సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు మరింత ఆదాయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ రంగంలో సంస్కరణల ద్వారా ప్రస్తుత ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం మైనింగ్ రంగం ద్వారా రూ. 3,612 కోట్ల ఆదాయం వస్తుండగా సంస్కరణల తర్వాత ఈ ఆదాయం రూ. 7,518 కోట్లకు చేరుతుందని భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఏర్పాటైన ఉప సంఘం మైనింగ్ రంగానికి చెందిన వివిధ వర్గాలతో సంప్రదింపుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
ఈ నివేదికపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశముంది. ఈ సంస్కరణలు అమల్లోకి వస్తే మైనింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు అదనంగా రూ. 3,906 కోట్లు సమకూరుతాయి. లేటరైట్, రోడ్ మెటల్, మొరం, మార్బుల్, క్వారŠట్జ్ వంటి మైనర్ మినరల్స్‌ను వేలం వేయడం, సీనరేజి, డెడ్ రెంట్ శాతాన్ని పెంచడం ద్వారా రాబడి పెరుగుతుందనే ప్రధాన సంస్కరణలను కేబినెట్ సబ్‌కమిటీ ప్రతిపాదించినట్లు సమాచారం.
వాటితోపాటు పర్యావరణ ప్రభావ (ఈఐ) ఫీజు పెంపు, ఈఐ విస్తీర్ణం తగ్గింపు, ఇసుకపై సీనరేజీ పెంపు, ఇసుక ధర అదనంగా రూ. 100 పెంపు, గ్రావెల్‌కు దరఖాస్తు ధర వంటి ప్రతిపాదనలను కేబినెట్ సబ్ కమిటీ తిరస్కరించింది. ఈ నిర్ణయాల ద్వారా రాష్ట్ర ఖజానాపై రూ. 260 కోట్ల మేర ప్రభావం చూపుతుందని మంత్రివర్గ ఉప సంఘం అంచనా వేసింది.
సీనరేజీ ఫీజు పెంపుతో రూ.578 కోట్లు
లీజు విస్తీర్ణంలో ఖనిజాల వెలికితీతపై విధించే సీనరేజి పన్నును మూడేళ్లకోసారి సవరించాల్సి ఉండగా 2015 సెప్టెంబర్ నుంచి సవరించలేదు. దీంతో ఇసుకను మినహాయించి ఇతర ఖనిజాల వెలికితీతపై 40–50 శాతం సీనరేజి పెంపు ద్వారా అదనంగా రూ. 578 కోట్లు రాబట్టవచ్చని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ప్రస్తుతం సీనరేజీ ద్వారా రూ. 1,149 కోట్ల ఆదాయం వస్తుండగా పెంపుదలతో రూ. 1,727 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది.
వెలికితీసిన ఖనిజాల రవాణా అనుమతి కోసం కొత్తగా ‘పర్మిట్ ఫీజు’ను విధించాలని నిర్ణయించగా గ్రానైట్‌కు సీనరేజీలో 0.4 రెట్లు, ఇతర ఖనిజాలకు 0.8 రెట్లు వసూలు చేయడం ద్వారా రూ.1,219 కోట్లు రాబట్టవచ్చని సబ్ కమిటీ ప్రతిపాదించింది. క్వారీలో కార్యకలాపాలు జరగకున్నా మూసి ఉన్న కాలానికి వసూలు చేసే ‘డెడ్ రెంట్’ను గత ఆరేళ్లుగా సవరించలేదు.
ఈ నేపథ్యంలో డెడ్ రెంట్‌ను వంద శాతం పెంచడం ద్వారా ఆదాయం రూ.94 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇదిలాఉంటే మైనింగ్ లీజు రెన్యూవల్‌పై కూడా డెడ్‌రెంట్‌కు నాలుగు రెట్లు చార్జీలు వసూలు చేయడం ద్వారా రూ.29 కోట్లు, లీజు హక్కులను బదిలీ చేసేందుకు లీజు ఫీజు కింద రూ.14.48 కోట్లు రాబట్టాలని ప్రతిపాదించింది.
లీజు, వేలం దరఖాస్తులకు ఫీజు వసూలు
లీజు లేదా వేలం దరఖాస్తు ఫీజు ద్వారా రూ.25 కోట్లు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పెండింగులో ఉన్న కేసులను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద పరిష్కారం చేసి రూ. 206 కోట్లు సమకూర్చుకునే అవకాశం ఉందని సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
కృత్రిమ ఇసుక తయారీని ప్రోత్సహించడం ద్వారా రూ. 300 కోట్లు, సున్నపురాయి, మాంగనీసు వంటి మేజర్ మినరల్స్ బ్లాక్‌ల వేలం ద్వారా రూ.565 కోట్లు, మైనర్ మినరల్స్ వేలం ద్వారా రూ.250 కోట్లు, లెటర్ ఆఫ్ ఇంటెంట్ల జారీ, ప్రస్తుత లీజులపై సెక్యూరిటీ డిపాజిట్ల ద్వారా అదనపు ఆదాయం రాబట్టాలని కేబినెట్ సబ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదిస్తే నిబంధనలు సవరించి కొత్త మైనింగ్ పాలసీని అమలు చేస్తామని మైనింగ్ విభాగం వర్గాలు
వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment