![IT Grids accused to apply for bail - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/28/ASHOK-13.jpg.webp?itok=ty5wZ0qv)
సాక్షి, హైదరాబాద్: ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ డాకవరం అశోక్, ఆ సంస్థ డైరెక్టర్, ఆయన భార్య శ్రీలక్ష్మి హైకోర్టులో వ్యాజ్యాల్ని దాఖలు చేశారు. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై సంజీవ్‌రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఓటర్ల డేటా చౌర్యానికి పాల్పడ్డామని పోలీసులు తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, తమను అరెస్ట్ చేసే అవకాశమున్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు రిట్ పిటిషన్లలో కోర్టును కోరారు.
ముందస్తు బెయిల్ కోసం వారు చేసుకున్న దరఖాస్తులను రంగారెడ్డి జిల్లాకోర్టు ఈ నెల 25న తిరస్కరించిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు. ఐటీ గ్రిడ్స్‌తో తెలుగుదేశం పార్టీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమని భావించిన వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తునకు హాజరుకావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు అశోక్, శ్రీలక్ష్మి స్పందించలేదు. ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment