సాక్షి, హైదరాబాద్: ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు మృతి వెనక పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్లాంటేషన్ భూముల్లో పశువులు మేపడాన్ని అడ్డుకున్నందుకే ఫారెస్ట్ అధికారిని చంపినట్లు ప్రచారం జరుగుతోంది. లింగాలలో పనిచేస్తున్న రోజుల్లో శ్రీనివాస రావు హిట్‌లిస్టలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మావోయిస్టుల ప్రోత్సాహం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాస్ రావునును గొత్తికోయలు వేట కొడవళ్లతో మెడపై దాడి చేసి క్రూరంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు ఉద్యోగులను కర్రలతో బెదిరింపులకు గురి చేశారు. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలోని బెండాలపాడు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విధి నిర్వహణలో శ్రీనివాసరావు నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరు ఉంది. ఆయన రేంజ్‌లో ఎవరూ ఒక పుల్లను కూడా అడవిని నుంచి బయటకు తీసుకువెళ్లలేరనే విధంగా పేరు సంపాదించారు. ఈ క్రమంలో శ్రీనివాస రావు చనిపోక ముందు చెట్టు కర్ర గురించి గ్రామస్తులకు, ఇతర అధికారులకు అవగాహన కల్పిస్తున్న ఓ వీడియో ఒకటి తాజాగా వైరల్‌గా మారింది.
పాడే మోసిన మంత్రులు
మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఈర్లపూడికి చేరుకున్నారు. శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇదే సమయంలో జోహార్ శ్రీనివాసరావు అంటూ అటవీశాఖ అధికారులు, సిబ్బంది నినాదాలు చేశారు. ఇదే సమయంలో మహిళ ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి.. శ్రీనివాస రావు పాడే మోశారు.
అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. దాడులను సహించేది లేదని అన్నారు. శ్రీనివాస రావుపై దాడి చేసి, హత్య చేసిన ఎవరిని వదిలిపెట్టమని తెలిపారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందని, సీఎం కెసీఆర్ గారు వెంటనే స్పందించి అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారని తెలిపారు.
సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికీ ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో జారీ చేసినట్లు తెలిపారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తి కొయలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారని మండిపడ్డారు. అడవులను నరికినట్లు అటవీ అధికారులపై కూడా దాడులు చేస్తాం అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అటవీశాఖకు ఆయుధాల అంశం
శ్రీనివాసరావు మృతితో అటవీశాఖ ఉద్యోగులకు ఆయుధాలు ఇచ్చే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదనలు చేస్తామని అటవీ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతితో ఆయుధాలు లేకుండా అడవిలో డ్యూటీ చేయలేమని అటవీశాఖ సిబ్బంది తేల్చి చెప్తున్నారు. ఆరు నెలల క్రితమే గోత్తి కోయలు శ్రీనివాసరావు హత్యకు ప్లాన్ చేశారని సంచలన నిజాలు వెల్లడించారు అటవీశాఖ సిబ్బంది.
తనకు ప్రాణహాని ఉందని అనేకమార్లు తమకు చెప్పారన్నారు. గతంలో కూడా ఆయుధాలు అంశానికి సంబంధించి అనేకమార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లామని ఇప్పుడు మళ్ళీ మరోసారి తీసుకెళ్తామన్నారు.. శ్రీనివాసరావుది చివరి మృతి కావాలని ఫారెస్ట్ శాఖలో ఇక ఎవ్వరు చనిపోవద్దంటే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.
ఉద్రిక్తత
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస రావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాడులను నిరసిస్తూ ఫారెస్టు సిబ్బంది ఆందోళన చేపట్టింది. ర్యాలీగా బయలుదేరి వచ్చిన ఉద్యోగులు.. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు లాగా తమకు తుపాకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయుధాలు ఇచ్చి అటవీశాఖ అధికారులకు, సిబ్బంది ప్రాణాలకు రక్షణ కల్పించాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఎదుట అటవీ శాఖ సిబ్బంది నినాదాలు చేశారు. అటవీశాఖ సిబ్బందిని పోలీసులు అడ్డుకున్నారు. చివరకు ఫారెస్ట్ సిబ్బంది నిరసనతో మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment