పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య | one leg dancer Bhagya success story about sakshi special | Sakshi
Sakshi News home page

పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య

Published Sat, Apr 8 2023 12:30 AM | Last Updated on Sat, Apr 8 2023 7:10 AM

one leg dancer Bhagya success story about sakshi special - Sakshi

నాట్య ప్రదర్శనలో...

ఆమె పేరులో భాగ్యం ఉంది.   ఆ భాగ్యం జీవితంలో కొరవడింది.
ఆమె పేదరికంతో పోరాడింది. శారీరక వైకల్యంతో ఎదురీదింది.
సమాజంలో విజేతగా నిలిచింది. అభినందనలు అందుకుంటోంది.

తమిళనటి, నర్తకి సుధాచంద్రన్‌ ఒక అద్భుతం. నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. నెమలిలా నాట్యం చేసే ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఒక కాలిని తీసుకెళ్లింది. ఆమె నిర్ఘాంతపోయింది. నడవడమే కష్టం అనుకున్న స్థితి నుంచి కోలుకుని కృత్రిమ కాలితో నాట్యం చేసింది. మన తెలుగు నాట్య మయూరితో విధి మరింత ఘోరంగా ఆటలాడుకుంది.

ఆమెను ఒక్క కాలితోనే భూమ్మీదకు పంపించింది. డాన్స్‌ చేయాలంటే రెండు కాళ్లు ఉంటే మంచిదే... కానీ లేదని ఊరుకోవడమెందుకు? ఒక కాలు లేకపోతేనేం... మరో కాలుందిగా... అంటూ డాన్స్‌ చేస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం గెలిచాయి. తెలంగాణ జానపద కళలంటే ప్రాణం పెట్టే భాగ్య అందులోనే ఎం.ఏ చేస్తోంది. తన విజయగాధను సాక్షితో పంచుకుంది.
 
బస్సులు మారలేక...
‘‘మాది మహబూబాబాద్‌ జిల్లా, గూడూరు గ్రామం. అమ్మ కూలిపనులకు వెళ్తుంది. నాన్న మేకలు కాస్తాడు. అన్న, నేను ఇద్దరం పిల్లలం. నేను పుట్టడమే ఒక విచిత్రం. బిడ్డ ఒక కాలు లేకుండా పుట్టిందని ఊరంతా వచ్చి చూశారట. ఆ తర్వాత నేను పెరగడం, చదువు, డాన్స్‌ నేర్చుకోవడం... అన్నీ విచిత్రంగానే గడిచాయి. సెవెన్త్‌ క్లాస్‌ వరకు వరంగల్‌ జిల్లా, నెక్కొండ మండలం, పెద్ద కొర్పోల్‌లో చదువుకున్నాను.

ఆ తర్వాత హన్మకొండలో సాగింది. ఇంటర్‌ ప్రైవేట్‌ కాలేజ్‌లో చదివించడం డబ్బుండి కాదు. ప్రభుత్వ కాలేజ్‌కి రెండు బస్సులు మారి వెళ్లాల్సి ఉండింది. నేనలా వెళ్లలేనని ప్రైవేట్‌ కాలేజ్‌లో చేర్చారు. వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజ్‌లో డిగ్రీ చేసి, ఇప్పుడు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎం.ఏ. చేస్తున్నాను. ఇంతకీ నేను డాన్సర్‌గా మారిన వైనం మరీ విచిత్రం.

బాలెన్స్‌కి నెల పట్టింది
నేను నైన్త్‌ క్లాస్‌లో ఉన్నప్పుడు జరిగిందా విచిత్రం. ప్రముఖ డాన్సర్‌ లారెన్స్‌ మాస్టారి ఆలోచన నన్ను డాన్సర్‌ని చేసింది. ఆయన దగ్గర పని చేసిన ప్రశాంత్‌ మాస్టారు స్పెషల్లీ ఏబుల్డ్‌ పిల్లలకు డాన్స్‌ నేర్పించడానికి మేమున్న హాస్టల్‌కి కూడా వచ్చారు. అలా అప్పుడు వాళ్లు పదిమందికి పైగా స్టూడెంట్స్‌ని సేకరించి డాన్స్‌ క్లాసులు మొదలు పెట్టారు. వారిలో స్టేజ్‌ మీద ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది ముగ్గురమే.

అప్పటివరకు కర్ర లేకుండా నిలబడగలమనే ఊహ కూడా లేని వాళ్లమే అందరం. మొదట ఒక కాలి మీద దేహాన్ని బాలెన్స్‌ చేయడం సాధన చేశాం. బాలెన్స్‌ సాధించడానికి నెల పట్టింది. సినిమా పాటలు, జానపద నృత్యం, బతుకమ్మ పాటలు ప్రాక్టీస్‌ చేశాను. ఆ కోర్సు తర్వాత కూడా సొంతంగా కొన్ని పాటలకు సాధన చేశాను. టీవీ ప్రోగ్రామ్‌లలో కూడా డాన్స్‌ చేశాను. దసరా ఉత్సవాలు, వినాయక చవితి, ఇతర సమావేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ నాట్యం చేస్తున్నాను.

శివరాత్రికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడిలో కూడా నాట్యం చేశాను. ఇక్కడ మరో విచిత్రం... ఏమిటంటే, సిట్టింగ్‌ వాలీబాల్‌ ఆడే అవకాశం వచ్చింది. ఈ ఆటకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు. రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్నాటకల్లో జరిగిన పోటీలకు హాజరయ్యాను. థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలకు ఎంపిక ప్రక్రియలో నెగ్గాను. మనదేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోయాను.

తెలంగాణ ఆట పాట
ఫోక్‌ ఆర్ట్స్‌ కోర్సులో భాగంగా డప్పు, జానపదగేయాలు, కర్రసాము, చెక్క భజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకున్నాను. బతుకమ్మ పాటలను సేకరించి పాడాను. ఇతర పాటలు పాడే అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డాన్స్‌లో కూడా నిరూపించుకుంటాను. నాకు సీటు ఇచ్చేటప్పుడు సీటు వృథా అవుతుందేమోనని సందేహించిన యూనివర్సిటీనే ఇప్పుడు నాకు అండగా నిలిచింది.

నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఇంతవరకు నడిపించింది’’ అని చెప్పింది భాగ్య. సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం ఆమె సొంతం. ఆడపిల్లలకు ధైర్యం ఒకింత ఎక్కువగా ఉండాలని చెప్తోంది. బాలికలకు కర్రసాము నేర్పించి ధీరలుగా మలవాలనే ఆమె ఆశయం, జానపదానికి సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష నెరవేరాలి.

కొత్త అడుగులు
ఎల్‌బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శన నా జీవితాన్ని కొత్తగా రాసింది. డిసెంబర్‌ మూడవ తేదీ ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిసేబిలిటీస్‌’. ఆ సందర్భంగా లాల్‌ బహదూర్‌ స్టేడియంలో నాలుగు రోజుల ముందు నుంచి ఆటలు, డాన్స్‌ ప్రోగ్రామ్‌లు జరిగాయి. నా డాన్స్‌ ఫొటోలు పేపర్‌లో వచ్చాయి. ఆ పేపర్‌ చూసి మా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కిషన్‌రావు సర్‌ నన్ను పిలిచి మాట్లాడారు. మా ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్‌ పెన్షన్‌తో హాస్టల్‌ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నానని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలియదు, వీసీ సర్, రిజిస్ట్రార్‌ సర్‌ కలిసి మూడు లక్షల నిధులు సేకరించి, జర్మనీ నుంచి డాన్స్‌ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్‌ లెగ్‌ను తెప్పించి పెట్టించారు. ఇప్పుడు ఆ కాలితో నడక ప్రాక్టీస్‌ చేస్తున్నాను. నడక మీద పట్టు వచ్చిన తర్వాత డాన్స్‌ చేస్తాను.

– వాకా మంజులారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement