
వాహెదాబేగం (ఫైల్)
గండేడ్ (మహబూబ్‌నగర్): కుటుంబ కలహాలతో అటవీశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయిపల్లికి చెందిన భానుప్రకాష్ ఖిల్లాఘనపూర్ వాసి వాహెదాబేగం (32) 2007 నుంచి 2010 వరకు మహబూబ్‌నగర్‌లో ఎంవీఎస్ డిగ్రీ కాలేజీలో చదువుకున్నారు. అదే సమయంలో ప్రేమించుకుని 2014లో మతాంతర వివాహం చేసుకున్నారు. వారికి 2016లో కుమార్తె జన్మించింది. (అగ్నికీలల్లో ఆర్తనాదాలు )
కొన్నాళ్లుగా భర్త మహబూబ్‌నగర్ డీఎఫ్‌ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా, భార్య గండేడ్ మండలంలోని మహమ్మదాబాద్ అటవీ కార్యాలయంలో డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్‌గా పనిచేస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య కొన్నేళ్లుగా ఓ మహిళ విషయమై గొడవలు జరుగుతున్నాయి. ఇదే తరుణంలో అంతకుముందే ప్రేమించిన ప్రియాంక అలియాస్ పప్పీని వివాహం చేసుకుంటానని కొన్ని రోజులుగా వాహెదాబేగాన్ని భర్త వేధించేవాడు. దీంతో విభేదాలు పెరిగి మానసిక క్షోభ భరించలేక బుధవారం ఉదయం భార్య పురుగుమందు డబ్బాతోనే కార్యాలయానికి వచ్చింది. మధ్యాహ్నం అక్కడే తాగిన ఆమెను గమనించిన తోటిసిబ్బంది వెంటనే మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి ముబారక్‌బేగం ఫిర్యాదు మేరకు మహమ్మదాబాద్ ఎస్‌ఐ నాగరాజు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.