హరీశ్‌.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో | BJP MLA Etela Rajender Fires On Minister Harish Rao Siddipet | Sakshi
Sakshi News home page

హరీశ్‌.. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో

Published Sat, Nov 6 2021 3:53 AM | Last Updated on Sat, Nov 6 2021 3:54 AM

BJP MLA Etela Rajender Fires On Minister Harish Rao Siddipet - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న ఈటల రాజేందర్‌

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)సాక్షి, హైదరాబాద్‌: ఇప్పటికైనా మంత్రి హరీశ్‌రావు బుద్ధి తెచ్చుకొని పిచ్చి పనులు చేయకుండా ఉండాలని ఈ సిద్దిపేట గడ్డ నుంచే హెచ్చరిస్తున్నానని హుజూర్‌బాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కుట్రలు, డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నవారికి హుజూరాబాద్‌లో ఎదురైన అనుభవమే రాబోయే కాలంలోనూ తప్పదని హెచ్చరించారు. త్వరలోనే సిద్దిపేటలో దళితగర్జన సభ పెడతామని, దానికి తానే నాయకత్వం వహిస్తానన్నారు.

ఉపఎన్నికలో విజయం సాధించిన ఈటల శుక్రవారం సిద్దిపేటలోని రంగదాంపల్లి అమరవీరులస్తూపం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ఈటలకు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈటల మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు హరీశ్‌రావును ఎమ్మెల్యేగా గెలిపిస్తే ట్రబుల్‌ షూటర్‌ పేరిట రాష్ట్రంలో ఎక్కడ ఉపఎన్నిక జరిగినా అక్కడికి వెళ్లి సిద్దిపేటను అభివృద్ధి చేసిన విధంగానే మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానంటూ అక్కడి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అబద్ధాల మంత్రిగా పేరు సంపాదించారని విమర్శించారు. దళితబంధును రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఎమ్మెల్యేగా గెలిచాక తొలిసారిగా నగరానికి..  
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో గెలుపొందిన అనంతరం మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తొలిసారిగా శనివారం హైదరాబాద్‌ రానున్నారు. అసెంబ్లీ ఎదుటనున్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటలకు పౌరసన్మానం జరగనుంది. బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించాక ఆదివారం మొదటిసారిగా కొత్త కార్యవర్గం ఢిల్లీలో సమావేశం కానుంది. పార్టీ జాతీయకార్యవర్గ సభ్యుడి హోదాలో ఈటల మొదటిసారిగా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement