విచారణ చేస్తున్న ఏసీబీ డీఎస్పీ, సీఐలు (ఇన్‌సెట్లో) ఏసీబీని ఆశ్రయించిన బాధిత అర్చకుడు సురేంద్రనాథశర్మ
కర్నూలు, మహానంది: వేతన వర్తింపు విషయంలో కాంట్రాక్ట్ అర్చకుడి ఫైల్‌ను ముందుకు కదలించేందుకు రూ.25 వేల లంచం తీసుకుంటూ మహానంది దేవస్థాన ఏఈవో(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) వేల్పుల ధనుంజయ.. అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మహానందిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇవీ.. మహానందీశ్వరస్వామి దేవస్థానంలో సురేంద్రనాథశర్మ 10 ఏళ్లుగా కాంట్రాక్టు అర్చకుడిగా పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని ఓ దేవస్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అర్చకులు టైమ్ స్కేల్ వేతన వర్తింపు కోసం హైకోర్టును ఆశ్రయించడంతో వారికి న్యాయం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సురేంద్రనా«థశర్మ తనకు న్యాయం చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 2017 డిసెంబర్ 29 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఇదిలా ఉండగా రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ సైతం కాంట్రాక్టు ఉద్యోగుల్లో అర్హులైన వారికి టైమ్‌స్కేల్ వర్తింప చేయాలని ఈ ఏడాది మే నెలలో (ఏ1/1059511/2018) ఆర్డర్‌ను జారీ చేశారు. అనంతరం జూలై 20న సైతం మరో ఆర్డర్‌లో వివరాలు కోరారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో మరోసారి కోర్టు ధిక్కరణ కింద ఆశ్రయించగా కోర్టు వారు నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచి ఆయన ఫైలును కదిలించేందుకు అధికారులు పెండింగ్ పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈఓ సైతం ఆయన ఫైలును పరిశీలించి సంతకం చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఏఈఓను ఆదేశించారు. న్యాయం జరగాలంటే రూ. 50వేలు చెల్లించాలని ఏఈఓ ధనుంజయ డిమాండ్ చేశారు. అంత మొత్తంలో ఇచ్చుకోలేమని, రూ. 25వేలు ఇస్తామని ఏఈఓతో సరేంద్రనాథ్ శర్మ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో సురేంద్రనాధశర్మ తండ్రి, రిటైర్డ్ అర్చకుడు శంకరయ్య సాయంత్రం కార్యాలయానికి వెళ్లి రూ. 25వేలు నగదును అందించారు. సమాచారం మేరకు అక్కడే ఉన్న ఏసీబీ డీఎస్పీ జయరామరాజు, సీఐలు ఎన్‌ఎస్‌ఎం శ్రీధర్, ఖాదర్‌బాషా, సిబ్బంది వెంటనే ఏఈఓ కార్యాలయానికి వెళ్లి నగదును స్వాధీనం చేసుకుని రెడ్‌హ్యాండెడ్‌గా ఏఈఓను పట్టుకున్నారు.
దేవస్థానంలో లంచాలెలా వసూలు చేస్తారు?
‘మహానందీశ్వరస్వామి సన్నిధిలో పనిచేస్తూ లంచాలు ఎలా వసూలు చేస్తారయ్యా’ అంటూ ఏసీబీ డీఎస్పీ జయరామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈఓ ధనుంజయను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అనంతరం ఆయన సిబ్బందితో మాట్లాడుతూ.. స్వామి సన్నిధిలో పనిచేస్తూ ఇలాంటి అక్రమాలకు పాల్పడేందుకు మనసెలా వస్తుందని మండిపడ్డారు. ఎవరైనా అక్రమాస్తులు కలిగి ఉన్నా, ఉద్యోగులను వేధిస్తూ ఉన్నా తమ దృష్టికి తీసుకు రావాలని ఆయన కోరారు.
ఆది నుంచి అన్నీ వివాదాలే
♦ ఏఈఓ వేల్పుల ధనుంజయపై ఆది నుంచి అన్నీ వివాదాలే ఉన్నాయి. శ్రీశైలం దేవస్థానం నుంచి 2017 జూలైలో మహానంది దేవస్థానం ఏఈఓగా బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఆయన తనదైన శైలిలో ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తూ ధనార్జనపై దృష్టి సారించారు. ఆలయంలో అర్చకులను, ఇతర ఉద్యోగులను బెదిరిస్తూ లంచాలను తీసుకునేవారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
♦ 2004 నుంచి 2006 మధ్యలో మహానంది దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా పనిచేసిన ధనుంజయ ఇద్దరు ఉద్యోగులను అటెండరు నుంచి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు అప్పట్లోనే ఒక్కొక్కరి నుంచి రూ. 10 వేలు తీసుకున్నట్లు సమాచారం.
♦ శ్రీశైలం దేవస్థానం కంటే ముందు ఆయన కసాపురం ఆంజనేయస్వామి దేవస్థానంలో ఏఈఓగా పనిచేశారు. అక్కడా నాలుగవ తరగతి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకోవడంతో బాధితులు అప్పట్లో నేరుగా కమిషనర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం, ఆ విషయం అప్పట్లో దేవాదాయశాఖలో వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే.
♦ కసాపురంలో రూ. కోట్లలో ధరలు పలకాల్సిన తలనీలాల టెండర్ల విషయంలో అక్కడ ఉన్న అధికారపార్టీ నేతలు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై కేవలం రూ. 30 నుంచి రూ. 40లక్షలకు దక్కేలా చేసినట్లు సమాచారం. ఆయన బదిలీ అనంతరం అదే టెండర్లలో ఆంజనేయస్వామికి రూ. కోట్లలో ఆదాయం వచ్చినట్లు తెలిసింది.
♦ శ్రీశైలం దేవస్థానంలో పనిచేసే సమయంలో డీసీబీ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తుండగా ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపుల్లో సైతం చేతివాటాన్ని ప్రదర్శించినట్లు సమాచారం.
♦ మహానందికి వచ్చే ముందు శ్రీశైలం నియోజకవర్గానికి చెందిన ఓ అధికారపార్టీ నేత తనకు అండగా ఉండి, స్వయానా ఆయన లేఖ ద్వారా మహానందికి రప్పించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment