
సాక్షి, చెన్నై : తాము విడిగా జీవిస్తున్నట్లు చెప్పి వరకట్నం కేసుల నుంచి భర్త, తల్లిదండ్రులు తప్పించుకుంటున్నట్లు హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. వరకట్నం చిత్రహింసలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసును విచారించిన కడలూరు మహిళా కోర్టు భర్త, అతని తల్లిదండ్రులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ శిక్షకు గురైన తల్లిదండ్రులు మద్రాసు హైకోర్టులో అప్పీలు చేశారు. అందులో కుమారుడికి వివాహమైనప్పటి నుంచి తాము విడిగా జీవిస్తున్నట్లు, కోడలి ఆత్మహత్యకు తమకు సంబంధం లేదని పిటిషన్‌లో తెలిపారు. తమకు కింది కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి పి.వేల్‌మురుగన్ విచారణ జరిపారు. ఆ సమయంలో కుమారుడితో కలిసి పిటిషనర్లు కోడలిని హింసించేందుకు ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.
దీంతో న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వరకట్నం చిత్రహింసలతో మహిళల ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నాయని, మరోవైపు తాము ఒకటిగా జీవించడం లేదని, విడిగా జీవిస్తున్నట్లు భర్త తల్లిదండ్రులు వరకట్నం కేసుల నుంచి తప్పించుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారు విడిగా జీవించినా మామగారి ఇంట్లో కారు, బైక్, నగలు, నగదు వరకట్నంగా తీసుకోవాల్సిందిగా కుమారుని రెచ్చగొడుతున్నట్లు తెలిపారు. ఇటువంటి కేసులో తాము విడిగా ఉంటున్నట్లు తెలిపి పలువురు శిక్షల నుంచి తప్పించుకునేందుకు పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, కుమారులను సమాజంలో ప్రయోజకులుగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదని తెలిపారు. ఈ కేసులో తల్లిదండ్రులకు కింది కోర్టు విధించిన శిక్షను నిలిపివేయలేమని, ఈ కేసును తుది విచారణకు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు.
చదవండి: తమిళ సినిమాకు షాక్! ఆ సన్నివేశాలు తొలగించాల్సిందేనా?
Comments
Please login to add a commentAdd a comment