సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలు, నిధుల మళ్లింపు, ఇతర ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీపై ‘ఈనాడు’ పత్రిక ప్రచురిస్తున్న అసత్య, తప్పుడు కథనాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు న్యాయస్థానం స్పందించింది. ఈ ఫిర్యాదులో నిందితులపై చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. ఆ తర్వాతే ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించారని వెల్లడించింది.
ఈ ఫిర్యాదులో నిందితులుగా ఉన్న ఈనాడు అధినేత రామోజీరావు, మార్గదర్శి చిట్‌ఫండ్ లిమిటెడ్ ఎండీ శైలజా కిరణ్, ఈనాడు ఎండీ కిరణ్, ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, చీఫ్ ఆఫ్ న్యూస్ బ్యూరో నన్నపనేని విశ్వప్రసాద్, హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఎం.నరసింహారెడ్డి, ఏపీ బ్యూరో చీఫ్ కనపర్తి శ్రీనివాసులు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌లకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 25కి వాయిదా వేసింది.
ఈ మేరకు గుంటూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సీహెచ్.రాజగోపాలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 25న రామోజీరావు, కిరణ్, శైలజా కిరణ్‌లతో సహా మిగిలిన వారందరూ వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ రోజున న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల మేరకు వారు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కేసు విచారణ మొదలవుతుంది.
ఈనాడు తప్పుడు, విష కథనాలపై ఫిర్యాదు..
మార్గదర్శి అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీపై ఈనాడు వరుసగా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ‘మార్గదర్శిపై భారీ కుట్ర’ అంటూ ఓ కథనం ప్రచురించింది. ఇందులో సీఐడీపై పలు అసత్య, నిరాధార ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ఈనాడు ఎడిటర్, ఇతరులపై సీఆర్‌పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
అలాగే ఈనాడు, రామోజీరావు తదితరులపై గుంటూరు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసే ఫిర్యాదులో వాదనలు వినిపించే బాధ్యతలను అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి అప్పగించింది. దీంతో గుంటూరు ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జూలై 4న కోర్టులో సీఆర్‌పీసీ సెక్షన్ 199(2) కింద ఫిర్యాదు దాఖలు చేశారు.
దీంతోపాటు ఈనాడు ప్రచురించిన కథనం, ఫిర్యాదుల కాపీలు, ఎఫ్‌ఐఆర్‌లు, రామోజీరావు, కిరణ్‌ల వాంగ్మూలం, శైలజా కిరణ్ రిమాండ్ రిపోర్టులు తదితరాలను అందించారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జి దీన్ని మరో న్యాయమూర్తికి పంపారు. ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి సీహెచ్ రాజగోపాలరావు గురువారం విచారణ జరిపారు.
సీఐడీ మనోస్థైర్యం దెబ్బతీసేలా తప్పుడు కథనాలు..
ఫిర్యాదుదారు తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చట్టప్రకారం చిట్ రిజిస్ట్రార్లు మార్గదర్శి చిట్‌ఫండ్‌లో చేసిన తనిఖీల్లో ఆ సంస్థ అక్రమాలు, అవకతవకలు బయటపడ్డాయన్నారు. దీంతో వాటిపై చిట్ రిజిస్ట్రార్లు సీఐడీకి ఫిర్యాదు చేశారని, దీని ఆధారంగా సీఐడీ విచారణ మొదలు పెట్టిందన్నారు. సీఐడీ చట్టప్రకారమే నడుచుకుంటున్నా దాని మనో, నైతిక స్థైర్యాలు దెబ్బతీసేలా ఈనాడు యాజమాన్యం తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని కోర్టుకు నివేదించారు.
సీఐడీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకే ఈనాడు ఇలా చేసిందన్నారు. ఇలాంటి వాటిని అడ్డుకోకపోతే ఈనాడు యాజమాన్యం చేస్తున్న పనులకు అనుమతి ఇచ్చినట్లేనన్నారు. టీవీల్లో చర్చా కార్యక్రమాలు పెడుతూ న్యాయమూర్తులను లంచగొండులుగా చిత్రీకరిస్తున్నారని, దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పరువు, ప్రతిష్టలు ఎవరికైనా ఒకటేనని, వాటిని పరిరక్షించేందుకు న్యాయస్థానాలు ముందుకు రాకపోతే సమాజంలో అరాచకం రాజ్యమేలుతుందని తెలిపారు. ‘ప్రభుత్వాలను నిలబెట్టేది మేమే.. కూల్చేది మేమే’ అన్నట్లు ఈనాడు యాజమాన్యం వ్యవహరిస్తోందని.. ఇలాంటి తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని సుధాకర్‌రెడ్డి న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల ఈనాడు తప్పుడు, విష కథనాల విషయంలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన అభ్యర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment