సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ (2021–22) రాష్ట్రాలను ఆదుకొనేలా ఉండాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఆర్థిక సంఘం సిఫారసుల అమలు నుంచి వికలాంగులకు అందించే సాయం వరకు కేంద్రం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను ఆయన నిర్మలా సీతారామన్‌కు వివరించారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా నిర్మలా సీతారామన్ సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి హరీశ్‌రావుతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రోస్, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారుడు జీఆర్ రెడ్డి, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
భేటీలో హరీశ్‌రావు
వెలిబుచ్చిన అభిప్రాయాలు...
⇔ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన గ్రాంట్లను బడ్జెట్‌లో పొందుపరిచి సంపూర్ణంగా అమలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. అందులో కొన్నింటిని కేంద్రం అంగీకరించట్లేదు. 15వ ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయకపోవడం వల్ల 2020–21లో తెలంగాణ రూ. 723 కోట్లు నష్టపోయింది. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలి. ఆర్థిక సంఘం సిఫారసులను యథాతథంగా అమలుపరిచే సంప్రదాయాన్ని కొనసాగించాలి.
⇔ కేంద్రం వసూలు చేస్తున్న సెస్, సర్‌చార్జీలను రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటాలో కలపట్లేదు. దీంతో రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. వచ్చే బడ్జెట్ నుంచి సెస్, సర్‌చార్జీలను రద్దు చేసి వాటి స్థానంలో రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పన్నుల రేట్లను పెంచి అధిక నిధులు వచ్చేలా బడ్జెట్‌ను రూపొందించాలి.
⇔ కరోనా వల్ల నష్టపోయిన సంపదను కూడదీసుకోవడంలో భాగంగా జీఎస్‌డీపీలో 2 శాతం అదనంగా రాష్ట్రాలకు రుణాలు తీసుకొనే అవకాశమిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో ప్రజా పెట్టుబడి (పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్)ను ప్రోత్సహించాలి. ఎలాంటి షరతులు లేకుండా ఈ అదనపు రుణాలు తీసుకొనే వెసులుబాటును వచ్చే బడ్జెట్‌లోనూ కొనసాగించాలి.
⇔ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రంలోని వెనుకబడిన ›ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం సాయం అందించాలి. గత రెండేళ్లకు కలిపి రూ. 900 కోట్లు వెంటనే విడుదల చేయాలి. వచ్చే ఐదేళ్లపాటు ఈ సాయాన్ని కొనసాగించాలి.
⇔ మహిళా సంఘాలకు ఇస్తున్న వడ్డీ రాయితీ పథకాన్ని దేశవ్యాప్తంగా 50 శాతం జిల్లాలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. గత బడ్జెట్ ప్రసంగంలో ఈ రాయితీ 100 శాతం జిల్లాల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు కాలేదు. దీన్ని వెంటనే అమలు చేయాలి. ఇందుకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలి.
⇔ బిహార్‌లో ప్రకటించిన విధంగా కరోనా టీకాలను దేశమంతా ఉచితంగా పంపిణీ చేయాలి.
⇔ వికలాంగులు, వృద్ధులు, వితంతువులకు కేంద్రం ఎన్నో ఏళ్ల నుంచి కేవలం రూ. 200 మాత్రమే ఎన్‌ఎస్‌ఏపీ కింద సాయం చేస్తోంది. దీన్ని రూ. వెయ్యికి పెంచాలి. జీఎస్టీ పరిహారాన్ని సత్వరమే రాష్ట్రాలకు విడుదల చేయాలి.
సెస్, సర్ చార్జీలు రద్దు చేయండి
Published Tue, Jan 19 2021 8:03 AM | Last Updated on Tue, Jan 19 2021 10:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment