
మునుగోడులో ఉప ఎన్నికల వేళ మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ ఓటర్ జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రెండు నెలల్లోనే పాతిక వేలు దాటిందని పేర్కొంది. ఈ తతంగంపై విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది.
అంతకు ముందు 7 నెలల కాలంలో 1,474 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు 6 నెలల్లోనే పెద్ద మొత్తంలో 24,781 దరఖాస్తు రావడం వెనుక టీఆర్‌ఎస్ హస్తం ఉందని చెప్పింది. జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
లంచ్ మోషన్‌లో పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి కోరారు. ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేపట్టలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘం కొత్త దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉందని, ఓటర్ల జాబితాను ఖరారు చేయనున్నారని రచనారెడ్డి తెలపడంతో.. ఈ నెల 13న విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది.