సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాదర్‌గుల్ భూములపై బుధవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బాలాపూర్ మండలం నాదర్‌గుల్ గ్రామంలోని సర్వే నెం.613లోని వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేసేందుకు ఖానాపూర్ ఆర్డీవో నిరాకరించడం సమంజసమేనని పేర్కొంది. భూముల మార్పిడి దరఖాస్తును ఆర్డీవో తోసిపుచ్చడాన్ని, భూముల్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమేగా డెవలప్‌మెంట్ వెంచర్స్ లిమిటెడ్, ఆల్ఫా హోల్డింగ్స్ కంపెనీలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు బుధవారం తీర్పు చెప్పారు. సుమారు రూ.150 కోట్ల విలువైన తమ భూమి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూముల జాబితాలో సెక్షన్ 22ఏ కింద ఉన్నాయని, ఆ జాబితా నుంచి తొలగింపునకు ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
హక్కుదారుల నుంచి భూములు కొనుగోలు చేశామని, రెవెన్యూ రికార్డుల్లోనూ మా కంపెనీల పేర్లున్నాయని, సుప్రీంకోర్టుకు చేరిన ఈ వివాదంలో కంపెనీల హక్కుల నిర్ధారణ కూడా అయిందని కంపెనీలు వాదించాయి. వ్యవసాయేతర భూములుగా చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జాబితా అడ్డంకిగా ఉందన్న అధికారుల వాదనను కొట్టేయాలని కోరాయి. అయితే, ఈ వాదనను ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.
సర్వే నెంబర్ 613లో 373.22 ఎకరాలున్నాయని, ల్యాండ్ సీలింగ్ అంశంపై స్పష్టత లేదని, భూగరిష్ట చట్టం కింద క్రయవిక్రయదారుల నుంచి ఏవిధమైన డిక్లరేషన్ ఇవ్వలేదని స్పష్టంచేసింది. ఇరుపక్షాల వాదనల తర్వాత ప్రభుత్వ వాదనను ఆమోదిస్తూ ఈ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఆర్డీవో నిర్ణయం సమంజసమే
Published Thu, Feb 13 2020 1:29 AM | Last Updated on Thu, Feb 13 2020 1:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment