సాక్షి, సిర్పూర్ కాగజ్ నగర్ : ఎఫ్‌ఆర్వో అనితపై దాడికి తెగబడ్డ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 147,148, 207,332,353,427 సెక్షన్ల కింద ఈజ్గామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. కాగా దాడిలో గాయపడ్డ మహిళా అధికారిణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కోనేరు కృష్ణ మొదటగా నాపై దాడికి పాల్పడ్డారు. తర్వాత మరో 10మంది కోనేరు కృష్ణ అనుచరులు కర్రలతో నా తలపై కొట్టారు. ఆ క్షణంలో నేను బతుకుతానని అనుకోలేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోని సార్‌సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సిర్పూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైఎస్ చైర్మన్ కృష్ణ తన అనుచరులతో అడ్డుకోవడమే కాకుండా అటవీ శాఖ అధికారులపై దాడికి తెగబడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment