చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ | A collective fight against Ramoji irregularities | Sakshi
Sakshi News home page

చందాదారుల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీ

Published Thu, Feb 29 2024 4:20 AM | Last Updated on Thu, Feb 29 2024 8:05 AM

A collective fight against Ramoji irregularities - Sakshi

మీడియాకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మోసాలు తెలియజేస్తున్న బాధితులు

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఓ బందిపోటు సంస్థ 

పేదలు, మధ్యతరగతి వర్గాలను వేధిస్తోంది 

కాల్‌మనీ రాకెట్‌లా ఇళ్లపైకి దాడులు చేస్తోంది 

చిట్టీల ఉచ్చులో బిగించి ఆస్తులు గుంజుకుంటోంది 

ప్రైజ్‌మనీ ఇవ్వకుండా రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది 

గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది 

రామోజీ అక్రమాలకు వ్యతిరేకంగా సమష్టి పోరాటం 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘం స్పష్టీకరణ 

విజయవాడలో బాధితుల సమావేశం.. పెద్ద ఎత్తున తరలివచ్చిన చందాదారులు 

తామెలా మోసపోయామో వివరించిన బాధితులు 

సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఓ బందిపోటు సంస్థ. పేదలు, మధ్య తరగతివర్గాల ఆస్తులు కొల్లగొడుతున్న గజదొంగ రామోజీరావు’ అని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘం ధ్వజమెత్తింది. ‘ష్యూరిటీలు ఇచ్చినా కొర్రీలు వేస్తోంది. చిట్టీల ఉచ్చులో బిగించి మా ఆస్తులు కొల్లగొడుతోంది. ప్రైజ్‌మనీ ఇవ్వకుండా మా అనుమతి లేకుండానే రశీదు డిపాజిట్లుగా అట్టిపెట్టుకుంటోంది. గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందలు చేతిలో పెడుతోంది’ అని దుయ్యబట్టింది. ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలను ఇక సహించేది లేదు. సంఘటితంగా పోరాడతాం. సీఐడీ దర్యాప్తునకు సహకరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. రామోజీరావు అక్రమాలపై ఉమ్మడిగా న్యాయ పోరాటం చేస్తాం’ అని స్పష్టం చేసింది. 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలకు వ్యతిరేకంగా బాధితులు బుధవారం విజయవాడలో సంఘటితమయ్యారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో చందాదారులు తరలివచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చిట్టీ కట్టి మోసపోయిన విధానం, తాము పడుతున్న ఇబ్బందులు, పోగొట్టుకున్న ఆస్తులను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతివర్గాల ఆదాయ వనరులను పరిగణనలోకి తీసుకోకుండా తలకు మించి చిట్టీలు కట్టిస్తూ రామోజీరావు వారిని చిట్టీల ఊబిలోకి నెట్టివేసి, వారి ఆస్తులు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.

నిబంధనల ప్రకారం ష్యూరిటీలు సమ ర్పించినవారికి కూడా చిట్టీ ప్రైజ్‌మనీ ఇవ్వకుండా అక్రమ డిపాజిట్లుగా మళ్లిస్తున్నారన్నారు. రామోజీరావు అక్రమాలతో సామాన్యులు ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారని, అయినా అప్పులు తీరక మానసిక క్షోభ అనుభవిస్తున్నారని తెలిపారు. విజయవాడలో ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో రూ.20 లక్షల చిట్టీ కట్టించి వేధిస్తున్నారన్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ గూండాలు ఇంటిపైకి వచ్చి వేధింపులకు గురిచేయడంతో కర్నూలులో ఒకరు తీవ్ర మానసిక క్షోభతో పక్షవాతం బారిన పడ్డారని తెలిపారు.

రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే పేద, మధ్య తరగతి వర్గాల వారిని ఒక చిట్టీతో మొదలుపెట్టి అయిదు.., పది.., ఇరవై వరకు చిట్టీల్లో సభ్యులుగా చే ర్పించి వారు అప్పులు, వాయిదాల ఉచ్చు నుంచి బయటకు రాలేని దుస్థితి కల్పిస్తున్నారని వివరించారు. ఒక చిట్టీ ప్రైజ్‌మనీని మరో చిట్టీలోకి సర్దుబాటు చేస్తూ చందాదారులకు చేతికి మాత్రం చిల్లిగవ్వ ఇవ్వడంలేదని తెలిపారు. 

చందాదారులందరినీ సంఘటితం చేసేందుకే ఈ సంఘం 
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులు కొన్ని వేల మంది ఉన్నారని, వారందరినీ సంఘటితం చేసేందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశామని శ్రీనివాస్‌ చెప్పారు. కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టంలోని సెక్షన్‌ 22, 66 ప్రకారం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు సమష్టిగా పోరాడతామన్నారు. అందుకు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నాయని చెప్పారు. 

కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నేలా రామోజీ అక్రమాలు  
సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు మాట్లాడుతూ కాల్‌మనీ రాకెట్‌ను తలదన్నే రీతిలో రామోజీరావు అరాచకాలకు పాల్పడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. చందాదారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తూ వారిని శాశ్వతంగా రుణగ్రస్తులుగా ఉండేట్టు కుట్ర పన్నుతున్నారన్నారు. తమ కుటుంబం రెండు చిట్టీలతో మొదలు పెడితే.. తరువాత ఏకంగా 40 చిట్టీల వరకు చేర్చించి మోసం చేశారన్నారు. రూ.80 లక్షల చిట్టీ పాట పాడితే రూ.215 మాత్రమే ఇచ్చారని, రూ.40 లక్షలు, రూ.20 లక్షలు, రూ.10 లక్షలు చిట్టీలు పాడినా ఒక్క దానికి కూడా రూ.200కు మించి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టం చందాదారులకు కల్పిస్తున్న రక్షణ పట్ల చాలామందికి అవగాహన లేకపోవడాన్ని రామోజీరావు తన దుర్మార్గాలకు అనుకూలంగా మలచుకుంటున్నారని అన్నారు. అందుకే చందాదారుల్లో చైతన్యం తీసుకొచ్చి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఈ  సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులకు అండగా నిలుస్తామని చెప్పారు.  – సంఘం ఉపాధ్యక్షుడు సాంబశివరావు

ఇళ్లపై పడి వేధిస్తున్నారు.. ఆస్తులు గుంజుకున్నారు
‘మా సంతకాలు ఫోర్జరీ చేసి కొత్త చిట్టీ గ్రూపుల్లో చే ర్పించారు. మాకు తెలియకుండానే పాట పాడి ఆ మొత్తాన్ని అప్పుల కింద జమ చేసుకున్నామని చెప్పారు. 90 చిట్టీల్లో చే ర్పించి మమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. అవి తీర్చడం కోసం మా ఇల్లు, స్థలాలు తీసుకున్నారు.

విదేశాల్లో ఉన్న మా అమ్మాయి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి ఆమెను కూడా చందాదారుగా చే ర్పించారు. ఆమె  సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రైజ్‌మనీ డబ్బును వాళ్లే తీసుకున్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే ఇంటి మీదకు గూండాలను పంపించి తీవ్రంగా వేధిస్తున్నారు’ అని సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి ఆవేదనతో చెప్పారు.  – సంఘం కార్యదర్శి అన్నపూర్ణాదేవి 

నా అనుమతి లేకుండానే నా డబ్బు డిపాజిట్‌ చేసేశారు  
నేను చిట్టీ పాడి నిబంధనల ప్రకారం నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా ప్రైజ్‌మనీ ఇవ్వడంలేదు. నా అనుమతి లేకుండానే డిపాజిట్‌గా జమ చేసేశారు. అలా ఎందుకు చేశారు అని గట్టిగా అడిగితే భవిష్యత్‌ చందాల కోసం డిపాజిట్‌ చేశామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అలా ప్రతి ఆరు నెలలకు వాళ్లే డిపాజిట్లను రెన్యూవల్‌ చేస్తూ రెండేళ్లుగా ప్రైజ్‌మనీ ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాలా వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మోసాల బారిన పడి తీవ్ర  ఇబ్బందులు పడుతున్నారు.   – విశ్వప్రసాద్, బాధితుడు

ష్యూరిటీలు ఇచ్చినా వేధిస్తున్నారు 
మేము చిట్టీ పాడితే, ఆ ప్రైజ్‌ మనీ ఇవ్వడానికి నలుగురు ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు కావాలని చెప్పారు. నేను నలుగురితో ష్యూరిటీలు ఇప్పించాను. అయినా చాలదు అన్నారు. ఆరుగురు.. తరువాత ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులతో ష్యూరిటీలు ఇప్పించినా మా ప్రైజ్‌మనీ మాత్రం ఇవ్వలేదు. పైగా ష్యూరిటీ ఇచ్చిన వారిని వేధిస్తున్నారు. దీనిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. న్యాయం కోసం ఈ సంఘంలో  సభ్యునిగా చేరాను.  – నందిగం వరప్రసాద్, హైదరాబాద్‌ 

‘మార్గదర్శి’పై కఠిన చర్యలు తీసుకోండి 
హోం శాఖ, సీఐడీకి బాధితుల విజ్ఞప్తి 
సాక్షి, అమరావతి: చందాదారులను మోసగిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ మోసాలకు అడ్డుకట్ట వేసి చందాదారులకు న్యాయం చేయాలని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితుల సంఘం అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు వి.సాంబశివరావు, కార్యదర్శి వి.అన్నపూర్ణమ్మ, ఇతర ప్రతినిధులు హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్‌ గుప్తా, సీఐడీ అదనపు డీజీ సంజయ్‌కు బుధవారం విడివిడిగా వినతిపత్రాలు సమ ర్పించారు.

ష్యూరిటీలు సమ ర్పించినా చందాదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. చందాదారుల సొమ్మును రామోజీరావు సొంత వ్యాపారాల్లో పెట్టుబడులుగా మళ్లిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని చెప్పా­రు. కేంద్ర చిట్‌ఫండ్స్‌ చట్టంలోని సెక్షన్లు 22, 64 ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై కఠిన చర్యలు తీసు­కుని చందాదారులకు అండగా నిలవాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement