సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
రాజే తలచుకుంటే దెబ్బలకు కొదువా..? ప్రభుత్వమే తలచుకుంటే పథకం ఇవ్వలేదా? పథకం కేవలం 15 మందికేనా అని కొందరు ఎద్దేవా చేశారు. హుజూరాబాద్‌లో ఉన్న 21,000 దళిత కుటుంబాలకు రెండు నెలల్లో పథకం అమలు చేస్తాం. నియోజకవర్గానికి ఇచ్చిన రూ. 500 కోట్లకు అదనంగా 15 రోజుల్లో మరో రూ. 2,000 కోట్లు మంజూరు చేస్తాం.
రూ. 1.75 లక్షల కోట్లు..
నాయకుడికి చేసే పనిమీద వాక్శుద్ధి, చిత్తశుద్ధి, అవగాహన ఉంటే పనులు అవే సాగుతాయి. దళితబంధు పథకాన్ని ముమ్మాటికీ 100 శాతం విజయవంతం చేసి తీరుతాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. వీరందరి కోసం రూ.1.75 లక్షల కోట్లను మూడు, నాలుగేళ్లలో ఖర్చు చేస్తాం. అయితే నిరుపేదలకు ముందు ఇస్తాం, తర్వాత మిగతా కుటుంబాలకు ఇస్తాం.
ఇప్పటికీ పేదరికంలోనే..
రిజర్వేషన్ల వల్ల విద్య, ఉపాధి రం గాల్లో దళితులకు కొన్ని అవకాశాలు చిక్కాయి. అయినా 95% మంది ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నారు. అందుకే ఆఖరి దశలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ‘దళితబంధు’అందజేయాలని అనుకుంటున్నాం. దీని లబ్ధిదారులకు ఇతర పథకాలేవీ రద్దు కావు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘‘రాష్ట్రంలో దళితుల సామాజిక ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకే ‘దళితబంధు’పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. దళితవాడలు బంగారు మేడలవ్వాలి.. దళిత జాతి రత్నాలను, దళిత శక్తిని బయటికి తీయాలన్నది మా సంకల్పం..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పేదరికం, ఆకలి, వివక్ష, అవమానాలతో వెనుకబడిన దళిత సమాజం అభ్యున్నతే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి వేదికగా సీఎం కేసీఆర్ సోమవారం దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభా వేదికపై అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్‌ల చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడారు. చివరిలో జైభీమ్, జై దళితబంధు అంటూ ముగించా రు. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా.. ‘‘సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా ‘దళితబంధు’పథకానికి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎనిమిదేళ్ల నాటి సర్వే కావడంతో ఇప్పుడు అదనంగా రెండుమూడు వేల మంది లబ్ధిదారులు పెరిగినా నష్టమేమీ లేదు. హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ అమలు చేసి తీరుతాం. హుజూరాబాద్ ఒక ప్రయోగశాల. గతంలో ఇక్కడే రైతు బంధును ప్రారంభించాం. ఇప్పుడు అదే సెంటిమెంటుతో దళిత బంధును ప్రారంభిస్తున్నాం. దీనిని నూటికి నూరుపాళ్లు విజయవంతం చేసితీరుతాం. ఈ పథకాన్ని ప్రకటించాక కొందరు చిల్లరమల్లర విమర్శలు చేశారు. నేను స్పందించలేదు. స్పందించి మొత్తం వివరాలు చెప్పి ఉంటే.. ఆనాడే ఆ నాయకుల గుండెలు ఆగి మరణించేవారు. అలాంటి వారిని చూసి ఆగం కావొద్దు.
సోమవారం హుజూరాబాద్‌లో దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, దళితబంధు లబ్ధిదారులు
25 ఏళ్లనాటి ఆలోచన..
ఈ పథకం ద్వారా దళిత వాడలను బంగారు మేడలు చేయడమే మా లక్ష్యం. వాస్తవానికి దళితబంధు ఆలోచన ఈనాటిది కాదు. 25ఏళ్ల క్రితం నేను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే సిద్దిపేటలో దళిత చైతన్య జ్యోతి పేరిట వారి అభ్యున్నతికి పాటుపడ్డాం. గత ఏడాదే ఈ పథకం ప్రారంభించాల్సి ఉంది. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడింది. దళితబంధు పథకం నిధులతో మీకు నచ్చిన, వచ్చిన వ్యాపారం చేసుకోవచ్చు. వాహనాలు, సూపర్ మార్కెట్లు, హార్వెస్టర్లు, బార్లు, వైన్‌షాపులు, ఎలక్ట్రిక్ వ్యాపారాలు ఏది చేసినా.. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలు మీకు మార్కెటింగ్ కల్పిస్తాయి. ఈ మేరకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తాం. పొరపాటున లబ్ధిదారులు మరణిస్తే వారి కుటుంబం ఆపదకు లోనుకాకుండా దళిత రక్షణనిధి నుంచి సాయం అందిస్తాం.
కొత్తగా ‘దళిత బంధు’ఖాతాలు
దళితబంధు పథకం కింద ఇచ్చే సొమ్ముకు బ్యాంకుల నుంచి కిస్తీల బాధ ఉండదు. మీ డబ్బుకు మీరే యజమానులు. బ్యాంకు వారు పాత బకాయిలు కట్ చేసుకోకుండా కొత్తగా దళితబంధు పేరుతో ఖాతాలు తెరిపించే బాధ్యతలను జిల్లా కలెక్టర్లు తీసుకుంటారు. దళితబంధు పథకం కాదు.. ఇదొక మహా ఉద్యమం. దేశమంతా ఈ ఉద్యమం పాకాలి. అందుకు హుజూరాబాద్ పునాది రాయి కావాలి. పథకం అమలుకోసమే కర్ణన్‌ను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించాం. దళిత జాతి అభ్యున్నతికి, ఉద్యమకారులకు అండగా నిలిచిన బొజ్జా తారకం కుమారుడు ఐఏఎస్ అ«ధికారి, ఎస్సీ వెల్ఫేర్ సెక్రెటరీ రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్రటరీగా ప్రకటించాం.
సోమవారం హుజూరాబాద్ నియోజకవర్గం శాలపల్లిలో దళితబంధు ప్రారంభోత్సవ సభకు హాజరైన ప్రజలు
విద్యార్థులు గ్రామాలకు వెళ్లాలి
దళితబంధు పథకం విజయవంతం అయ్యేలా దళిత మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు చైతన్యం కల్పించాలి. ముఖ్యంగా విద్యార్థులు ప్రతీ గ్రామానికి వెళ్లి ‘గో టు విలేజేస్ అండ్ ఎడ్యుకేటెడ్ అవర్ మాసెస్’అన్న నినాదంతో కార్యక్రమాన్ని చేపట్టాలి.
ఎక్కడా లేని స్థాయిలో సంక్షేమ పథకాలు
కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రైతులకు రూ.లక్ష కోట్లకుపైగా, యాదవులకు రూ.11 వేల కోట్లకుపైగా కేటాయించాం. మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, వృద్ధాప్య పింఛన్లు తదితర విజయవంతమైన సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు..’’
మీ ఇంటికొచ్చి చాయ్ తాగుతా..
సభలో ప్రసంగం అనంతరం సీఎం కేసీఆర్ 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. తొలి చెక్కును రాధమ్మ అనే మహిళకు ఇచ్చారు. ఈ డబ్బుతో ఏం చేస్తావని కేసీఆర్ ఆమెను అడగ్గా.. తనకు డెయిరీ అంటే ఆసక్తి ఉందని రాధమ్మ చెప్పింది. దీనిపై స్పందించిన సీఎం.. ‘‘అయితే.. మళ్లీ వచ్చినప్పుడు మీ ఇంట్లో చాయ్ తాగుతా’ అని పేర్కొన్నారు.
జంబో వేదిక..
శాలపల్లి సభలో విశాల వేదికను ఏర్పాటు చేశారు. కీలక మంత్రులు, ఎమ్మెల్యేలంతా వేదికపై ఆసీనులు కావడం గమనార్హం. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు కె.కేశవరావు, లక్ష్మీకాంతరావు, సురేశ్‌రెడ్డి, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, సుంకె రవిశంకర్, దానం నాగేందర్, తాటికొండ రాజయ్య, శంకర్‌నాయక్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, రేఖానాయక్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చెన్నమనేని రమేశ్‌బాబు, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, కోరుకంటి చందర్, సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, హుజూరాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తాజా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వేదికపై కూర్చున్నారు.
గోప్యంగా లబ్ధిదారుల తరలింపు
– చివరి నిమిషం దాకా బయటపెట్టని వైనం
– వేదిక వెనుక నుంచి తీసుకువచ్చిన అధికారులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/హుజూరాబాద్: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ‘దళితబంధు’ పథకాన్ని అందుకునే లబ్ధిదారుల పేర్లను అధికారులు చివరివరకు గోప్యంగా ఉంచారు. వారికి ఆదివారం రాత్రే సమాచారం ఇచ్చారు. సోమవారం ఉదయమే వెళ్లి లబ్ధిదారులను, వారి కుటంబసభ్యులను ప్రత్యేక వాహనాల్లో సభ వద్దకు తీసుకువచ్చారు. సభ వద్ద కూడా వారు ఎవరికంటా పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. వెనుకవైపు వీఐపీ మార్గం ద్వారా వేదికపైకి పంపించారు. సభ వద్ద ఆయా లబ్ధిదారులు ‘సాక్షి’ ప్రతినిధులతో మాట్లాడారు.
డెయిరీ పెట్టుకుంటా..
మేం కూలి పనిచేసుకొని బతుకున్నాం. ఈ 10 లక్షలతో పాడి పశువులు కొని డెయిరీ పెట్టాలనుకుంటున్నాం. సాయం రావడం కలలో కూడా ఊహించలేదు. కేసీఆర్ సార్.. మా బతుకుల్లో వెలుగులు నింపిండు.
-కొత్తూరిరాధ–మొగిలి, కనుకులగిద్ద, హుజూరాబాద్, తొలి లబ్ధిదారు
ట్రాక్టర్ తీసుకుంటం
అధికారులు వచ్చేంత వరకూ నా పేరు ఎంపికయిందని తెలియదు. ఆర్థిక సాయంతో ట్రాక్టర్ కొనుక్కోవాలని అనుకుంటున్నా. నా కుమారుడికి ట్రాక్టర్ అప్పజెబుతా. మాకున్న ఎకరం భూమికి మరింత భూమి కౌలు తీసుకుని, దున్నుకోవాలని ఆలోచిస్తున్నం.
-రవీందర్, కన్నూరు, కమలాపూర్
భూమి కొనుక్కుంటా..
మాకు భూమి లేదు. మేమిద్దరం కూలీలమే. ప్రభుత్వం అందించిన రూ.10 లక్షలతో 20 గుంటల భూమి కొనుక్కుంటాం. సీఎం చేసిన ఈ సాయాన్ని ఎన్నటికీ మరువలేం. మాకు వస్తదనుకోలే.. - రాధిక, శనిగరం, కమలాపూర్ మండలం
అధికారులు సూచించినట్టు చేస్తా..
నేను దినసరి కూలీని. దళిత బంధు సాయానికి ఎంపికైనట్టు ఉదయం దాకా తెలియదు. ఏం చేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. అధికారులు ఎట్ల చెప్తే అట్ల చేసుకుంటా.
-బాజాల సంధ్య, హుజూరాబాద్ మండలం
సీఎం చేతుల మీదుగా చెక్కులు అందుకున్నది వీరే..
1. కొత్తూరి రాధ–మొగిలి, హుజూరాబాద్ రూరల్
2. రొంటల రజిత– సరిత, హుజూరాబాద్ అర్బన్
3. కొత్తూరి స్రవంతి – కనకం
4. శనిగరపు సరోజన – రవీందర్
5. చెరువు ఎల్లమ్మ – రాజయ్య, జమ్మికుంట మండలం నగరం గ్రామం
6. రాచపల్లి శంకర్– మౌనిక, జమ్మికుంట టౌన్
7. పిల్లి సుగుణ– మొగిలి, జమ్మికుంట రూరల్
8. సంధ్య బాజాల– గంగయ్య
9. కడెం రాజు– వినోద, ఇల్లందకుంట
10. కసరపు స్వరూప– రాజయ్య, వీణవంక
11. ఎలుకుపల్లి కొమురమ్మ– రాజయ్య, చల్లూరు
12. కనకం రవీందర్– హరిత, కమలాపూర్
13. నామపెల్లి రాజేందర్
14. మాట్ల సుభాష్– మనెమ్మ
15. రాజేందర్, కమలాపూర్
Comments
Please login to add a commentAdd a comment