10 ఎకరాల భూమిని కొన్న పేటీఎం | Paytm Buys 10 Acres For A Mega Campus In Noida | Sakshi
Sakshi News home page

10 ఎకరాల భూమిని కొన్న పేటీఎం

Published Fri, Jul 27 2018 5:17 PM | Last Updated on Fri, Jul 27 2018 8:51 PM

Paytm Buys 10 Acres For A Mega Campus In Noida - Sakshi

పేటీఎం ఫైల్‌ ఫోటో

బెంగళూరు  : ఆన్‌లైన్‌ లావాదేవీలు చేయాలంటే.. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఆశ్రయించేది పేటీఎంనే. పేటీఎం ఆ రేంజ్‌లో ఆదరణ పొందింది. 2010లో విజయ్‌ శేఖర్‌ శర్మ ప్రారంభించిన ఈ కంపెనీ.. ఎనిమిదేళ్లలో తిరుగులేని స్థాయికి ఎదిగింది. పూర్తి స్థాయి ఆర్థిక సేవల సంస్థగా అవతరించింది. తాజాగా ఈ సంస్థ కొత్త ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయబోతుందట. దీని కోసం 10 ఎకరాల భూమిని కూడా నోయిడాలో కొనుగోలు చేసిందని తెలిసింది. ఇటీవల కాలంలో దేశీయ కన్జ్యూమర్‌ ఇంటర్నెట్‌ స్టార్టప్‌లో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ డీల్‌ ఇదే. ఈ డీల్‌ పరిమాణం రూ.120 కోట్ల నుంచి రూ.150 కోట్ల మేర ఉంటుందని తెలిసింది. పేటీఎం భూమిని కొనుగోలు చేసిన నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక్కో ఎకరానికి రూ.12 కోట్ల నుంచి రూ.15 కోట్ల మేర మార్కెట్‌ ధర పలుకుతుందని ప్రాపర్టీ కన్సల్టెంట్లు చెప్పారు. 

పేటీఎం ఓనర్‌ వన్‌97 కమ్యూనికేషన్స్‌, నోయిడా అథారిటీ నుంచే డైరెక్ట్‌గా ఈ భూమిని కొనుగోలు చేయడంతో, కొంచెం తక్కువ ధరకే ఈ భూమిని పేటీఎం కొనుగోలు చేసినట్టు కన్సల్టెంట్లు తెలిపారు. నోయిడా మౌలిక సదుపాయాలకు ఈ అథారిటీ నోడల్‌ బాడీ. కంపెనీ కొత్త ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు పేటీఎం భూమిని కొనుగోలు చేసినట్టు పేటీఎం చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ కిరణ్‌ వాసిరెడ్డి కూడా ధృవీకరించారు. ఈ డీల్‌కు సంబంధించి ఎలాంటి ఆర్థిక, ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. ఈ కొత్త ప్రధాన కార్యాలయంతో, దేశంలో ఉన్న ప్రతిభావంతులను మరింత మందిని ఆకట్టుకోవచ్చని వాసిరెడ్డి తెలిపారు. ఈ కొత్త ప్రధాన కార్యాలయం 15 వేల మందికి పైగా ఉద్యోగులకు అవకాశం కల్పించనుందని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం పేటీఎంలో 20వేల మంది ఉద్యోగులున్నారు. వారిలో నోయిడా హెడ్‌ ఆఫీసులో 760 మంది పనిచేస్తున్నారు. మిగతా వారు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాల్లో పనిచేసేవారే. పేటీఎం కొత్త ఆఫీసు పర్యావరణ అనుకూలమైన, ఎనర్జీ సామర్థ్యంతో రూపొందుతుందని తెలిపారు. కాగ, గతేడాది మే నెలలోనే పేటీఎం 1.4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను జపాన్‌ సాఫ్ట్‌బ్యాంక్‌ నుంచి రాబట్టింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement