సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైందనే వార్తల నేపథ్యంలో ఆయన వెంట నడిచే పార్టీ నేతలు ఎవరున్నారనే దానిపై టీఆర్‌ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది. మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్ అయిన మరుక్షణం నుంచే హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులను కట్టడి చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్‌ను పార్టీ రంగంలోకి దించింది. రాష్ట్ర స్థాయిలో మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్‌తో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి హుజూరాబాద్ నేతల కట్టడి వ్యూహాన్ని అమలు చేస్తోంది. మండలాల వారీగా ఇన్‌చార్జీలను నియమించి స్థానిక ప్రజా ప్రతినిధులంతా పార్టీ వెంట నడిచేలా ప్రకటనలు ఇప్పించడంలో సఫలమైంది. హుజూరాబాద్‌లో నేటికీ ఈటల వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్న నేతలు, క్రియాశీల కార్యకర్తలను గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది.
మాజీ ఎమ్మెల్యే ఏనుగు మినహా..!
ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించిన తర్వాత టీఆర్‌ఎస్ ముఖ్య నేతలెవరూ ఆయనతో భేటీ అయిన దాఖలాల్లేవు. అయితే ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ తులా ఉమ మాత్రమే ఈటలతో భేటీ అయ్యారు. ప్రస్తుతం రవీందర్‌రెడ్డి ఒక్కరు మాత్రమే వివిధ పార్టీల నేతలతో ఈటల జరుపుతున్న మంతనాల్లో పాల్గొంటున్నారు. ఈటల బీజేపీ లేదా ఇతర పార్టీల్లో చేరడమో, సొంత పార్టీని ఏర్పాటు చేయడమో జరిగితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏనుగు రవీందర్‌రెడ్డి ఒక్కరే ఆయన వెంట నడిచే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో టీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా పనిచేసి ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ వంటి వారు ఈటలతో భేటీ అయినా ఆయనతో నడిచే పరిస్థితులు కనిపించడం లేదు.
ఈటల దారిపై స్పష్టత వస్తేనే..
ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్‌తో పనిచేస్తున్న వారితోపాటు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరిన వారి నడుమ చాలా నియోజకవర్గాల్లో అంతర్గత పోరు నడుస్తోంది. సుమారు 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ప్రస్తుతం టీఆర్‌ఎస్ గొడుగు కిందే పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో రాజకీయ అవకాశాలు వస్తాయనే ఆశతో స్థానికంగా ఇబ్బందులున్నా పార్టీలోనే కొనసాగుతున్నారు. తాండూరు, కొల్లాపూర్, నకిరేకల్ వంటి నియోజకవర్గాల్లో అడపాదడపా విభేదాలు బయటపడినా ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ను వీడేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన నెలరోజులవుతున్నా ఈటల వైపు నుంచి స్థిరమైన నిర్ణయాలేవీ వెలువడకపోవడాన్నీ అసంతృప్త నేతలు విశ్లేషించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈటల దారిపై స్పష్టత వస్తేనే అసంతృప్త నేతలు నిర్ణయం తీసుకునే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment