
అటవీ అధికారుల జులుం
ఆత్మకూరురూరల్, న్యూస్‌లైన్: ఏ పాపం ఎరుగని అమాయక ప్రజలపై అటవీ అధికారులు అక్కసు వెల్లగక్కారు. మాట్లాడేందుకు పిలిచిపించి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చితకబాదిన సంఘటన శనివారం ఆత్మకూరులో వెలుగుచూపింది. మండల పరిధిలోని సిద్దపల్లె గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు రమణారెడ్డి, మురహరి పుల్లయ్య, కుమ్మరి శ్రీనుపై అటవీ అధికారులు శుక్రవారం జులుం ప్రదర్శించారు.
అడవికి వెళ్లామని వారితో బలవంతంగా సంతకాలు చేయించుకోవడంతో ఆ పార్టీ నాయకులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దపల్లె గ్రామానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు రమణారెడ్డి, మురహరి పుల్లయ్య, కుమ్మరి శ్రీను గతంలో అడవికెళ్లి వెదుర్లను సేకరించి విక్రయించేవారు. అటవీ హక్కుల చట్టం తీవ్రతరం చేయడంతో వారు అడవిలోకి వెళ్లడం మాని వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వీరు వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా పనిచేశారని టీడీపీ గ్రామ నాయకులు అడవికి వెళ్లినట్లు ఫారెస్టు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు.
దీంతో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అశోక్‌కుమార్‌యాదవ్ విచారణ పేరుతో పట్టణ శివారు ప్రాంతంలోని కలాం హోటల్‌లో టీ తాగుతున్న రమణారెడ్డి, పుల్లయ్య, శ్రీనులను జీపులో ఎక్కించుకుని రేంజ్ ఆఫీసుకు తీసుకెళ్లారు. తాము అడవికి వెళ్లడం లేదని వారు చెప్పిన వినకుండా రేంజర్ విరుచుకుపడ్డారు. అడవిలోకి వెళ్లినట్లుగా ఒప్పుకొని సంతకాలు చేయాలంటూ బలవంతం చేశారు. ఏ తప్పు చేయకున్నా సంతకాలు ఎలా చేస్తామంటూ వారు రేంజర్‌ను ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గంగాధర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసులు, బంధువులు కార్యాలయానికి చేరుకొని అటవీ అధికారులను నిలదీశారు.
గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తమ కార్యకర్తలపై కక్ష సాధింపులో భాగంగానే అటవీ అధికారులను పురికొల్పుతున్నారని సర్పంచ్ ఆరోపించారు. రేంజర్ తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై రేంజర్ అశోక్‌కుమార్‌ను న్యూస్‌లైన్ వివరణ కోరగా గ్రామానికి చెందిన ఈ ముగ్గురు వ్యక్తులు సైకిళ్లపై వెదురు బొంగులు తీసుకొని వచ్చి ఆత్మకూరులో విక్రయించి వెళ్తున్నట్లు సమాచారం అందడంతో అదుపులోకి తీసుకున్నామని వివరించారు.