సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాది రెండో విడత ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు చట్టబద్ధంగా జరిగాయని, రిజర్వేషన్ల అమల్లో తప్పులు జరగలేదని హైకోర్టు తీర్పు చెప్పింది. నిబంధనల మేరకే ప్రవేశాలు జరిగాయని, రిజర్వేషన్ల అమలు వల్ల ఎవరికీ నష్టం జరగలేదని న్యాయమూర్తులు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, జస్టిస్ పి.కేశవరావుల ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. రెండో విడత వైద్య విద్య ప్రవేశాలను జీవోలు 550, 114 ప్రకారం జరగలేదని పేర్కొంటూ ఆదిలాబాద్ జిల్లా ఎన్.భావన మరో నలుగురు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో గతంలో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల అమలు రద్దయింది.
తొలి విడత ప్రవేశాల్లో వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన సీట్లను ఓపెన్ కేటగిరీ ద్వారా భర్తీ చేశాకే రిజర్వేషన్ కోటా భర్తీ చేయాలని జీవోలు స్పష్టం చేస్తున్నాయని, అయితే కాళోజీ వర్సిటీ అధికారులు రెండో విడత సీట్లను ముందుగా రిజర్వేషన్ కేటగిరీ సీట్లను భర్తీ చేసిన తర్వాత ఓపెన్ కోటా సీట్లను భర్తీ చేశారనే వాదన సరికాదని తేల్చింది. అయితే కౌన్సెలింగ్‌లో చట్ట నిబంధనల అమలు విషయంలో వర్సిటీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘రెండు విడతల ప్రవేశాలు జరిగాక వర్సిటీ ఇచ్చిన వివరాల్ని పరిశీలిస్తే రిజర్వేషన్ కేటగిరీకి అన్యాయం జరగలేదని స్పష్టం అవుతోంది. 2,487 సీట్ల భర్తీ తర్వాత 1,800 సీట్లు రిజర్వ్‌డ్ అభ్యర్థులకు లభించాయి. ఓసీలకు 687 సీట్లు వచ్చాయి. ఓపెన్ కోటాలో 137, మిగిలిన 1,663 సీట్లు రిజర్వేషన్ కోటాలో రిజర్వేషన్ వర్గాలకు సీట్లు దక్కాయి. ఓపెన్ కోటాలో ప్రతిభావంతులైన రిజర్వేషన్ వర్గాలకు చెందిన 440 సీట్ల భర్తీలోనూ తప్పులేమీ కన్పించలేదు’ అని ధర్మాసనం వివరించింది.
స్పష్టం చేసి ఉండాల్సింది: జీవో 550ను 2001లో జారీ చేశారు. ఆ జీవోను పేరా 5 ప్రకారం ఓపెన్ కేటగిరీ సీటు ఎంపిక చేసుకున్న రిజర్వ్‌డ్ కోటా అభ్యర్థి తర్వాత దాన్ని వదులుకుని రిజర్వేషన్ కోటాలో సీటు పొందితే.. ఓపెన్ కోటాలో వదిలిన సీటును రిజర్వ్‌డ్ కోటా అభ్యర్థితోనే భర్తీ చేయాలి. దీనినే ప్రభుత్వం జీవో 114లో పేర్కొంది. ఫలితంగా జీవో 550 రద్దు అయినట్లే. జీవో 114 గురించి ప్రభుత్వం హైకోర్టు, సుప్రీం కోర్టులకు నివేదించింది. దీని గురించి వర్సిటీ సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు స్పష్టం చేయలేదు. దీంతో జీవో 550 వినియోగంలో ఉందనే ఆశల్లో పలువురు ఉండిపోయారు. ఈ విషయంలో కాళోజీ వర్సిటీ స్పష్టత ఇచ్చి ఉంటే బాగుండేదని ధర్మాసనం తప్పుపట్టింది.
రిజర్వేషన్లకు లోబడే మెడికల్ అడ్మిషన్లు
Published Tue, Aug 20 2019 1:55 AM | Last Updated on Tue, Aug 20 2019 1:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment