
వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌చౌహాన్
సాక్షి, కరీంనగర్: న్యాయస్థానాల్లో కేసులు త్వరగా పరిష్కరించాలని, ఇందుకు న్యాయమూర్తులతోపాటు న్యాయవాదులు, కక్షిదారుల సహకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్‌చౌహాన్ అన్నారు. కరీంనగర్ కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు మినీగార్డెన్, ఈఫైలింగ్ కోర్టు విభాగాలను హైకోర్టు న్యాయమూర్తులు, కరీంనగర్ పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ పి.నవీన్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసి సమావేశంలో మాట్లాడారు. కోర్టు భవనాలు పటిష్టంగా తయారు చేస్తున్నామన్నారు. కోర్టుల్లో చక్కని వాతవరణం నెలకొల్పి, కోర్టుకు వచ్చేవారికి ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్ కోర్టు తెలంగాణలో ఉన్న అన్ని కోర్టులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ దృష్టి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోర్టులో అన్ని సదుపాయాలు కల్పిస్తే కోర్టుకు వచ్చే న్యాయవాదులు, కక్షిదారులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి కావాల్సిన పరిజ్ఞానం అభివృద్ధికి న్యాయమూర్తులకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
జనవరిలోగా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా న్యాయవాదుల పరిజ్ఞానం అభివృద్ధికి వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. దీని ద్వారా చట్టాలపై లోతైన అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు న్యాయవాదులు కక్షిదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. కరీంనగర్‌లో కోర్టులో 762 కేసులు పెండింగ్‌లో ఉండగా మరో రెండు కోర్టుల్లో 80, 22 కేసులు దాదాపు 10 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అనంతరం కరీంనగర్ పోర్ట్‌ఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం మాట్లాడుతూ కోర్టులు సరైన సమయంలో తీర్పులు ఇవ్వకపోవడంతోనే ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. నిబంధనల మేరకే న్యాయమూర్తులను నియమించడం జరుగుతుందన్నారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఎప్పుటికప్పుడు పరిష్కారం చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో మార్పు అనేది కింది స్థాయి నుంచి రావాలని, మన చేతిలో ఉన్న చిన్నచిన్న అభివృద్ధి పనులు మనం చేసుకుంటే తప్పుకాదని వివరించారు. హైకోర్టు మరో జడ్జి పి.నవీన్‌రావు మాట్లాడుతూ కోర్టులో అధునాతన మార్పులు అనందకరమన్నారు.
త్వరలో మరిన్ని మార్పులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి మాట్లాడుతూ కరీంనగర్‌లో కోర్టులో నూతన మార్పులు అందరి సహకారంతో చేయగలిగామని, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెంబర్ కాసుగంటి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ కోర్టు భవనాలను ప్రముఖ కంపెనీలకు కాంట్రాక్టు అప్పగించాలని అప్పుడే దీర్ఘకాలికంగా మన్నిక ఉంటుందని, సంబందిత కంపెనీలు కూడా బాధ్యతగా పర్యవేక్షిస్తారని సూచించారు. ప్రభుత్వ విభాగాలకు అప్పగిస్తే కట్టి వదిలేస్తున్నారని తర్వాత పట్టించుకోవడం లేదని తెలిపారు. అనంతరం కేసుల విషయంలో పలు సమస్యలను హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోర్టు ఆవరణలో న్యాయవాదులకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి, ఫారెస్ట్ ఛీప్ కన్జర్వేటర్ అక్బర్, జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీలు సింధూశర్మ, రాహుల్‌హెగ్డే వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లెంకల రాంరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయస్థానాల సిబ్బంది పాల్గొన్నారు.
ప్రధాన న్యాయమూర్తికి ఘనస్వాగతం...
ఉదయం కరీంనగర్ కోర్టుకు చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌కు జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి ఆధ్వర్యంలో కలెక్టర్‌సర్పరాజ్ అహ్మద్, కరీంనగర్ పోలీసు కమి షనర్ వీబీ.కమలాసన్ రెడ్డి, వరంగల్ రేంజ్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తర్వాత పూర్ణకుంభ స్వాగ తంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌వో వాటర్‌ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు, చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టు భవనం, మిని పార్కు ప్రారంభించారు. కోర్టు ఆరవణలో హైకోర్టు న్యాయమూర్తులు బస్టిస్ కోదండరాం, పి,నవీన్‌రావుతో కలిసి మొక్కలు నాటారు. తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన ఈ–ఫైలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు.
కరీంనగర్ ది బెస్ట్...
కరీంనగర్ కోర్టును ది బెస్ట్ కోర్టుగా ఆదర్శంగా నిలుపాలని ఆకాంక్షిస్తూ చక్కటి ఆహ్లాదకరమైన వాతావారణం ఏర్పాటు చేసిన జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి, జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌తోపాటు ఫారెస్ట్ అధికారులపై ప్రశంసలు కురిపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు కమిషనర్, సిబ్బందిని అభినందించారు. బార్ అసోసియేషన్ సభ్యులు చక్కటి క్రమశిక్షణతో ఉన్నారని చీఫ్ జస్టిస్ కితాబునిచ్చారు. అనంతరం కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి చీఫ్ జస్టిస్ శాలువాలు కప్పి అభినందించారు.
న్యాయవాదులు అంకితభావంతో పనిచేయాలి : హైకోర్టు జడ్జి కోదండరామ్
కమాన్‌చౌరస్తా(కరీంనగర్): న్యాయవాదులు వృత్తిపై అంకిత భావంతో పనిచేయాలని, సమాజంలో తమ బాధ్యత తెలుసుకుని ఎంచుకున్న పనిలో నైపుణ్యత సాధించి దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ హైకోర్టు జడ్జి, కరీంనగర్ జిల్లా ఫోర్ట్ ఫోలియో జడ్జి, జస్టిస్ కోదండరామ్ అన్నారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా న్యాయవాద పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ లాపై శనివారం ఉదయం నిర్వహించిన వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం కంటే ఎన్నో దేశాలు వెనుకబడి ఉన్నాయని, చిన్నదేశాల వారు ఎంతో అంకిత భావంతో దేశంపై ప్రేమతో ఉండడం వల్లనే సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధి చెందాయని తెలిపారు.
దేశం నాకు ఏం ఇచ్చిందని కాదని దేశానికి నేను ఏం చేయాలో ఆలోచించాలన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ , సీనియర్ న్యాయవాది కాసుగంటి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ చట్టాల వివరాలను న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని, ప్రత్యేక రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి రెవెన్యూ చట్టాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. సమావేశంలో న్యాయవాద పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కరూర్ మోహన్, ప్రధాన కార్యదర్శి సునీల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి సత్యనారాయణరావ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణార్జునచారి, వేణుగోపాల్, బార్ కౌన్సిల్ మెంబర్ జయాకర్, కరీంనగర్ జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది కేవీ వేణుగోపాల్‌రావు, వివిధ బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment