సాక్షి, హైదరాబాద్: నోట్ల రద్దు సమయంలో ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెలర్స్ యాజమాన్యం జరిపిన తప్పుడు లావాదేవీలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దర్యాప్తులో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. విచారణలో భాగంగా తమ ముందు హాజరు కావాలంటూ ఈడీ ఈనెల 3న జారీ చేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెలర్స్ యజమానులు నితిన్ గుప్తా, అఖిల్ గుప్తా, కైలాశ్‌చంద్ గుప్తాలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈడీ సమన్లను సవాలు చేస్తూ నితిన్ గుప్తా తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి బుధవారం మరోసారి విచారణ జరిపారు.
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, 2016లో ఈడీ కేసు నమోదు చేసిందని, గత ఏడాది చార్జిషీట్ దాఖలు చేసిందని తెలిపారు. దర్యాప్తు ముగిస్తేనే చార్జిషీట్ దాఖలు చేస్తారని, అలాంటి కేసులో మళ్లీ సమన్లు జారీ చేయడం ఎంత మాత్రం సరికాదన్నారు. ఒకవేళ తిరిగి దర్యాప్తు కొనసాగించాలంటే, అందుకు సంబంధిత కోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరన్నారు. అయితే అటువంటిది ఏమీ లేకుండానే ఈడీ సమన్లు జారీ చేసిందని వివరించారు.
తరువాత ఈడీ తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్ వాదనలు వినిపిస్తూ, ఈ కేసు మొత్తం రూ.111 కోట్లకు సంబంధించిందని తెలిపారు. 2017లో జరిపిన సోదాల్లో మూడు కేజీల బంగారం, రూ.68 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన రూ.110 కోట్ల అక్రమ ఆర్జనను వెలికి తీయాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల సోదాలు జరిపి 148 కేజీల బంగారాన్ని జప్తు చేశామన్నారు. ఈ జప్తును సవాలు చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని, అయితే జోక్యానికి కోర్టు నిరాకరించిందని తెలిపారు. చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత కూడా నిబంధనల ప్రకారం దర్యాప్తు చేయవచ్చునన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ముసద్దీలాల్ జువెలర్స్ యాజమాన్యం పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపారు.
ఈడీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేం
Published Thu, May 23 2019 2:36 AM | Last Updated on Thu, May 23 2019 2:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment