'మొదటి ట్యాగ్ లైనే నీళ్లు'
హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకునేలా ప్రతిపక్షాలు వ్యవరిస్తున్నాయని మంత్రి తన్నీరు హరీశ్ రావు విమర్శించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కట్టకుండా విపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... నిన్న జరిగిన లాఠిఛార్జికి విపక్షలే కారణమన్నారు. హింసకు పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
మల్లన్నసాగర్ నిర్వాసితులను ఎవరూ ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. 8 గ్రామల్లో 6 గ్రామాలు భూ సేకరణ కు అంగీకరించాయని తెలిపారు. మరో రెండు గ్రామాల్లో భూ సేకరణ మిగిలివుంది. ప్రభుత్వం వైపు నుంచి ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదన్నారు. సీపీఎం, టీడీపీ కార్యకర్తలు మల్లన్నసాగర్ నిర్వాసితులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి సీపీఎం, టీడీపీ కార్యకర్తలను తరలించి హింస సృష్టించారని.. ఇవన్నీ బయటపెడతామన్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్ల గురించే జరిగిందన్నారు. ఉద్యమ నినాదం (నీళ్లు, నిధులు, నియామకాలు)లోని మొదటి ట్యాగ్ లైనే నీళ్లు అని గుర్తు చేశారు. మల్లన్నసాగర్ అవసరమా అని కొందరు మాట్లాడుతున్నారని, రిజర్వాయర్ లన్నీ నీళ్లుంటేనే కట్టారా అని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టం లేదా జీవో 123.. రైతులు ఏది కోరుకుంటే ఆ ప్రకారం పరిహారం ఇస్తున్నామని హరీశ్ రావు వెల్లడించారు. మెదక్ జిల్లాలో విపక్షాలు చేపట్టిన బంద్ విఫలమైందన్నారు.