బస్తీమే సవాల్!
మెతుకు సీమ ఉప పోరులో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఊపందుకున్నాయి. ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతూ ప్రచారంలో కాక పుట్టిస్తున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు దూకుడు పెంచడంతో వేడి పెరిగింది. ఒకరును మించి ఒకరు సవాల్ చేసుకుంటున్నారు. గెలుపు, ఓటములపై సవాళ్లు రువ్వుకుంటున్నారు. బస్తీమే సవాల్ అంటూ దూకుడు పెంచుతున్నారు.
ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని మంత్రి తన్నీరు హరీష్రావుకు టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సవాల్ విసిరారు. మెదక్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరీష్రావు- ఎర్రబెల్లి సవాల్కు దీటుగా స్పందించారు. జగ్గారెడ్డి గెలిస్తే తాను మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమని ప్రతిసవాల్ చేశారు. ఒకవేళ జగ్గారెడ్డి ఓడిపోతే ఎమ్మెల్యే పదవి వదిలి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఎర్రబెల్లి సిద్ధమా అని ప్రశ్నించారు.
ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ కూ హరీష్రావు సవాల్ విసిరారు. జగ్గారెడ్డికి టిక్కెట్ ఇప్పించిన వీరిద్దరూ దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికల ప్రచారానికి రావాలంటూ సవాల్ చేశారు. హారీష్ సవాల్ కు చంద్రబాబు, పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలిపించి కేసీఆర్‌కు షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి పిలుపు ఇవ్వగా, టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామంటూ ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ శపథం చేశారు. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎంతవరకు వెళతాయో చూడాలి.