రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దు | Do not give bail to Ravi Prakash | Sakshi

రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దు

Published Wed, Jun 12 2019 1:56 AM | Last Updated on Wed, Jun 12 2019 1:56 AM

Do not give bail to Ravi Prakash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పోలీసుల విచారణకు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ సహకరించడం లేదని, కొన్ని పత్రాలు ఆయనకు చూపించినా వివరాలు చెప్పడం లేదని, ఈ నేపథ్యంలో రవిప్రకాశ్‌ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ పోలీసుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది హరేన్‌ రావల్‌ చెప్పారు. కొన్ని విషయాలపై రవిప్రకాశ్‌కు మాత్రమే పూర్తి అవగాహన ఉందని, వివరాలు చెప్పకుండా మౌనం గా ఉండటమో, పొంతనలేని జవాబులు చెప్పడమో చేస్తున్నారని తెలిపారు. టీవీ9 యాజమాన్యం దాఖలు చేసిన కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని   రవిప్రకాశ్‌ దాఖలు చేసిన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గండికోట శ్రీదేవి ఎదుట వాదప్రతివాదనలు జరిగాయి. తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడిన రవిప్రకాశ్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉండేలా చేయగలరని చెప్పారు. కావాలని లిటిగేషన్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నాలు కూడా కనబడుతున్నాయని చెప్పారు.

టీవీ9 లోగో ఖరీదు కోట్ల రూపాయల ధర పలుకుతుందని, దానిని కేవలం రూ.99 వేలకే అమ్మేశారంటే ఆయనలో ఉన్న నేరస్వభావాన్ని అర్ధం చేసుకోవచ్చని అన్నారు. కంపెనీ సెక్రటరీ దేవేందర్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారని తప్పుడు పత్రాల్ని సృష్టించారని, అగ ర్వాల్‌ రాజీనామా చేసినట్లుగా రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు పంపించేశారని, దాంతో కొత్త డైరెక్టర్ల వివరాలు పంపితే వాటిని నమోదు చేసేందుకు ఇబ్బంది వచ్చిందని హరేన్‌ రావల్‌ వివరించారు. అగర్వాల్‌ రాజీనామా చేసినట్లు చెబుతున్న నెలలో రోజూ ఆఫీసుకు వచ్చారని, బయోమెట్రిక్‌ కూడా రికార్డు అయిందని, జీతం కూడా తీసుకున్నారని చెప్పారు. సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదన్నారు. ఏడేళ్లకుపైగా శిక్ష పడే కేసు కాబట్టి రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వవద్దని వాదించారు. నటుడు శివాజీకి షేర్ల విక్రయం కూడా ఆర్థిక నేరమేనని, రూ.20 లక్షలకు షేర్లను విక్రయిస్తే ఆ మేరకు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించిన పత్రాల్లో శివాజీగానీ, రవిప్రకాశ్‌గానీ ఎందుకు చూప లేదని ప్రశ్నించారు. శివాజీ తరఫున నోటీసు ఇచ్చిన న్యాయవాదే తిరిగి రవిప్రకాశ్‌ తరఫున జవాబు ఇచ్చారని హైకోర్టు దృష్టికి తెచ్చారు.   శివాజీ పరారీలో ఉన్నందున రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇస్తే దర్యాప్తులోని సమాచారాన్ని ఇతర నిందితులకు తెలియజేసే అవకాశముందన్నారు.  

రవిప్రకాశ్‌ను వెంటాడుతున్నారు...
టీవీ9 లోగోను రవిప్రకాశ్‌ తయారు చేయించారని, కాపీ రైట్‌ యాక్ట్‌ ప్రకారం దానిపై సర్వహక్కులు ఆయనకే చెందుతాయని ఆయన తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దల్జీత్‌సింగ్‌ అహ్లూవాలియా వాదించారు. రవిప్రకాశ్‌కు  మౌనంగా ఉండే హక్కు ఉందని చెప్పారు. పోలీసులు రవిప్రకాశ్‌ను వెంటాడుతున్నారని, కావాలనే కేసుల్లో ఇరికించారని చెప్పారు.   ఎందుకు బెయిల్‌ ఇవ్వాలో, ఎందుకు ఇవ్వరాదో లిఖితపూర్వకంగా న్యాయవాదులు తమ వాదనల్ని హైకోర్టుకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ 18కి వాయిదా పడింది.  

ఎఫ్‌ఐఆర్‌లు కొట్టేయండి: శివాజీ 
తనపై సైబరాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసుల్ని కొట్టేయాలని కోరుతూ నటుడు శొంఠినేని శివాజీ మంగళవారం హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. టీవీ9లో రవిప్రకాశ్‌కు ఉన్న షేర్లలో 40 వేల షేర్లను గత ఏడాది ఫిబ్రవరి 19న రూ.20 లక్షలకు కొనుగోలు నిమి త్తం చెల్లించినట్లు తెలిపారు. అయితే రవిప్రకాశ్‌ షేర్లను బదలాయించకపోవడంతో ఈ ఏడాది మార్చి 15న నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement