సాక్షి, అమరావతి: ఆదరించినవారికి ద్రోహ చేయడం, ఆశ్రయం కల్పించిన వారిని ముంచేయడం అంటే ఠక్కున చంద్రబాబే గుర్తుకు వస్తారు. కానీ ఆయన రాజగురువు రామోజీరావు కూడా ఆ విషయంలో రెండాకులు ఎక్కువే చదివారు. రామోజీ వ్యాపార సామ్రాజ్యానికి నల్లధనం సరఫరా యూనిట్‌గా నిలుస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్సే నమ్మక ద్రోహం, మోసాల పునాదుల మీద ఏర్పడింది.
నమ్మి ఆశ్రయం కల్పించిన మిత్రుడు, భాగస్వామి జీజే రెడ్డి కుటుంబాన్ని నిలువునా మోసం చేసి, వారి షేర్లను కొల్లగొట్టి.. తుపాకీతో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను హస్తగతం చేసుకోవడం రామోజీ వికృత వ్యాపారానికి నిదర్శనం. రామోజీ చేసిన ద్రోహంపై జీజే రెడ్డి వారసులు సీఐడీకి ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది. పాయింట్ బ్లాంక్‌లో తుపాకి గురిపెట్టి రామోజీ చేసిన మైండ్ బ్లోయింగ్ దుర్మార్గం ఇదిగో ఇలా ఉంది..
ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ..
కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్ ఎంటర్‌ప్రైజెస్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అదే జిల్లా పెదపారుపూడికి చెందిన రామోజీరావు అప్పట్లో నిరుద్యోగి. 1960లో కమ్యూనిస్ట్ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సు చేయడంతో రామోజీకి జీజే రెడ్డి తన కంపెనీలో టైపిస్టుగా ఉద్యోగం ఇచ్చారు. అంతేకాదు.. రెండేళ్లకే అంటే 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయడం కోసం రామోజీరావుకు జీజే రెడ్డి ఆర్థిక సహకారం అందించారు.
ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. తదనంతర పరిణామాల్లో జీజే రెడ్డి చెకొస్లెవేకియాలో స్థిరపడి 1985లో అక్కడే చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. కాగా జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్లను తమ పేరిట బదిలీ చేయాలని చాలాసార్లు కోరినా రామోజీరావు ససేమిరా అన్నారు. ఆ షేర్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
తుపాకీతో బెదిరించిన రామోజీ
2014లో పత్రికల్లో వచ్చిన వార్తలు, నోటిఫికేషన్ల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి తమ తండ్రి పేరిట ఉన్న షేర్ల కోసం రామోజీరావును కలిసేందుకు రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత... 2016 సెప్టెంబరు 29న రామోజీరావు ఆ సోదరులిద్దరికీ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. తమ తండ్రి పేరిట ఉన్న షేర్లకు సంబంధించి షేర్ సర్టిఫికెట్ ఇవ్వాలని మార్టిన్ రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్ కింద రూ.39,74,400 విలువైన యూనియన్ బ్యాంక్ చెక్ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు.
మిగిలిన సంవత్సరాల డివిడెండ్ కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిని ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్ మీద సంతకం చేయమని మార్టిన్ రెడ్డికి చెప్పారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016 అక్టోబరు 5 వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్ డేటెడ్ చెక్ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీ లేని ఫామ్ ఎస్‌హెచ్–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు.
కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు. దాంతో రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు. సంతకాలు చేయకపోతే కాల్చి పారేస్తా’ అని బెదిరించారు. దాంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందని గానీ, తేదీ గానీ ఆ ఫామ్‌పై లేవు. తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి అక్కడి నుంచి బయటపడ్డారు.
షేర్ల బదిలీకి సమ్మతించని సోదరులు
ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ తమ వాటా షేర్లను బదిలీ చేసేందుకు యూరి రెడ్డి, మార్టిన్ రెడ్డి సమ్మతించలేదు. అందుకే వారు రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు. ఆ చెక్కును నగదుగా మారిస్తే షేర్ల బదిలీకి సమ్మతించినట్టు అవుతుంది. అందుకే వారు ఆ చెక్కును నగదుగా మార్చకుండా అలానే ఉంచారు.
నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకం చేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాలి. చిట్‌ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు.
రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి షేర్ల బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి.
ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ
కానీ అక్రమాల్లో ఆరితేరిన రామోజీ మాత్రం ఫోర్జరీ సంతకాలతో జీజే రెడ్డి షేర్లను తన కోడలు శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాంతో కాస్త ధైర్యం చేసుకుని యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్ కూడా లేదని తెలుసుకుని విస్తుపోయారు.
ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజ కిరణ్ పేరిట బదిలీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే అసలు బాగోతం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్ పేరిట అక్రమంగా బదిలీ చేసేసినట్లు వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే రామోజీరావు ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు.
రామోజీ, శైలజలపై సీఐడీ కేసు
జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్ రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. రెండో కుమారుడు యూరి రెడ్డి భారత్‌లో నివసిస్తూ తమ కుటుంబ ఆస్తి వ్యవహా రాలను పర్యవేక్షిస్తున్నారు. తమ షేర్లను రామోజీ రావు, శైలజ కిరణ్ ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా బదిలీ చేసుకున్నారని యూరి రెడ్డి ఏపీ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే యూరి రెడ్డి తన షేర్ల అక్రమ బదిలీపై ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఆయన కోడలు చెరుకూరి శైలజ కిరణ్‌ను ఏ–2గా పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. వారిపై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్ 34 కింద అభియోగాలు నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment