
సాక్షి, హైదరాబాద్: వివాహమయ్యాక విదేశాలకు వెళ్లిన దంపతుల మధ్య తలెత్తే వివాదాలు సత్వరం పరిష్కారమయ్యే విధంగా హైకోర్టు తీర్పు వెలువరించింది. దంపతుల మధ్య తలెత్తే ఈ తరహా కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామ చంద్రరావు ఇటీవల కీలక తీర్పు చెప్పారు. పీసీసింగ్–ప్రపుల్ బి.దేశాయ్ కేసులో సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్ విచారణకు చట్టబద్ధత కల్పించిందని హైకోర్టు గుర్తు చేసింది. ‘ఇప్పటి వరకూ క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయిన నిందితుల్ని జైలు నుంచే కోర్టులు విచారిస్తున్నాయి. దంపతుల మధ్య తలెత్తే కుటుంబ కలహాల కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించడానికి వీల్లేదనడానికి న్యాయపరమైన కారణాలు ఏమీ కనబడటం లేదు’అని స్పష్టం చేసింది.
సిటీకోర్టు తిరస్కరణపై హైకోర్టులో సవాల్
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ తన వివాహాన్ని రద్దు చేసి విడాకులు ఇప్పించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో 2012లో కేసు వేసింది. అయితే, వివాహ బంధం కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె భర్త 2013లో పిటిషన్ వేశాడు. ఈ రెండు కేసుల్ని కలిసి సిటీ సివిల్ కోర్టు విచారిస్తోంది. ఆమె తన కుమారుడితో కలిపి అమెరికాలో ఉండగా, ఈ కేసులో ఆమె తండ్రి కోర్టుకు హాజరౌతున్నారు. వాంగ్మూలం నమోదు చేసే విషయంలో ఆమె కింది కోర్టుకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో హైదరాబాద్ వచ్చిన ఆమె గత ఏడాది మార్చి 25 ఏప్రిల్ 14 వరకూ 21 రోజులపాటు ఇక్కడే ఉన్నది. ఏప్రిల్‌లో తిరిగి అమెరికా వెళ్లకపోతే తన పాస్‌పోర్టు సీజ్ చేస్తారని ఆమె కోర్టు దృష్టికి తెచ్చింది. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని మాత్రమే కోర్టు ఆదేశించడంతో విచారణ జరగడం లేదని ఆమె అమెరికా వెళ్లిపోయింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ చేయాలని అమెరికా నుంచి ఆమె కోరగా సిటీ సివిల్ కోర్టు అనుమతించలేదు. దీంతో ఆమె హైకోర్టులో సవాల్ చేశారు.‘భార్యాభర్తలకు అనుకూలమైన తేదీని నిర్ణయించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసుల విచారణ జరపాలి. అమెరికాలో ఉంటూ ఉద్యోగం చేసుకునేవారు ఇక్కడి కేసుల విచారణకు రావాలంటే వారికి సమస్యలు వస్తాయి. ఒక్కోసారి ఉద్యోగం పోయే ప్రమాదం కూడా రావచ్చు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురౌతాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దంపతుల మధ్య వివాదాల్ని కూడా విచారించ వచ్చు’అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment