సాక్షి, నిజామాబాద్ :
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ గంగయ్య హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. భూ ఆక్రమణదారులు ఒక్క గంగయ్యనే లక్ష్యంగా చేసుకొని దాడి చేసినట్లు సంఘ టన జరిగిన తీరును బట్టి తెలుస్తోంది. ఈ విషయమై హతుడు గంగయ్య కుటుంబ సభ్యులు సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనకు స్వల్ప వ్యవధిలోనే పదోన్నతి లభించిందని, ఇది శాఖలోని పలువురికి కంట గింపుగా మారిందని వారంటున్నారు. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించేవారని, దీంతో కొందరికి ఆయనంటే పడలేదని పేర్కొంటున్నారు. అయితే గంగయ్య కుటుంబ సభ్యులనుంచి రాత పూర్వకంగా గానీ మౌఖికంగా గానీ తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్‌పీ మోహన్‌రావు పేర్కొన్నారు. హత్య విషయమై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ విషయమై అటవీ శాఖ ఉన్నతాధికారులూ స్పందించారు. ‘‘కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది ప్రమేయం పరోక్షంగానైనా ఉందని తేలిన పక్షంలో శాఖాపరమైన విచారణ చేపడతాం’’ అని నిజామాబాద్ సర్కిల్ సీసీఎఫ్ గోపీనాథ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.
వివాదాలిలా..
ఒక్క ఇందల్వాయి రేంజ్‌లోనే కాదు.. జిల్లావ్యాప్తంగా పలుచోట్ల పెద్ద ఎత్తున అటవీ భూములు ఆక్రమణలకు గురయ్యాయి. అటవీ శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని భూ ఆక్రమణలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా డబ్బులు పుచ్చుకున్న అధికారులు ఆక్కడి నుంచి బదిలీపై వెళ్లగా, ఆ స్థానంలోకి వచ్చిన అధికారులు ఆక్రమణలకు అడ్డుతగులుతుండడంతో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ గొడవలే దాడులకు దారితీస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భూములు, పట్టాలు ఇప్పిస్తామంటూ కొందరు నేతలు, రెవెన్యూ అధికారులు అమాయకుల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కాగా అటవీ భూము లా? రెవెన్యూ భూములా అన్న విషయం తేల్చకుండానే అధికారులు అందినకాడికి దండుకుని పట్టాలిస్తుండడంతో అమాయక గిరిజనులు, గ్రామీణలు అటవీ భూములను దున్నుకుంటున్నారు. తీరా అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో వివాదం ముదురుతోందని, భూ ఆక్రమణదారులు అఘాయిత్యాలకూ పాల్పడుతున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంతాపసభ
సుభాష్‌నగర్ : భూఆక్రమణదారుల చేతిలో ఇటీవల హత్యకు గురైన ఎఫ్‌ఆర్‌ఓ గంగయ్య సంతాప సభను ఆదివారం జిల్లాకేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నిర్వహించారు. మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో బీజేపీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మీనారాయణ, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, ఫెడరేషన్ నాయకులు సీహెచ్.గంగాధర్, ఎస్.సురేశ్, ఎస్.లింగయ్య, సీతయ్య, మహేశ్‌కుమార్, గంగారాం, గంగయ్య, సాయిలు, చిన్నయ్య, పోశెట్టి, బాలచందర్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షుడు తెడ్డు గంగారాం అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. గంగయ్య సేవలను వక్తలు కొనియాడారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పరామర్శ
కలెక్టరేట్ : ఉద్యోగ జేఏసీ జిల్లా చైర్మన్ గైని గంగారాం, నాయకులు బాబూరావు, దేవయ్య తదితరులు ఆదివారం గంగయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగయ్య కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.
అరెస్టు అయింది వీరే..
సాక్షి, నిజామాబాద్ : ఎఫ్‌ఆర్‌ఓ గంగయ్య హత్య కేసులో మొత్తం 36 మందిపై కేసు నమోదు చేశామని, 11 మందిని అరెస్టు చేశామని ఎస్‌పీ మోహన్‌రావు తెలిపారు. మిగిలిన 25 మందిలో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిందితులపై 147, 148, 353, 332, 307, 302, 120(బి) రెడ్‌విత్ 149 ఐపీసీ, సెక్షన్ 15, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ చట్టం 4, 5 సెక్షన్ల కింద, పీడీపీపీ చట్టం సెక్షన్ 3 (1), ఎస్‌సీ, ఎస్‌సీ అట్రాసిటీ చట్టం సెక్షన్ 3 (2)(వి) కింద కేసులు నమోదు చేశామన్నారు. అరెస్టు అయినవారిలో ఒడ్డె భాస్కర్, ఒడ్డె రాములు, మందుల ముత్యం (ఆటోడ్రైవర్), మందుల పెద్దసాయిలు (మెకానిక్), గొల్ల మల్లేశ్ (మెకానిక్), మక్కాల చిన్న వెంకటి, శివరాత్రి ప్రసాద్ (సుమో డ్రైవర్), సింగజోగి పోచయ్య, మందుల లింగం, సింగజోగి పోచయ్య, బాదావత్ గోపాల్ (కెకె తండా) ఉన్నారన్నారు. వీరి నుంచి గొడ్డలి, కొడవలి, కర్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిజామాబాద్ డీఎస్‌పీ అనీల్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారని, పరారీలో ఉన్నవారిని వెంటనే పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో ఓఎస్‌డీ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎఫ్‌ఆర్‌ఓ గంగయ్య హత్య కేసులో మరోకోణం
Published Mon, Sep 23 2013 3:32 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement