లంచం తీసుకుంటూ పట్టుబడిన ఆదోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటసుబ్బుడును విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ జయరామరాజు బాధితుడు నాగార్జున రెడ్డి
కర్నూలు, ఆదోని: ఎవరు తవ్వుకున్న గుంతలో వారే పడతారంటే ఇదేనేమో. లంచం ఇవ్వలేదని బొగ్గుల వ్యాపారిని అక్రమ వ్యాపారం కేసులో ఇరికించిన ఆదోని ఫారెస్ట్ రేంజర్ వెంకటసుబ్బుడు చివరకు అయనే ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యాడు. సోమవారం పట్టణ శివారులోని రాంజల రోడ్డులోని ఫారెస్ట్ రేంజర్ కార్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, బాధితుడు నాగార్జున రెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలు..
పత్తికొండకు చెందిన నాగార్జున రెడ్డి 2018 నవంబరులో బొగ్గుల బట్టీ లైసెన్స్ కోసం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు వెంకటసుబ్బుడికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందుకు ఆయన రూ.30,000 లంచం డిమాండ్ చేయడంతో ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో సదరు అధికారి ఆ వ్యాపారికి లైసెన్స్ జారీకి సిఫారసు చేయకుండా కాలయాపన చేశారు. వేలరూపాయలు ఖర్చు పెట్టి బొగ్గుల బట్టీ సిద్ధం చేసుకున్నానని, జాప్యంతో తాను చాలా ఇబ్బంది పడుతున్నానని దరఖాస్తు దారుడు మొరపెట్టుకున్నా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరుణించకపోగా అతడిని ఎలాగైనా ఇరికించాలని లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేసుకోమని ఉచిత సలహా ఇచ్చాడు. ఎవరైనా పట్టుకుంటే దరఖాస్తు చేసుకున్నట్లు రసీదు చూపించాలని సూచించాడు. లంచం ఇవ్వని తనపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కుట్ర చేశాడనే విషయం తెలియక నాగార్జున రెడ్డి బొగ్గుల బట్టీ ప్రారంభించాడు. తర్వాత అదే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు.. ఫారెస్ట్ స్క్వాడ్ అధికారులకు ఉప్పందించడంతో వారు రెండు నెలల క్రితం పట్టుకుని నాగార్జునరెడ్డికి రూ.2,75,000 భారీ జరిమానా విధించారు.
రివెంజ్ ఇలా ..
లంచం ఇవ్వకపోవడంతోనే ఫారెస్ట్ రేంజ్ అధికారి అక్రమ వ్యాపారం కేసులో ఇరికించారని తెలుసుకున్న నాగార్జున రెడ్డి తిరిగి ఆయన వద్దకెళ్లాడు. నేను చెప్పినట్లు నడుచుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ మళ్లీ లంచం అంశాన్ని సదరు అధికారి గుర్తు చేశాడు. ఇందుకు వ్యాపారి అంగీకరించి మొదట రూ.16,000 ఇస్తానని, లైసెన్స్ చేతికి అందిన తరువాత మిగిలిన మొత్తం ఇస్తానని నమ్మించాడు. ఆదివారం కర్నూలు వెళ్లి సదరు అధికారి లంచం డిమాండ్ చేస్తున్న విషయం ఏసీబీ అధికారులకు చెప్పడంతో వారు కొన్ని నోట్లు ఇచ్చారు. వాటిని తన నోట్లలో కలుపుకుని సోమవారం పట్టణ శివారులోని ఫారెస్ట్‌రేంజ్ కార్యాలయంలో వెంకటసుబ్బుడి చేతికి ఇచ్చారు. సమీపంలోనే మాటు వేసిన ఏసీబీ అధికారులు వెంటనే వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాను లంచం డిమాండ్ చేయలేదని బుకాయించేందుకు యత్నించగా లైసెన్స్ జారీని ఎందుకు పెండింగ్‌లో పెట్టారన్న ఏసీబీ డీఎస్పీ ప్రశ్నకు నీళ్లు నమిలాడు. తర్వాత ఆదోనిలోని మండగిరిలో ఉన్న నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారి వెల్లడించారు.
కర్నూలులో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
కర్నూలు: ఆదోని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటసుబ్బుడు నివాసం ఉంటున్న కర్నూలు అర్బన్ పరిధిలోని ముజాఫర్‌నగర్‌లో ఏసీబీ సీఐలు శ్రీధర్, గౌతమి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఇంట్లో రూ.55వేల నగదు, ఇళ్లకు సంబంధించిన మూడు డాక్యుమెంట్లు, బ్యాంకు పాస్ బుక్కులు, ఇన్సూరెన్స్ కాగితాలు, ఏటీఎం కార్డులు, 330 గ్రాముల బంగారు ఆభరణాలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం కర్నూలులోని ఏసీబీ కోర్టులో వెంకటసుబ్బుడును హాజరు పరచనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment