సాక్షి, అమరావతి : మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్ సంస్థే చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని ప్రభుత్వం హైకోర్టుకు సోమవారం నివేదించింది. తాము ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని, మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తాజా సోదాలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని నివేదించింది. చిట్ రిజిస్ట్రార్లు చేస్తున్న సోదాలను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ వ్యాజ్యంపై జస్టిస్ నైనాల జయసూర్య సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. చట్టం ఇచ్చిన అధికారం మేరకే చిట్ రిజిస్ట్రార్లు సోదాలు చేస్తున్నారని తెలిపారు. పగలు సోదాలు చేస్తుంటే చందాదారులు ఇబ్బంది పడుతున్నారని, కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందంటున్న మార్గదర్శి.. ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో రాత్రిళ్లు సోదాలు చేస్తుంటే తామేదో నేరం చేస్తున్నట్లు కోర్టులో ఫిర్యాదు చేస్తోందని అన్నారు.
ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. షట్టర్లు మూసి సోదాలు చేస్తున్నామన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఆ సంస్థ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఘటనలు రిజిస్ట్రార్ల దృష్టికి వచ్చినందునే చట్ట ప్రకారం చర్యలు చేపట్టారని, నిబంధనలను అనుసరించే స్వతంత్రంగా సోదాలు చేస్తున్నారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాలనూ ఉల్లంఘించలేదన్నారు.
గత సోదాల్లో పలు అక్రమాలు వెలుగు చూశాయి
సీఐడీ తరఫు న్యాయవాది వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శిపై నమోతైన పలు కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని, రెండింట్లో చార్జిషీట్లు దాఖలు చేశామని చెప్పారు. గతంలో నిర్వహించిన సోదాల్లో సీఐడీకి లభించిన పలు కీలక డాక్యుమెంట్లను అధ్యయనం చేసిన తరువాత మార్గదర్శి ఎలాంటి మోసాలకు పాల్పడిందో అర్థమైందన్నారు.
ఓ చిట్ గ్రూపులో ఇవ్వాల్సిన మొత్తాలను మరో చోట సర్దుబాటు చేస్తున్నారని తెలిపారు. నర్సరావుపేట చిట్ గ్రూపునకు చెల్లించాల్సిన మొత్తాలను రాజమండ్రి గ్రూపులకు సర్దుబాటు చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. చందాదారులకు తెలియకుండానే ఇలాంటి వ్యవహారాలు మార్గదర్శిలో చాలా జరుగుతున్నాయన్నారు.
రాత్రివేళ సోదాలు చేస్తున్నారు
అంతకు ముందు మార్గదర్శి యాజమాన్యం తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు, మీనాక్షి ఆరోరా వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రి వేళ సోదాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిసారీ తాము హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెస్తుంటే.. కొత్త ఎత్తుగడలతో ప్రభుత్వం సోదాలు చేస్తోందన్నారు.
గతంలో ఇలాంటి సోదాలు జరగలేదని, 2019లో ప్రభుత్వం మారిన తరువాతే జరుగుతున్నాయని అన్నారు. సోదాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఉత్తర్వులు చెల్లవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మంగళ లేదా బుధవారం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వెలువరిస్తానని తెలిపారు. అప్పటివరకు సోదాలు చేయకుండా అధికారులకు తగిన సూచనలు చేయాలని ఎస్‌జీపీ చింతల సుమన్‌కు మౌఖికంగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment