
ఉదయ్‌కుమార్ (ఫైల్)
సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్): వరకట్నం, వేధింపుల కింద భార్య తనపై కేసు పెట్టడంతో మనస్తాపానికి గురైన భర్త రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జడ్చర్లలో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ కథనం ప్రకారం.. జడ్చర్లలోని వెంకటరమణ కాలనీకి చెందిన ఉదయ్‌కుమార్(30)కు హైదరాబాద్‌లోని లింగంపల్లికి చెందిన అమ్మాయితో 11నెలల కిందట వివాహమైంది.
అయితే హైదరాబాద్‌లో ఉన్న తన భార్యను జడ్చర్లకు రావాల్సిందిగా కోరడంతో ఆమె నిరాకరించింది. దీంతో భార్యతో గొడవపడ్డాడు. జడ్చర్లకు వచ్చేసిన అనంతరం భార్య హైదరాబాద్‌లోని పోలీస్‌స్టేషన్‌లో వరకట్నం, తదితర వేధింపులకు సంబందించి భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఉదయ్‌కుమార్‌ను అక్కడికి పిలిపించి విచారించారు. మంగళవారం మరోసారి స్టేషన్‌కు రావాలని, కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని పోలీసులు చెప్పి పంపారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఉదయ్‌కుమార్ హైదరాబాద్ నుంచి జడ్చర్లకు వచ్చి, పట్టణ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి పెద్దఅంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీ తెలిపారు.