతు బంధు వేదికల నిర్మాణాలకు దాతల సహకారం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే రాష్ట్రం చీకటి అవుతందన్నారు.. కానీ నీళ్లు, నిధులు, విద్యుత్ వచ్చి అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. కాగా ఉద్యమ స్పూర్తితో అధికారులు, ప్రజా ప్రతినిధులు పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. -
పరిశ్రమల కాలుష్యం, కరోనాపై మంత్రి సమీక్ష
సాక్షి, సంగారెడ్డి: పరిశ్రమలలో కచ్చితంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఇండస్ట్రీ యాజమాన్యాలను ఆదేశించారు. పరిశ్రమల కాలుష్యం, కరోనా నివారణకి తీసుకుంటున్న చర్యలపై ఇండస్ట్రీ యాజమాన్యాలతో, అధికారులతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. యాజమాన్యాలు బస్సులలో కనీస దూరం పాటించకుండా కార్మికులను తరలిస్తున్నారని మండిపడ్డారు. దీనిని అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్నారు. కరోనాకి జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. (ఇక కరువన్న మాట ఉండదు) విశాఖ గ్యాస్ లికేజీ ఘటనతో జిల్లాలో అప్రమత్తం అయ్యామన్నారు. బాయిలర్, ఫైర్, సెఫ్టీ వాళ్లు సరిగా ఇండస్ట్రీలను తనిఖీ చేయడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లాలో గత సంవత్సరం ఇండస్ట్రీ ప్రమాదాలతో 20 మంది చినిపోయారని, గ్యాస్, బాయిలర్ వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ యాజమాన్యాలకు సూచించారు. పరిశ్రమల నుంచి రాత్రి సమయంలో విషవాయువు వదులుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. సెఫ్టీ అధికారులు వాళ్ల పని చేయడం లేదని యాజమాన్యాలపై ఆయన విరుచుకుపడ్డారు. -
ఆసరా పెన్షన్లు రూ. 875 కోట్ల నిధులు విడుదల
సాక్షి, సిద్దిపేట: మన రాష్ట్రాన్ని కరోనా రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌డౌన్‌ను మే 7 వరకు పోడిగించారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మన రాష్ట్రాన్ని కరోనా నుంచి కాపాడుకోవడం కోసమే లాక్‌డౌన్‌ను పొడగించడం జరిగిందని స్పష్టం చేశారు. కరోనా వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశాలను పాటించుకోకుండా విచ్చలవిడిగా తిరిగితే రాష్ట్రాలన్ని బాధపడుతాయన్నారు. (‘ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలి’) ఇటలీ, యూరప్ వంటి దేశాల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నే ఉన్నామని, అలాంటి పరిస్థితి మనకు రావద్దనే ముందు చూపుతోనే మన సీఎం కేసీఆర్ లాక్‌డౌన్‌ను పోడిగించడం జరిగిందని చెప్పారు. అంతేగాక రేషన్ కార్టు లేనటువంటి వారికి నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన దాతలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర బడ్జేట్ లేకపోయినా మళ్లీ ప్రతి రేషన్ కార్డు దారునికి 12 కిలోల బియ్యం రూ. 1500 ఇవ్వడం జరిగింతుందని వెల్లడించారు. వృద్ధులకు వితంతువులకు ఇచ్చే పెన్షన్లు యధావిధిగా ఇస్తున్నామని తెలిపారు. ఆసరా పెన్షన్లు ఇవ్వడం కోసం రూ. 875 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి వెల్లడించారు. -
చెప్పింది చేశాం: మంత్రి హరీశ్
సాక్షి, సంగారెడ్డి : పేదలు ఆత్మగౌరవంగా బ్రతుకాలన్నదే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలోచన అని ఆర్థిక మంత్రి తన్నీరు హరిశ్‌రావు అన్నారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని సోమవారం సామూహిక గృహప్రవేశం కార్యక్రమంలో భాగంగా బాచేపల్లి గ్రామంలో 50 డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల కోసం పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అంటే కాగితాల్లో ఇండ్లు.. చేతుల్లో బిల్లులు అని విమర్శించారు. సంక్షేమానికి కొత్త నిర్వచనం టీఆర్ఎస్ ప్రభుత్వమని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తామని ప్రగాల్భాలు పలికి.. ఒక్క తండాను కూడా పంచాయతీలుగా చేయలేదన్నారు. టీఆర్ఎస్ వచ్చాక ఏం చేప్పామో అవి చేసి చూపించామన్నారు. గతంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో రెండు రెసిడెన్షియల్ స్కూల్లు ఉంటే టీఆర్ఎస్ వచ్చాక ఎనిమిది కొత్త రెసిడెన్షియల్ పాఠశాలలు తెచ్చి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో నమ్మకాన్ని కలిగించామన్నారు. ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేలు ఖర్చు చేశామని, రాష్ట్రంలో 600 ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు మంజూరు చేశామన్నారు. పెన్షన్లను పెంచి లబ్ధి దారుల ముఖాల్లో ఆనందాన్ని నింపామన్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమాతో రైతులకు తమ ప్రభుత్వం భరోసానిచ్చిందన్నారు. బాచేపల్లి గ్రామ డబుల్ బెడ్రూం ఇళ్లు దేశానికి ఆదర్శంగా నిలుస్థాయని, గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా బాచేపల్లి తండాను భక్తిదామ తండాగా పేరు మార్చాలని గ్రామస్తులు కోరగా వెంటనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. -
హరీశ్‌కు కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టిన రోజును పురస్కరించుకుని టీఆర్ఎస్ నాయకులు శనివారం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హరీశ్‌రావుకు కేటీఆర్ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. హరీశ్‌రావు సమర్థవంతుడైన నాయకుడని కొనియాడారు. ‘స్పష్టమైన భావప్రకటన, కష్టపడేతత్వం, సమర్థత కలిగిన కొంతమంది నాయకుల్లో ఒకరైన హారీశ్‌రావు గారికి జన్మదిన శుభాకాంక్షల’ని కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ట్విటర్ ద్వారా హరీశ్‌రావుకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు హరీశ్‌రావు తన నియోజకవర్గం సిద్ధిపేటలో కలియ తిరిగారు. ఇంటింటికీ వెళ్లి అభిమానులను అప్యాయంగా పలకరించారు. బాలింతలకు కేటీఆర్ కిట్లు పంపిణీ చేశారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పోటీ పడ్డారు. Many happy returns of the day to one of our most able, articulate & hardworking leaders @trsharish Garu on his birthday — KTR (@KTRTRS) 3 June 2017 -
'మొదటి ట్యాగ్ లైనే నీళ్లు'
హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేలా ప్రతిపక్షాలు వ్యవరిస్తున్నాయని మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టకుండా విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నిన్న జరిగిన లాఠిఛార్జికి విపక్షలే కారణమన్నారు. హింసకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మల్లన్నసాగర్ నిర్వాసితులను ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. 8 గ్రామల్లో 6 గ్రామాలు భూ సేకరణ కు అంగీకరించాయని తెలిపారు. మరో రెండు గ్రామాల్లో భూ సేకరణ మిగిలివుంది. ప్రభుత్వం వైపు నుంచి ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదన్నారు. సీపీఎం, టీడీపీ కార్యకర్తలు మల్లన్నసాగర్ నిర్వాసితులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి సీపీఎం, టీడీపీ కార్యకర్తలను తరలించి హింస సృష్టించారని.. ఇవన్నీ బయటపెడతామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ల గురించే జరిగిందన్నారు. ఉద్యమ నినాదం (నీళ్లు, నిధులు, నియామకాలు)లోని మొదటి ట్యాగ్ లైనే నీళ్లు అని గుర్తు చేశారు. మల్లన్నసాగర్ అవసరమా అని కొందరు మాట్లాడుతున్నారని, రిజర్వాయర్ లన్నీ నీళ్లుంటేనే కట్టారా అని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం లేదా జీవో 123.. రైతులు ఏది కోరుకుంటే ఆ ప్రకారం పరిహారం ఇస్తున్నామని హరీశ్ రావు వెల్లడించారు. మెదక్ జిల్లాలో విపక్షాలు చేపట్టిన బంద్ విఫలమైందన్నారు. -
'టీఆర్ఎస్ ను చీల్చేందుకు హరీశ్ కుట్ర'
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీలో జేబు దొంగలు, చిల్లర దొంగలు ఉన్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి మాట్లాడడం టైంవేస్ట్ అని మంగళవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతుతూ అన్నారు. గతంలోనే టీఆర్ఎస్ పార్టీని చీల్చి కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు హారీశ్ రావు సిద్ధమయ్యారని, దానికి ఈటెల రాజేందర్ సాక్ష్యమని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీని చీల్చేందుకు హరీశ్ రావు సిద్ధమైతే టీడీపీ మద్ధతు ఇవ్వాలా, లేదా అనే దానిపై పొలిట్ బ్యూరోలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. -
ఏ అంశంపై అయినా చర్చకు సిద్ధం: హరీశ్
హైదరాబాద్: తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమన్న శాసనసభలోనే లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టనుండడం గర్వంగా ఉందని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఏ అంశంపై అయినా చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏయే అంశాలను చర్చకు తీసుకోవాలన్న దానిపై బుధవారం జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు సభ గౌరవం పెంచేలా నడుచుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ ను బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తొలి బడ్జెట్ ను ప్రవేశపెడుతామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. -
'నిబంధనల మేరకే నీరు వాడుకుంటున్నాం'
హైదరాబాద్: నీటి పంకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలో పస లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. నిబంధనలు ప్రకారమే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. నియమాలు ఉల్లంఘించింది ఏపీ ప్రభుత్వమేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేటాయింపుల ప్రకారమే నీటిని వాడుకుంటున్నామని వివరించారు. మిగులు జలాలు, నికర జలాలు వాడుకున్న తర్వాత కూడా ఇంకా 136.9 టీఎంసీలు వాడుకునే హక్కు తమకుందని తెలిపారు. జీవో 233 గురించి ఆంధ్రా నాయకులు ఎందుకు మాట్లాడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. -
'పెదవులపై చిరునవ్వు, కడుపులో విషం'
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు కష్టాలకు కారణమైన టీడీపీ, కాంగ్రెస్ నేతలు దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే హక్కు తెలంగాణకే ఉందన్నారు. కృష్ణా బోర్డు అనుమానాలకు తాము సమాధానం ఇచ్చామన్నారు. పెదవులపై చిరునవ్వు, కడుపులో విషం- చంద్రబాబు నైజమన్నారు. వెన్నుపోటు, మోసం, దగాల్లో చంద్రబాబుకు జీవితకాలపు డాక్టరేట్ ఉందని ఎద్దేవా చేశారు. విద్యుత్ విషయంలో గవర్నర్ దగ్గరకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను విమర్శించడానికి మాటలు కూడా లేవని హరీశ్‌రావు అన్నారు. -
'తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే'
-
'తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే'
హైదరాబాద్: తమ ఉనికిని కాపాడుకునేందుకే తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ యాత్రలు చేపట్టాయని మంత్రి తన్నీరు హరీష్‌రావు విమవర్శించారు. ప్రజల భరోసా లేని కాంగ్రెస్ పార్టీ పార్టీ భరోసా యాత్రలు చేస్తోందని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమన్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని గుర్తు చేశారు. తెలంగాణలో అన్నిదారులు టీఆర్ఎస్ వైపే అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు. -
తెలంగాణ భాషను కాపాడుకుందాం
* మన సంస్కృతికి జర్నలిస్టులు జీవం పోయాలి * రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు * నవ తెలంగాణ నిర్మాణంలోనూ చొరవ చూపాలి * ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ భాషను, యాసను కాపాడుకోవాల్సిన బాధ్యత జర్నలిస్టుల మీదే ఉందని, జర్నలిస్టులు తెలంగాణ భాషలోనే కథనాలు రాసి మన సంస్కృతికి జీవం పోయాలని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా తొలి మహాసభలకు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పత్రికల మధ్య ఉన్న పోటీ నేపథ్యంలో సెన్సేషన్ వార్తలు రాయాలనే తాపత్రయంతో వాస్తవాలను దారి తప్పిస్తున్నారని ఆయన అన్నారు. సద్విమర్శలు స్వీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి ప్రకటించారు. తప్పుచేస్తే మీడియా వదిలిపెట్టదనే భావన తీసుకురావాలని సూచించారు. సద్విమర్శలతోపాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేసి చూపిస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల సమాచారాన్ని కూడా ప్రజలకు అందించాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరిలాంటి సీఎం కాదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిద్ర లేకుండా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ ప్రతిరోజూ రెండు గంటలపాటు 12 పత్రికలను చదువుతారని చెప్పారు. తెలంగాణ ఉద్యమం కొనసాగిన 14 ఏళ్ల కాలంలో ఉద్యమం గురించి తప్ప.. కనీసం కుటుంబం గురించి కూడా ఆలోచన చేయలేదని గుర్తు చేశారు. ఐఏఎస్‌లు లేక పనులు సాగడం లేదు.. ‘రాష్ట్ర కేబినెట్ ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకుంది, కానీ వాటిని అమలు చేయడానికి తగినంతమంది ఐఏఎస్ అధికారులు అందుబాటులో లేకపోవటంతో పనులు ముందుకు సాగడం లేదు, ప్రభుత్వం ఒంటికాలు మీదనే పరుగు పెడుతోంది’ అని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 140 మంది వరకు ఐఏఎస్ అధికారులు అవసరం ఉండగా ప్రస్తుతం మనకు కేవలం 60 నుంచి 65 మంది ఐఏఎస్‌లు మాత్రమే ఉన్నారని, మళ్లీ కొందరిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారని ఆయన చెప్పారు. కీలకమైన శాఖలకు కూడా ఇన్చార్జ్ కమిషనర్లతోనే నెట్టుకురావాల్సి వస్తుందని అన్నారు. జనార్దన్‌రెడ్డి అనే ఐఎస్ఎస్ అధికారికి 8 శాఖలు కేటాయించడం జరిగిందని, తీరా ఆధికారిని ఆంధ్రకు కేటాయించారని ఇక పనులు ఎలా సాగుతాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఐఏఎస్‌ల పంపకాల ప్రక్రియ పూర్తిచేస్తుందో, ప్రధాన మంత్రి ఆ ఫైల్ మీద ఎప్పుడు సంతకం చేస్తారో... మన రాష్ట్రంలో ఐఏఎస్‌ల సమస్య ఎప్పుడు తీరుతుందోనని అన్నారు. మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించాలి: డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మహిళా జర్నలిస్టులను ప్రోత్సహించాలని, జిల్లాలో ఒక్క మహిళా జర్నలిస్టు కూడా లేకపోవడం విచారకరం అని అన్నారు. ఐజేయు నాయకులు, విశాలాంధ్ర ఎడిటర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేరళ తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్అలీ, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జెడ్పీ చైర్మన్ రాజమణి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలకుల పొరపాట్లను సరిచేసే బాధ్యత జర్నలిస్టులదే తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు చూపించిన చొరవను.. నవ తెలంగాణ నిర్మాణం కోసం, బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ చూపించాలని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. పాలకులు ఎలాంటి పొరపాట్లు చేసినా.. వాటిని సరిచేసే బాధ్యత జర్నలిస్టులపైనే ఉందని తెలిపారు. ఈ గురుతర ధర్మాన్ని నిర్వర్తించడానికి జర్నలిస్టులు నిబద్ధతతో ఉండాలని, విషయంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. నాయకులు సద్విమర్శలు స్వీకరిస్తేనే సమాజగతిలో మార్పులు చోటుచేసుకొని, అభివృద్ధికి పునాదులు పడతాయన్నారు. ‘స్వాతంత్య్ర సంగ్రామం అనంతరం భారతావనికి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.. ఆయన పాలన తీరుపై ఒక్క సద్వివిమర్శ కూడా రాకపోవడంతో.. తానేమైనా నియంతగా వ్యవహరించానా?’ అని ఆయన ఆత్మ విమర్శ చేసుకున్నారని గుర్తుచేశారు. ఇలా ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శతో తప్పులు సరిదిద్దుకొని గమ్యాన్ని నిర్దేశించుకున్న నేత లే లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు. -
ఇక సేవపైనే దృష్టి
సిద్దిపేట రూరల్: ఇన్ని రోజులు ఎన్నికలని.. ఓట్లని తిరిగినం.. ఇప్పుడు అలాంటిదేమీలేదని, ప్రజాసేవ, గ్రామాల అభివృద్ది చేయడమే పని అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట పరిధిలోని నర్సాపూర్, ఎల్లుపల్లి గ్రామాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి బాలవికాస వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ తాను ఏ నీళ్లు తాగితే.. తన నియోజకవర్గం ప్రజలు కూడా ఆ నీళ్లే తాగాలన్నది తన లక్ష్యమన్నారు. గ్రామాల్లో ప్రజలందరు నూటికి నూరు శాతం స్వచ్ఛమైన నీళ్లు తాగాలని బాలవికాస వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికి వరకు 60బాలవికాస వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, మరికొన్ని గ్రామాల్లో పూర్తి చేస్తే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బాలవికాస ప్లాంట్లు పూర్తవుతాయన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట ప్రాంత ప్రజలు హరీష్‌రావును ఆదరించినట్లు, తనను కూడా భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఎంతో రుణపడి ఉంటానన్నారు. బాలవికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శౌరిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఈ నీళ్లను తాగాలని, నీళ్లను ఎప్పుడైనా కావాలన్నా తీసుకోవడానికి ఏటీఎం సౌకర్యం ఉందన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో మంచినీటి క్యాన్లను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు, జెడ్పీటీసీ గ్యార వజ్రవ్వ, ఎంపీపీ ఎర్ర యాదయ్య, సర్పంచ్ బాలకిష్ణారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ వంగ ప్రవీణ్‌రెడ్డి, బాలవికాస ప్రతినిధులు ఉపేందర్, రవీందర్, నాయకులు కోరె ఎల్లయ్య, పూల హన్మంతారెడ్డి, చెన్నోజీ రాజుచారి, బాల్‌రంగం, రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను చెరువుల మంత్రిని.. నంగునూరు: ‘నేను చెరువుల మంత్రిని.. చెరువులు నిండేదాక వదుల్తున, నిజాం కాలంలో నిర్మించిన చెరువులను నింపేందుకు కృషి చేస్తా’ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా రాజగోపాల్‌పేటలో రెండు అంగన్వాడీ కేంద్రాలకు శంకుస్థాపన చేసి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 5001 పెద్ద, 31వేల చిన్న చెర్వులు కలిపి మొత్తం 36 వేల చెరువులు ఉన్నట్లు గుర్తించామన్నారు. సీమాంధ్ర పాలకులు చెరువులను పట్టించుకోక పోవడంతో అవి ధ్వంసమయ్యాయని, తూములు, అలుగులు మరమ్మతు చేసి చెరువులు కళకళలాడేలా చేస్తామన్నారు. సిద్దిపేటకు ప్రాణహిత చేవెళ్ల నీటిని తెచ్చి తడ్కపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన రిజర్వాయిర్ ద్వారా నంగునూరు మండలానికి సాగునీరు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురికి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రాజగోపాల్‌పేటలో ఇటీవల మరణించిన తలారి పద్మ, సిద్దన్నపేటలో మరణించిన బెదురు అయిలయ్య, కోనాయిపల్లిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సోమిరెడ్డి, రమేశ్‌గౌడ్, రాజుగౌడ్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఓఎస్డీ బాలరాజు, అధికారులు ప్రభాకర్, నరేందర్, బ్రహ్మం, నరేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట బస్టాండ్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్‌ను మంత్రి హరీష్‌రావు ఆదివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలోని అపరిశుభ్ర వాతావరణంపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూత్రశాలల దగ్గర దుర్గంధం వెదజల్లడం పట్ల ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆర్టీసీ డీఎం భానుకిరణ్‌ను ఆదేశించారు. అనంతరం బస్టాండ్ ఆవరణంలోని స్టాల్స్‌ను పరిశీలించారు. లీకేజీలను గుర్తించిన ఆయన వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్టీసీ డిపో మేనేజర్ భానుకిరణ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మానకోడూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చిన్న, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, జంగిటి కనకరాజు, కూర బాల్‌రెడ్డి, శేషుకుమార్ తదితరులున్నారు. -
బస్తీమే సవాల్!
మెతుకు సీమ ఉప పోరులో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఊపందుకున్నాయి. ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ ప్రచారంలో కాక పుట్టిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచడంతో వేడి పెరిగింది. ఒకరును మించి ఒకరు సవాల్ చేసుకుంటున్నారు. గెలుపు, ఓటములపై సవాళ్లు రువ్వుకుంటున్నారు. బస్తీమే సవాల్ అంటూ దూకుడు పెంచుతున్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని మంత్రి తన్నీరు హరీష్‌రావుకు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. మెదక్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీష్‌రావు- ఎర్రబెల్లి సవాల్‌కు దీటుగా స్పందించారు. జగ్గారెడ్డి గెలిస్తే తాను మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని ప్రతిసవాల్ చేశారు. ఒకవేళ జగ్గారెడ్డి ఓడిపోతే ఎమ్మెల్యే పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఎర్రబెల్లి సిద్ధమా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ కూ హరీష్‌రావు సవాల్ విసిరారు. జగ్గారెడ్డికి టిక్కెట్ ఇప్పించిన వీరిద్దరూ దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల ప్రచారానికి రావాలంటూ సవాల్ చేశారు. హారీష్ సవాల్ కు చంద్రబాబు, పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలిపించి కేసీఆర్‌కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపు ఇవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామంటూ ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ శపథం చేశారు. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎంతవరకు వెళతాయో చూడాలి. -
మా సొమ్ము ఆంధ్రా విద్యార్థులకు ఎలా ఇస్తాం?
హైదరాబాద్: తెలంగాణ ప్రజలను ఏవిధంగా ఏడిపించాలా అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు చూస్తున్నారని తెలంగాణ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబుది అనవసర రాద్ధాంతమని అన్నారు. తమ సొమ్మును పక్క రాష్ట్రాల విద్యార్థులకు ఎలా ఇస్తామని ఆయన ప్రశ్నించారు. ఏ కోర్టు కూడా వారి వాదనలను ఒప్పుకోదని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొన్ని బోగస్ కాలేజీలు ఉన్నాయని, వాటి నుంచి మా విద్యార్థులను కాపాడుకుంటామని హరీష్‌రావు తెలిపారు. తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజురీయింబర్స్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల హామీలను నెరవేరుస్తాం
- రూ.19 వేల కోట్ల రైతు రుణాల మాఫీ - బోడ్మట్పల్లి నుంచి బీదర్ రోడ్డు అభివృద్ధికి రూ. 120 కోట్లు - నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అల్లాదుర్గం రూరల్: రాష్ట్రంలో త్వరలో రూ. 19 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేయన్నుట్లు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం అల్లాదుర్గం ఎంపీపీ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో టీఆర్ఎస్ చేసిన హమీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా రూ. లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలిపారు. రుణ మాఫీతో ప్రభుత్వంపై రూ.19 వేల కోట్ల భారం పడనున్నదన్నారు. బోడ్మట్పల్లి నుంచి నిజాంపేట, నారాయణఖేడ్, పుల్కుర్తి, మీదుగా బీదర్ వరకు చేపట్టనున్న రోడ్డు వెడల్పు పనులకు రూ.120 కోట్లతో ప్రతి పాదనలు పంపామని, 15 రోజుల్లో నిధులు మంజూరవుతాయన్నారు. సంగారెడ్డి నుంచి బోడ్మట్పల్లి వరకు నేషనల్ హైవే కావడంతో 7 మీటర్ల రోడ్డును 10 మీటర్లు పెంచేందుకు రూ.100 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా వృద్ధులకు , వితంతువులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ. 1500ల పింఛను అందజేస్తామన్నారు. గ్రామాల్లోనే ప్రణాళికలు తయారు చేసేందుకు మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బాబూమోహన్, మెదక్ ఆర్డీఓ వనజాదేవి, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీపీ ఇందిర, జెడ్పీటీసీ మమత, ఉపాధ్యక్షులు భిక్షపతి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు. త్వరలో డీఎస్సీ, గ్రూప్ పోస్టుల భర్తీ జోగిపేట: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామనే హమీతోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులు నిరుద్యోగులేనని, ఏళ్ల తరబడి అతితక్కువ వేతనంతో పనిచేస్తున్న వారికి రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు పరిమితంగానే ఉన్నారన్నారు. భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు ఉన్నందున నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలకు లోబడి గతంలో నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, త్వరలో డీఎస్సీతోపాటు వివిధ శాఖల పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. గ్రూపు-1, గ్రూపు-2 పోస్టులను కూడా భర్తీ చేయనున్నామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాబూమోహన్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు హమీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కవిత నేతృత్వంలోని కార్యకర్తలు మంత్రి హరీష్‌రావుకు వినతి పత్రం సమర్పించారు. 30 సంవత్సరాలుగా తాము కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు తమకు రెగ్యులరైజ్ చేయాలని వారు వివరించారు. -
ముగ్గురు మంత్రుల బాధ్యతల స్వీకారం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా మమమూద్ అలీ బాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని డి-బ్లాక్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. పాతబస్తీ అన్నిరంగాల్లో వెనుకబడి ఉందని, తొలుత విద్యారంగాన్ని విస్తరింపజేసి ఈ ప్రాంతానికి తగిన గుర్తింపు తీసుకరావాల్సి ఉందని మహమూద్ అలీ అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో రెవెన్యూ, పునరావాసం, యూఎల్సీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రిగా మహమూద్ అలీ ఉన్నారు. నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా తన్నీరు హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టారు. రవాణా శాఖ పి. మహేందర్ రెడ్డి కూడా నేడు బాధ్యతలు చేపట్టారు.