
మృతురాలు వరప్రదాయినిభర్త, శ్రీనివాస్‌తో వరప్రదాయిని(ఫైల్)
మంచిర్యాలక్రైం : రోగం తగ్గించుకుందామని ఆసుపత్రికి వస్తే, ఆపరేషన్ చేయాలన్నారు. గంటలో ఆపరేషన్ పూర్తవుతుందని చెప్పి ఎనిమిది గంటల పాటు ఆపరేషన్ థియేటర్‌లో ఉంచారు. ఇదిగో అదిగో అంటూ అయిన వారిని సైతం చూడనీయకుండా గంటల తరబడి వేచి ఉంచారు. తీరా చికిత్స వికటించిందని చెప్పి శవాన్ని అప్పగించి చేతులు దులుపుకున్నారు. థైరాయిడ్ వ్యాధికి ఆపరేషన్ పేరుతో అటవీశాఖ అధికారి నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. అటవీశాఖలో డిప్యూటీ రేంజ్ అధికారిణిగా పనిచేస్తున్న అభిష్ట వరప్రదాయిని(35) కొద్ది రోజులు గా థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. తెలిసిన డాక్టర్ సూచన మేరకు మంచిర్యాలలోని శ్రీ హాస్పిటల్‌లో చికిత్స చేయించుకునేందుకు సోమవారం ఉదయం భర్తతో కలిసి వచ్చారు.
ఆమెను పరీక్షించిన వైద్యులు అదే రోజు మధ్యాహ్నం ఆపరేషన్ చేయాలని చెప్పారు. మధ్యాహ్నం 3.30 గంటలకు వరప్రదాయినిని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకువెళ్లారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు ఆశ్లేష, ప్రత్యూషలను పిలిపించారు. ప్రత్యూష అనస్థీషియన్ కాగా, ఆశ్లేష జనరల్ సర్జన్. గంటలో ఆపరేషన్ అయిపోతుందని ఆసుపత్రి వైద్యులు పేషంట్ భర్త శ్రీనివాస్‌కు తెలిపారు. కానీ తన భార్య సాయంత్రం 7గంటలు అవుతున్నా బయటకి రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బందిని అడగగా.. చికిత్స జరుగుతోందని, ఇంకా కొంచెం సమయం పడుతుందని వారు చెప్పారు. రాత్రి 9గంటలు దాటినా తన భార్యను చూపించకపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాస్ తన బంధువులకు సమాచారం అందించారు. బంధువులు రాగానే ఆసుపత్రి నిర్వాహకులు హడావుడిగా ‘మందులు తీసుకురండి.. రక్తం కావాలి.. ఈసీజీ మిషన్ తేవాలి.. ఆక్సిజన్ పెట్టాలి’ అంటూ కొద్దిసేపు హడావుడి చేశారు.
రాత్రి 10గంటలు దాటినా వరప్రదాయినిని చూపించకపోవడంతో భర్త శ్రీనివాస్‌తోపాటు బంధువులు, అటవీశాఖ సిబ్బంది గట్టిగా నిలదీయడంతో కొంచెం సీరియస్‌గా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. దీంతో శ్రీనివాస్ తన భార్యను చూపించాలని కోరుతూ లోపలికి వెళ్లి చూడగా చలనం లేకుండా, నిర్జీవంగా పడి ఉందని బోరున విలపించారు. ఆపరేషన్ సరిగా చేయకుండా తన భార్యను చంపేశారంటూ రోదించారు. అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసుపత్రి నిర్వాహకులు, వైద్యులపై కేసు నమో దు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ మహేష్ తెలిపారు. శ్రీనివాస్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా.. వీరికి ఇద్దరు కుమారులు ఆకర్‡్ష, అక్షయ్ ఉన్నారు.
2004లో అటవీశాఖలో ఉద్యోగం
2004లో వరప్రదాయిని అటవీశాఖలో ఎఫ్‌ఎస్‌వోగా చేరి జన్నారం, లక్సెట్టిపేట రేంజ్‌లలో విధులు నిర్వహించారు. డిప్యూటీ రేంజ్ అధికారిగా పదోన్నతి పొంది ప్రస్తుతం లక్సెట్టిపేట రేంజ్ పరిధిలోని హాజీపూర్ మండలంలో పని చేస్తున్నారు. సిబ్బందితో, ఉన్నతాధికారులతో కలివిడిగా ఉండే ఆమె మృతితో జిల్లా అటవీశాఖలో ఓ మంచి ఉద్యోగిని కోల్పోయామని సిబ్బంది కంటతడి పెట్టుకున్నారు.
ఆందోళనకు దిగిన అటవీశాఖ సిబ్బంది, కుటుంబసభ్యులు..
వరప్రదాయిని మృతి విషయం తెలుసుకున్న జిల్లా అటవీశాఖ సిబ్బంది, ఎఫ్‌డీవో వెంకటేశ్వర్లు, లక్సెట్టిపేట ఎఫ్‌ఆర్వో అనిత, సిబ్బందితో కలిసి కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఏసీపీ గౌస్‌బాబా, పట్టణ సీఐ మహేష్ 30 మంది సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని వారితో మాట్లాడారు. వరప్రదాయిని మృతికి కారకులైన ఆసుపత్రి మేనేజింగ్ చైర్మన్ ముప్పిడి జయప్రకాష్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, వైద్యులు ప్రత్యూష, ఆశ్లేష, చరణ్‌లపై కేసు నమోదు చేయాలని, ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెల్లవారేవరకు ఆసుపత్రి ఎదుటనే ఆందోళన చేశారు.
మంగళవారం ఉదయం అటవీశాఖ సిబ్బంది, కుటుంబసభ్యులు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ముందు నిరసనకు దిగారు. వరాప్రదాయిని కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్æ చేస్తూ కలెక్టర్ కర్ణన్‌కు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో భీష్మ, తహసీల్దార్ కుమారస్వామి హాస్పిటల్‌కు చేరుకొని మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతదేహాన్ని పరిశీలించి ఆపరేషన్ థియేటర్‌లోని సౌకర్యాలపై డీఎంహెచ్‌వో భీష్మతో కలిసి ఆరా తీశారు. ఆర్డీవో, తహసీల్దార్, పోలీసుల స మక్షంలో వీడియో రికార్డు చేస్తూ పోస్టుమార్టం నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించడంతో అధికా రులు దగ్గరుండి పోస్టుమార్టం పూర్తి చేశారు.
రిమ్స్ వైద్యులతో పోస్టుమార్టం...
ఆదిలాబాద్‌కు చెందిన రిమ్స్ వైద్యులతో వరప్రదాయిని మృతదేహానికి పోలీసు బందోబస్తు మధ్య పోస్టుమార్టం నిర్వహించారు. కుటుంబసభ్యులు ఆరుగురి సమక్షంలో అధికారులు వీడియో రికార్డు చేశారు.
ఇటు విషాదం.. అటు దొంగతనం
వరప్రదాయిని మృతిచెందిన విషాదంలో ఉండగానే... మారుతినగర్‌లోని ఆమె నివాసంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి ఆసుపత్రి వద్ద ఉన్న సమయంలో దొంగలు చోరీకి పాల్ప డ్డారు. 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.19 వేల నగదును దోచుకుపోయినట్లు కుటుంబసభ్యులు మంగళవారం తెలిపారు. ఓ పెళ్లి కోసం తెలిసిన వారి దగ్గర వరప్రదాయిని బంగారు ఆభరణాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోగా.. ఆమె మరణించిన రోజే దొంగలు వాటిని దోచుకుపోవడం మరో విషాదం.

కుమారులను పట్టుకొని రోదిస్తున్న శ్రీనివాస్

ఆసుపత్రి ఎదుట అటవీశాఖ సిబ్బంది, బంధువుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment