సాంకేతిక సొబగులు
సాక్షి, వనపర్తి : ఎన్నో దశాబ్దాలుగా విద్యాపర్తిగా కొనసాగుతున్న వనపర్తి కీర్తిసిగలో మరో నగ చేరనుంది. జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇటీవల నివేదిక సమర్పించినట్లు తెలిసింది. వనపర్తిలో ఐఐఐటీ ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే సంకల్పంతో ట్రిపుల్ ఐటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంనిర్ణయించింది. పరిశీలనకు కమిటీని నియమించగా వనపర్తిలో ఏర్పాటుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని నివేదిక ఇచ్చింది.
గ్రామీణ విద్యార్థులకు వరం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2008లో బాసరతో పాటు ఇడుపులపాయ, నూజివీడులో మూడు ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో 2016లో ఒంగోలు, శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు. 2017లో అనంతపురం జిల్లాలో మరొకటి నెలకొల్పారు. ఈ మేరకు తెలంగాణలో సైతం మరో మూడు ట్రిపుల్ ఐటీలను నెలకొల్పితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని భావించారు. ఈ క్రమంలోనే వనపర్తిలో ఒకటి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
వనపర్తిలో అనుకూల పరిస్థితులు
ఉన్నత స్థాయి విద్యామండలి, సాంకేతిక విద్యామండలి, బాసరలోని ఐఐఐటీ కళాశాల బృందం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, జేఎన్టీయూహెచ్ కళాశాల ప్రిన్సిపాల్ సాయిబాబారెడ్డి, ఓయూ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కృష్ణయ్య తదితరులు ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను సందర్శించి ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సానుకూల పరిస్థితులను పరిశీలించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి ఐఐఐటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని భావించింది. ఈ మేరకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలతో పాటు పలు ప్రాంతాలను రెండు పర్యాయాలు సందర్శించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వనపర్తిలో 1951లో మొట్టమెదటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నెలకొల్పగా విద్యాపరంగా ఈ ప్రాంతానికి మంచిపేరుంది. 44వ జాతీయ ప్రధాన రహదారికి 14 కి.మీ దూరంలో
ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సానుకూల పరిస్థితులను పరిశీలించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి ఐఐఐటీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని భావించింది. ఈ మేరకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాలతో పాటు పలు ప్రాంతాలను రెండు పర్యాయాలు సందర్శించింది. ఉమ్మడి రాష్ట్రంలోనే వనపర్తిలో 1951లో మొట్టమెదటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను నెలకొల్పగా విద్యాపరంగా ఈ ప్రాంతానికి మంచిపేరుంది. 44వ జాతీయ ప్రధాన రహదారికి 14 కి.మీ దూరంలో ఉండి రోడ్డు సౌకర్యం బాగా ఉండటం, శంషాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 120 కి.మీ దూరంలో ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అధ్యాపకులకు సులువుగా ఉంటుందని భావించి కమిటీ వనపర్తి వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
50శాతం పూర్తయిన ప్రక్రియ
తెలంగాణలోని తూర్పు జిల్లాలైన వరంగల్ లేదా ఖమ్మంలో మరొకటి, పశ్చిమ జిల్లాలైన మెదక్ లేదా నిజామాబాద్‌లో ఇంకొకటి ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. వనపర్తిలో బాసర స్థాయిలో ట్రిపుల్ ఐటీని నిర్మించాలంటే సుమారు రూ.700కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం. ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వడంతో 50శాతం ప్రక్రియ ముగిసినట్లయింది. రాష్ట్ర విద్యాశాఖ, రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. ఇందతా జరగడానికి మరో మూడు నుంచి నాలుగు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ విద్యా సంవత్సరమే నుంచే వనపర్తిలో తరగతులు ప్రారంభించాలని యోచించినా మొత్తం ప్రక్రియ పూర్తి కాకపోవడంతో 2019– 2020 విద్యాసంవత్సరంలో ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థలసేకరణ పూర్తి
ట్రిపుల్ టీ ఏర్పాటుకు పక్కా భవనాల నిర్మాణం జరగాలంటే రెండు, మూడేళ్ల సమయం పడుతుంది. అయితే, అప్పటివరకు పాలిటెక్నిక్ కళాశాలలోని గదులను పరిశీలించిన బృందం చిన్న చిన్న మరమ్మతులు చేపడితే పక్కా భవనాలు నిర్మించే వరకు ఇక్కడే తరగతులు కొనసాగించవచ్చనే భావనకు వచ్చింది. పక్కా భవనాల నిర్మాణం, క్యాంపస్ కోసం సుమారు 250ఎకరాల స్థలం అవసరం ఉంటుందని కమిటీ సూచించింది. ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న జిల్లా సమీకృత భవనం, ఎస్పీ కార్యాలయం సమీపంలోని సర్వేనంబర్ 200లో 200 ఎకరాల స్థలం ఉందని కలెక్టర్ శ్వేతామహంతి నివేదిక ఇచ్చారు. అవసరమైతే మరో 50ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించి ఇస్తామని ఆమె వెల్లడించారు.