
హైదరాబాద్: మళ్లీ విధులకు వెళితే తన ప్రాణాలకు రక్షణ ఉండదని, ప్రభుత్వం రక్షణ కల్పించాలని సిర్పూర్ కాగజ్‌నగర్ ఘటనలో గాయపడిన ఎఫ్‌ఆర్‌వో అనిత కోరారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు మాత్రమే అక్కడికి వెళ్లానని, 4 రోజుల ముందే గ్రామస్తులతో సమావేశం నిర్వహించి స్పష్టంగా చెప్పిన తర్వాత పొలంలోకి వెళ్లామని చెప్పారు.
తాము మొక్కలు నాటే పనులు చేస్తుండగా జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణతోపాటు మిగతావారు వచ్చి తనను చుట్టుముట్టి కొట్టారని చెప్పారు. ఎంత వేడుకున్నా వినకుండా దాడి చేశారన్నారు. ఇక్కడ రాజకీయ నాయకులు గ్రామస్తులను రెచ్చగొట్టడం, అధికారులపై దాడులకు ఉసిగొల్పడం చేస్తుంటారని, గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. దాడి చేసిన వారిపై ఏదో ఒక కేసు పెడితే మళ్లీ రాజకీయ బలంతో బయటకు వస్తారని, అప్పుడు తన ప్రాణాలకు రక్షణ ఉండదని భయాందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుని తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment