చిత్తూరు(క్రైమ్)/ పుత్తూరు/ యాదమరి/పీలేరు రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో మంగళవారం పోలీసులు ఐదు చోట్ల దాడులు జరిపి రూ.17 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు స్మగ్లర్లను, 21మంది ఎర్రచందనం కూలీలను, ఇద్దరు వాహన డ్రైవర్లను అరెస్ట్ చేసి ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం వన్‌టౌన్ స్టేషన్ ఆవరణంలో వివరాలు వెళ్లడించారు.
తిరుపతి పరిసరాల్లోని శేషాచల అడవుల నుంచి ఎర్రచందనం తరలిస్తున్నట్లు చిత్తూరు పట్టణ పోలీసులకు సమాచారం అందింది. వెంటనే చిత్తూరు వన్‌టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై జహీర్‌అహ్మద్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఖాళీ టమోటా బాక్సులతో కేఏ09 సి4369 నెంబర్ ఈచర్ వాహనం వేగంగా వెళ్లింది. పోలీసులకు అనుమానం వచ్చి వాహనాన్ని వెంబడించి రెడ్డిగుంట వద్ద ఆపి తనిఖీ చేయగా, ఖాళీ బాక్సుల మధ్య 10 ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఈ వాహనంలోనే ఉన్న గుడిపాల మండలం వెప్పననాయనిచెరువు గ్రామానికి చెందిన ఆనంద్(44), తమిళనాడులోని దిండివనం జిల్లా వీరపట్ల గ్రామానికి చెందిన పొన్నుస్వామి(32), తిరుపతి మంగళం కాలనీకి చెందిన పరంధామ(34)ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాము ఎర్రచందనాన్ని సేకరించి చెన్నైలో స్మగ్లర్లకు విక్రయిస్తామని వారు తెలిపారు. ఎర్రచందనం తరలించేందుకు చిత్తూరుకు చెందిన శీన, తిరుపతికి చెందిన శంకర్ వాహనాలు ఏర్పాటు చేస్తుంటారని చెప్పారు. ఆ ఇద్దరినీ పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని డీఎస్పీ తెలిపారు. నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు తెలిపారు.
లారీ సహా ఎర్రచందనం స్వాధీనం
పుత్తూరు: పుత్తూరు అటవీశాఖ పరిధిలోని కేఎం.అగ్రహారం సమీపంలో మంగళవారం తెల్లవారుజామున లారీ సహా ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని ఫారెస్టు రేంజి ఆఫీసర్ నాగరాజు తెలిపారు. రహస్య సమాచారం మేరకు పుత్తూరు సెక్షన్ ఆఫీసర్ జయశంకర్ బృందాన్ని అప్రమత్తం చేశామన్నారు. వారు అంజేరమ్మ కనుమ కింది భాగంలో కాపు కాచారు. తిరుపతి వైపు నుంచి చెన్నై వెళుతున్న లారీని ఆపేందుకు ప్రయత్నించగా వేగంగా వెళ్లింది. దానిని వెంబడించగా అగ్రహారం వద్ద లారీని నిలిపి డ్రైవరు పారిపోయాడు. లారీలో ఉన్న 54 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.7లక్షలు ఉంటుందన్నారు. దుంగలున్న లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
21మంది ఎర్రకూలీల అరెస్ట్
యాదమరి: యాదమరి పోలీసులు మంగళవారం 21మంది ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశారు. మండల పరిధిలో సోమవారం రాత్రి తమిళనాడుకు చెందిన ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకుని ఒక టాటాసుమో, టవేరా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కూలీలంతా తమిళనాడు విల్లుపురం జిల్లా చిన్నశాలం తాలూకా మేల్‌మురవం గ్రామానికి చెందిన వారని యాదమరి ఎస్సై ఉమామహేశ్వర్‌రావ్ తెలిపారు. కూలీలతో పాటు సుమో డ్రైవర్ మురగేశన్ (39), టవేరా డ్రైవర్ దినేష్ (36)ను అరెస్టు చేశామన్నారు.
రెండు వాహనాలు, ఎర్రచందనం స్వాధీనం
పీలేరు రూరల్ : రెండు వాహనాలు సహా 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, నలుగురు నిందితులను అరెస్ట్ చేశామని పీలేరు ఎస్‌ఐ ఎస్.విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన చెప్పిన వివరాల మేరకు.. మంగళవారం తెల్లవారుజామున యల్లమంద నుంచి పీలేరు వైపు వస్తున్న టీఎన్ 37 ఏఏ 4120 నెంబరు గల మినీ లారీని పోలీసులు తనిఖీ చేశారు. టమాట బాక్సుల మధ్యలో 12 ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించారు. 420 కేజీల బరువు గల ఎర్రచందనం దుంగలతోపాటు మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న ఎర్రావారిపాళెం మండలం యల్లమందకు చెందిన అంకెల రమేష్‌బాబు, ఉస్తికాయలపెంట మొరంకిందపల్లెకు చెందిన రఘునాథరెడ్డిని అరెస్ట్ చేశారు. పీలేరు పట్టణం చిత్తూరు మార్గంలోని రైల్వేగేటు సమీపంలో కేఏ 03 ఎన్ 7822 నెంబరు కారును తనిఖీ చేయగా 9 ఎర్రచందనం దుంగలు దొరికాయి. కారుతోపాటు 170 కేజీల బరువు గల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. సదుం మండలం అమ్మయ్యగారిపల్లెకు చెందిన జీ.కుమార్, ఎన్.ఎర్రయ్యను అరెస్ట్ చేశారు. ఈ దాడిలో ట్రైనీ ఎస్‌ఐ బాలకృష్ణ, సిబ్బంది సుబ్రమణ్యం, చక్రవర్తి, నాగరాజ, చెంగల్రాయుడు, విజయ్ పాల్గొన్నారు.
రూ.17 లక్షల ఎర్రచందనం స్వాధీనం
Published Wed, Sep 25 2013 4:54 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement