సాక్షి, హైదరాబాద్: జూనియర్ అకౌంట్స్ అధికారుల (జేఏఓ) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రంపై అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని నిపుణుల బృందానికి నివేదించాలని తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్) ను హైకోర్టు ఆదేశించింది. నిపుణుల బృందం చేసే సిఫారసులకనుగుణంగా పోస్టుల భర్తీ ప్రక్రియను కొనసాగించడంతో పాటుగా ‘కీ’పై వస్తున్న అభ్యంతరాలను కూడా ఈ బృందం పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ప్రశ్నలను ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి చేసిన అనువాదాన్ని కూడా పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
అభ్యర్థుల అభ్యంతరాలివి..
రాష్ట్రంలో 107 జూనియర్ అకౌంట్స్ అధికారుల పోస్టు భర్తీకి 2018 మే లో ఎన్‌పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. 35 ప్రశ్నలు అకౌంటెన్సీ, అడ్వాన్డŠస్ అకౌంటెన్సీ, 25 ప్రశ్నలు కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, 20 ప్రశ్నలు ఆడిటింగ్, మిగిలిన 20 ప్రశ్నలు ఎబిలిటీ, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి ఉంటా యన్నారు. జూలైలో రాతపరీక్ష నిర్వహించారు. అయితే...51 ప్రశ్నలు అకౌంటెన్సీ, అడ్వాన్స్‌డ్ అకౌంటెన్సీ నుంచి, 19 ప్రశ్నలు, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ నుంచి, ఆడిటింగ్ నుంచి పది ప్రశ్నలు మాత్రమే ఇచ్చారని ఇది సరికాదంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు వేర్వేరుగా పిటిషన్లు దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు బి.రచనారెడ్డి, భుజంగరావులు వాదనలు వినిపిస్తూ, నోటిఫికేషన్‌లో చెప్పిన విధానానికి, పరీక్ష నిర్వహించిన విధానానికి ఏ మాత్రం పొంతన లేదన్నారు. ఫలానా విభాగంలో ఇన్ని ప్రశ్నలు వస్తాయని పేర్కొనడం వల్ల అభ్యర్థులు అందుకనుగుణంగా ప్రాధాన్యతలను నిర్ణయించుకుని పరీక్షకు సన్నద్ధులయ్యారన్నారు. పరీక్షను రద్దు చేసి, తిరిగి పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.
వారికి ఆ హక్కులేదు..
ఈ వాదనలను ఎన్‌పీడీసీఎల్ తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ తోసిపుచ్చారు. ఫైనల్ కీ విడుదల చేసిన తరువాత కూడా అభ్యర్థులు ఈ అభ్యంతరాలను లేవనెత్తలేదని, ఇప్పుడు ప్రశ్నలు ఫలానా విధంగా లేవంటూ అభ్యంతరం వ్యక్తం చేసే హక్కు వారికి లేదని తెలిపారు. పరీక్ష పత్రం తయారు చేసిన జేఎన్‌టీయూ తరఫున ఏ.అభిషేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అకౌంటెన్సీ, అడ్వాన్స్‌డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ ఇవన్నీ కూడా పరస్పర సంబంధం ఉన్న సబ్జెక్టులేనన్నారు. అందువల్ల పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ సమయంలో ప్రశ్నాపత్రాన్ని నిపుణుల బృందానికి నివేదించే విషయం చర్చకు రాగా, ఎన్‌పీడీసీఎల్ న్యాయవాది అందుకు అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో న్యాయమూర్తి మొత్తం ప్రశ్నపత్రాన్ని నిపుణుల బృందానికి నివేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్ణీత కాల వ్యవధిలోపు ఈ నిపుణుల బృందం అన్నీ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, తగిన సిఫారసు చేయాలని స్పష్టం చేశారు.
జేఏఓ ప్రశ్నపత్రాన్ని నిపుణుల బృందానికి నివేదించండి
Published Sun, May 12 2019 2:14 AM | Last Updated on Sun, May 12 2019 2:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment