potti sriramulu telugu university
-
కన్నుల పండుగగా 'చండాలిక' డ్యాన్స్
క్రాంతి కూచిపూడి నాట్యాలయ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహా కవి, కళా ప్రపూర్ణ, పద్మ భూషణ్ డాక్టర్ బోయి భీమన్న 'చండాలిక' డాన్స్ బ్యాలే సోమవారం రాత్రి రవీంద్ర భారతిలో కన్నుల పండుగగా జరిగింది. తెలంగాణ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ కిషన్ రావు ప్రత్యేక అతిధిగా హాజరయ్యారు. 'చండాలిక' పాత్రలో కూచిపూడి నృత్యకారిణి క్రాంతి నారాయణ్ నటించగా ఆనంద గా వీ.ఆర్ విక్రమ్ కుమార్ (విక్రమ్ గౌడ్), మాలీ గా కిరణ్మయి బోనాల, భటులుగా వినోద్, ప్రశాంత్, దీమాన్స్గా డింపుల్ ప్రియా, జాహ్నవి, రీతూ, తులసి నటించారు. డాక్టర్ బోయి భీమన్న రచించిన 'చండాలిక' డాన్స్ బ్యాలేకు ఫణి నారాయణ సంగీతాన్ని అందించగా క్రాంతి నారాయణ్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులుగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ భట్టు రమేష్, ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ జి. పద్మజా రెడ్డి, డాక్టర్ వనజా రెడ్డి, భీమన్న సాహితి నిధి ట్రస్ట్ చైర్మన్ హైమవతి భీమన్న తదితరులు పాల్గొన్నారు. (చదవండి: 'సృష్టి' ప్రపంచ రికార్డు) -
పేదరికంతో పోరాడి.. వైకల్యంతో ఎదురీది.. విజేతగా నిలిచిన భాగ్య
ఆమె పేరులో భాగ్యం ఉంది. ఆ భాగ్యం జీవితంలో కొరవడింది. ఆమె పేదరికంతో పోరాడింది. శారీరక వైకల్యంతో ఎదురీదింది. సమాజంలో విజేతగా నిలిచింది. అభినందనలు అందుకుంటోంది. తమిళనటి, నర్తకి సుధాచంద్రన్ ఒక అద్భుతం. నాట్య మయూరిగా పేరు తెచ్చుకుంది. నెమలిలా నాట్యం చేసే ఆమెతో విధి వింత నాటకం ఆడింది. ఒక కాలిని తీసుకెళ్లింది. ఆమె నిర్ఘాంతపోయింది. నడవడమే కష్టం అనుకున్న స్థితి నుంచి కోలుకుని కృత్రిమ కాలితో నాట్యం చేసింది. మన తెలుగు నాట్య మయూరితో విధి మరింత ఘోరంగా ఆటలాడుకుంది. ఆమెను ఒక్క కాలితోనే భూమ్మీదకు పంపించింది. డాన్స్ చేయాలంటే రెండు కాళ్లు ఉంటే మంచిదే... కానీ లేదని ఊరుకోవడమెందుకు? ఒక కాలు లేకపోతేనేం... మరో కాలుందిగా... అంటూ డాన్స్ చేస్తోంది. ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసం గెలిచాయి. తెలంగాణ జానపద కళలంటే ప్రాణం పెట్టే భాగ్య అందులోనే ఎం.ఏ చేస్తోంది. తన విజయగాధను సాక్షితో పంచుకుంది. బస్సులు మారలేక... ‘‘మాది మహబూబాబాద్ జిల్లా, గూడూరు గ్రామం. అమ్మ కూలిపనులకు వెళ్తుంది. నాన్న మేకలు కాస్తాడు. అన్న, నేను ఇద్దరం పిల్లలం. నేను పుట్టడమే ఒక విచిత్రం. బిడ్డ ఒక కాలు లేకుండా పుట్టిందని ఊరంతా వచ్చి చూశారట. ఆ తర్వాత నేను పెరగడం, చదువు, డాన్స్ నేర్చుకోవడం... అన్నీ విచిత్రంగానే గడిచాయి. సెవెన్త్ క్లాస్ వరకు వరంగల్ జిల్లా, నెక్కొండ మండలం, పెద్ద కొర్పోల్‌లో చదువుకున్నాను. ఆ తర్వాత హన్మకొండలో సాగింది. ఇంటర్ ప్రైవేట్ కాలేజ్‌లో చదివించడం డబ్బుండి కాదు. ప్రభుత్వ కాలేజ్‌కి రెండు బస్సులు మారి వెళ్లాల్సి ఉండింది. నేనలా వెళ్లలేనని ప్రైవేట్ కాలేజ్‌లో చేర్చారు. వరంగల్ ఆర్ట్స్ కాలేజ్‌లో డిగ్రీ చేసి, ఇప్పుడు హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద కళల్లో ఎం.ఏ. చేస్తున్నాను. ఇంతకీ నేను డాన్సర్‌గా మారిన వైనం మరీ విచిత్రం. బాలెన్స్కి నెల పట్టింది నేను నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు జరిగిందా విచిత్రం. ప్రముఖ డాన్సర్ లారెన్స్ మాస్టారి ఆలోచన నన్ను డాన్సర్‌ని చేసింది. ఆయన దగ్గర పని చేసిన ప్రశాంత్ మాస్టారు స్పెషల్లీ ఏబుల్డ్ పిల్లలకు డాన్స్ నేర్పించడానికి మేమున్న హాస్టల్‌కి కూడా వచ్చారు. అలా అప్పుడు వాళ్లు పదిమందికి పైగా స్టూడెంట్స్‌ని సేకరించి డాన్స్ క్లాసులు మొదలు పెట్టారు. వారిలో స్టేజ్ మీద ప్రదర్శనలిచ్చే స్థాయికి చేరింది ముగ్గురమే. అప్పటివరకు కర్ర లేకుండా నిలబడగలమనే ఊహ కూడా లేని వాళ్లమే అందరం. మొదట ఒక కాలి మీద దేహాన్ని బాలెన్స్ చేయడం సాధన చేశాం. బాలెన్స్ సాధించడానికి నెల పట్టింది. సినిమా పాటలు, జానపద నృత్యం, బతుకమ్మ పాటలు ప్రాక్టీస్ చేశాను. ఆ కోర్సు తర్వాత కూడా సొంతంగా కొన్ని పాటలకు సాధన చేశాను. టీవీ ప్రోగ్రామ్‌లలో కూడా డాన్స్ చేశాను. దసరా ఉత్సవాలు, వినాయక చవితి, ఇతర సమావేశాల్లో అవకాశాలను వెతుక్కుంటూ నాట్యం చేస్తున్నాను. శివరాత్రికి వేములవాడ రాజరాజేశ్వరస్వామి గుడిలో కూడా నాట్యం చేశాను. ఇక్కడ మరో విచిత్రం... ఏమిటంటే, సిట్టింగ్ వాలీబాల్ ఆడే అవకాశం వచ్చింది. ఈ ఆటకు మన దగ్గర పెద్దగా ఆదరణ లేదు. రాజస్థాన్, హర్యానా, తమిళనాడు, కర్నాటకల్లో జరిగిన పోటీలకు హాజరయ్యాను. థాయ్‌లాండ్‌లో జరిగే పోటీలకు ఎంపిక ప్రక్రియలో నెగ్గాను. మనదేశం తరఫున ఆడే అవకాశం వచ్చింది. కానీ కరోనా కారణంగా వెళ్లలేకపోయాను. తెలంగాణ ఆట పాట ఫోక్ ఆర్ట్స్ కోర్సులో భాగంగా డప్పు, జానపదగేయాలు, కర్రసాము, చెక్క భజన వంటి తెలంగాణ సంప్రదాయ కళలను నేర్చుకున్నాను. బతుకమ్మ పాటలను సేకరించి పాడాను. ఇతర పాటలు పాడే అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. డాన్స్‌లో కూడా నిరూపించుకుంటాను. నాకు సీటు ఇచ్చేటప్పుడు సీటు వృథా అవుతుందేమోనని సందేహించిన యూనివర్సిటీనే ఇప్పుడు నాకు అండగా నిలిచింది. నేను ఎవరికీ భారం కాకూడదు, నా కాళ్ల మీద నేను నిలబడాలనే పట్టుదలే నన్ను ఇంతవరకు నడిపించింది’’ అని చెప్పింది భాగ్య. సవాళ్లను ఎదుర్కొనే మనోధైర్యం ఆమె సొంతం. ఆడపిల్లలకు ధైర్యం ఒకింత ఎక్కువగా ఉండాలని చెప్తోంది. బాలికలకు కర్రసాము నేర్పించి ధీరలుగా మలవాలనే ఆమె ఆశయం, జానపదానికి సేవ చేయాలనే ఆమె ఆకాంక్ష నెరవేరాలి. కొత్త అడుగులు ఎల్బీ స్టేడియంలో ఇచ్చిన ప్రదర్శన నా జీవితాన్ని కొత్తగా రాసింది. డిసెంబర్ మూడవ తేదీ ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్’. ఆ సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో నాలుగు రోజుల ముందు నుంచి ఆటలు, డాన్స్ ప్రోగ్రామ్‌లు జరిగాయి. నా డాన్స్ ఫొటోలు పేపర్లో వచ్చాయి. ఆ పేపర్ చూసి మా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కిషన్‌రావు సర్ నన్ను పిలిచి మాట్లాడారు. మా ఆర్థిక పరిస్థితి, గవర్నమెంట్ పెన్షన్‌తో హాస్టల్ ఫీజు కట్టుకుంటూ చదువుకుంటున్నానని తెలుసుకుని ఆయన చలించిపోయారు. ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలియదు, వీసీ సర్, రిజిస్ట్రార్ సర్ కలిసి మూడు లక్షల నిధులు సేకరించి, జర్మనీ నుంచి డాన్స్ చేయడానికి వీలుగా ఉండే ప్రోస్థటిక్ లెగ్‌ను తెప్పించి పెట్టించారు. ఇప్పుడు ఆ కాలితో నడక ప్రాక్టీస్ చేస్తున్నాను. నడక మీద పట్టు వచ్చిన తర్వాత డాన్స్ చేస్తాను. – వాకా మంజులారెడ్డి -
‘సమాజ ప్రగతికి మ్యాజిక్ కోర్స్ ఎంతగానో ఉపయోగకరం’
హైదరాబాద్ : పీసీ సర్కార్ జయంతి సందర్భంగా పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ మరియు మేజిషియన్ అకాడమీ ఆధ్యర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మేజిషియన్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, నార్త్ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కిషన్‌రావు, డీన్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ హనుమంతరావు, మేజిషిన్ అకాడమీ ప్రెసిడెంట్, మ్యాజికోర్స్ కో ఆర్డినేటర్ సామల వేణు హాజరైయ్యారు. అతిధులు జ్యోతి ప్రజ్యల చేసి కార్యక్రమాన్ని ప్రారభించారు. మ్యాజిక్ కోర్స్ ఎంతో మంది యువతీయువకులకు స్వయం ఉపాధి కల్పిస్తుందని, ఈ కోర్స్ నిర్వహిస్తునందుకు గర్వంగా ఉందన్నారు వీసీ కిషన్ రావు.సమాజంలో మూఢనమ్మకాలను తొలగించి, ప్రజలను చైతన్య పరచి సమాజ ప్రగతికి మ్యాజిక్ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రశంసించారు ఐజీ ఆఫ్ నార్త్ తెలంగాణ చంద్రశేఖర్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లో మేజిషియన్లు ఎక్కడ ప్రోగ్రామ్స్ చేసినా తాము అన్ని విధాలా సహకరిస్తున్నామని ఐజీ చెప్పారు. మరోవైపు సమాజ హితానికి ఎంతగానో దోహదపడుతున్న మేజిషియన్ కోర్స్ చేసిన వారికి ఇప్పటి వరకు డాక్టరేట్ లేదని.. రాబోయే రోజుల్లో డాక్టరేట్ ఇచ్చేలా కృషిచేయాలని కోరారు. మ్యాజిక్ కోర్స్ చేస్తున్న విద్యార్థులకు సామాగ్రి కొనుగోలు చేసేందుకు బీసీ వెల్ఫేర్ తరపున ఆర్ధిక సాయం అందిచేలా కృషి చేస్తామని ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో మాజిక్ చేసి అందరిని ఆకట్టుకున్నారు మేజిషియన్ అకాడమీ ప్రెసిడెంట్ సామల వేణు.గత ఎనిమిది సంవత్సరాలుగా మ్యాజిక్ కోర్స్ చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. -
సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ
నాంపల్లి (హైదరాబాద్): దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లుగా జాతీయ ఆర్థిక అభివృద్ధి సూచిక దారుణంగా పడిపోయిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సామాజిక సదస్సులో పాల్గొన్న నాగేశ్వర్, సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. కారణాలు–ప్రభావాలు అనే అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలో 23 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని పేర్కొన్నారు. దేశ సంపదలో 20 శాతం కేవలం ఒక శాతం జనాభా చేతిలో ఉందన్నారు. బ్రిటన్ దేశాన్ని అధిగమించి ఐదవ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినప్పటికీ భారతదేశం తలసరి ఆదాయం, బ్రిటన్ ప్రజల తలసరి ఆదాయం కంటే 20 రెట్లు తక్కువగా ఉందన్నారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ఆదాయ పన్నును ఒకేసారి పది శాతం తగ్గించిందని చెప్పారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.లక్షా 80 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయిందని, ఈ విషయాన్ని నీతి ఆయోగ్ నివేదికలే చెప్తున్నాయని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఆలోచించడం, మతాచారాలను పాటించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా వ్యక్తుల ఇష్టాఇష్టాలు, వ్యక్తిగత సిద్ధాంతాల ప్రాతిపదికన పరిపాలన సాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణంతో పాటు ఎగుమతి, దిగుమతుల మధ్య పెరిగిపోతున్న అంతరం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయన్నారు. కరోనా తర్వాతి కాలంలో కేంద్రం తీసుకున్న ఉద్దీపన చర్యల్లోనూ నిజాయితీ లోపించడంతో ప్రజల కు ఏ రకమైన ఉపశమనం లభించలేదన్నారు. సద స్సులో టీఎన్జీఓ కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు, తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
అవార్డులు గౌరవాన్ని పెంచాలి
సిరిసిల్ల కల్చరల్: జ్ఞాన సముపార్జనకు వయసుతో నిమిత్తంలేదని, జీవితకాలంపాటు అధ్యయనం చేయొచ్చని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు అన్నారు. రంగినేని సుజాతమోహన్‌రావు తన మాతృమూర్తి ఎల్లమ్మ స్మారకార్థం ఇచ్చే జాతీయస్థాయి సాహిత్య పురస్కార ప్రదానోత్సవం ఆదివారం ఇక్కడ ప్రముఖకవి జూకంటి జగన్నాథం అధ్యక్షతన జరిగింది. కిషన్‌రావు మాట్లాడుతూ కవిగా వచ్చిన గుర్తింపు, అందిన పురస్కారాలు గౌరవాన్ని పెంచాలని, గర్వాన్ని దరి చేరనీయొద్దని సూచించారు. ప్రాంతానికో మాండలీకం ఉన్నప్పటికీ మౌలికంగా సంవేదనలోంచి వచ్చిన కవిత్వమే సమాజంలో నిలిచిపోతుందన్నారు. అనంతరం కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్‌కు రంగినేని సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రశంసాపత్రం, రూ.25 వేల నగదును అందజేశారు. కార్యక్రమంలో కవులు డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ పత్తిపాక మోహన్, అన్నవరం దేవేందర్, పెద్దింటి అశోక్, డాక్టర్ బెల్లి యాదయ్య, ఎలగొండ రవి, జిందం అశోక్, మానేరు రచయితల సంఘం, సాహితీ సోపతి, సిరిసిల్ల సాహితీ సమితి ప్రతినిధులతోపాటు సిద్దిపేట, కరీంనగర్‌కు చెందిన పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. మానేటి బిడ్డనే.. మేనమామ ఇంట్లో పుట్టా.. ఇదే జిల్లాలోని గూడెం గ్రామం మా అమ్మమ్మ వాళ్లది. మేనమామ ఇంట్లోనే పుట్టాను. నా మూడేళ్ల వయçసులో అనుకుంటా. ఎడ్లబండి మీద సిరిసిల్లలోని రాజేశ్వర్ థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చాను. తోటివాళ్లంతా సినిమా చూస్తుంటే నేను మాత్రం ఉశికెతో ఆడుకున్నట్లు గుర్తుంది. అలా మానేరు నా మదిలో ఉండిపోయింది. – తంగెడ కిషన్‌రావు, తెలుగు వర్సిటీ వీసీ మానేటి కవులే నాకు ప్రేరణ పశువుల కాపరిని సాహిత్యానికి పరిచయం చేసిన పాలమూరుకు, నన్ను కవిగా ఆవిష్కరించుకునేందుకు ప్రేరణ ఇచ్చిన మానేటి కవులకు కృతజ్ఞతలు. సత్కరించిన మానేటి సహృదయులకు పాలమూరు కన్నీటి బొట్లతో అభిషేకం చేస్తున్నా. మా అమ్మ పేరూ ఎల్లమ్మనే కాబట్టి ఈ పురస్కారాన్ని అందుకోవాలని కలలు కన్నా. – తగుళ్ల గోపాల్, రంగినేని ఎల్లమ్మ పురస్కార గ్రహీత -
కొలకలూరి పురస్కారాలు ప్రదానం
నాంపల్లి: కొలకలూరి పురస్కారాలు–2022 ప్రదానోత్సవ సభ శనివారం హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నంద మూరి తారక రామా రావు కళామందిరం లో జరిగింది. కొలక లూరి ఇనాక్ అధ్యక్ష తన జరిగిన సభకు ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యా లయం ఉపాధ్యక్షుడు ఆచార్య టి.కిషన్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొలకలూరి భగీరథీ కథానిక–2022 పురస్కారాన్ని విజయ భండారు (కథానిక సంపుటి–గణిక), కొలకలూరి విశ్రాంతమ్మ నవల–2022 పురస్కారాన్ని మథని శంకర్ (నవల–జక్కులు), కొలకలూరి రామయ్య విమర్శన–2022 పురస్కారాన్ని అశోక్‌కుమార్ (తెలుగు నవల–ప్రయోగ వైవిధ్యం) స్వీకరించారు. పురస్కారాల కింద ఒక్కొక్కరికి రూ.15 వేలు నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేసి స్వీకర్తలను సత్కరించారు. -
పోతనాంతరంగం భాగవతం
భాగవతం అమృతఫలం అందించిన పోతన నాదోపాసకుడు. సంగీత, సాహిత్య మర్మములెరిగి నవాడు. ఈ విషయం పోతన పద్యనడకల్లో బహిర్గ తమవుతుంది. భాగవతాన్ని అనుభవించి ఆ అను భవ, అనుభూతులను పద్యమకరందంలో అందిం చిన ధన్యుడు కూడా పోతన అన్నది విదితమే. భాగవతం ద్వితీయ స్కందంలో అద్వితీయంగా నాదోపాసనను గురించి స్పష్టం చేశాడు పోతన. దానికి ప్రత్యక్షోదాహరణం ఈ పద్యం ‘‘సీ. సాంద్ర శరచ్చంద్ర చంద్రికా థవళిత విమల బృందావన వీధియందు దనరి దైవత రుషభ గాంధార నిషాద పంచమ షడ్జమధ్యమ స్వరములోని గళాలు జాతులు మూర్చనల్ గలుగ వేణు నాళ వివరాంగుళాన్యాస లాలనమున మహిత గతింబాడె నవ్యక్త మధురముగను బంకజాక్షుండు దారువు లంకురింప’’ (భాగవతం 2–188) పై పద్యం ద్వారా పోతన తనకు గల సంగీత పాండిత్యాన్ని బహిర్గతం చేశాడు. పద్యాదిలో చంద్రిక రాగ ప్రస్తావన కనబడుతుంది. అంతేగా కుండా చంద్రిక రాగ ప్రస్తారాన్ని ఆరోహణ, ఆవ రోహణల్లో నిర్దేశించాడు. పైపద్యం ఒక్కటిచాలు పోతన సంగీత పాండిత్యాన్ని తెలుసుకోవడానికి. అలాగే లక్షణ శ్రీకృష్ణుని పరిణయ మాడిన వైనాన్ని తెలుపుతున్న (దశమస్కందం ఉత్తర భాగం 1096) సందర్భంలో పోతన పద్యాన్ని ఇలా రాగబద్ధం చేశాడు. ‘చం. కొలదిక మీరంగా డమరు గోముఖ డిండిమ.... నటీనటనముల్ దనరాశి’’(భాగవతం 10 ఉభా –1096) పై పద్యంలో పదిహేను వాద్య విశేషాలను తన నాదోపాసనా ప్రతిభకు తార్కాణంగా తెలియ చేశాడు పోతన. మరోపద్యం భాగవతం దశమ స్కందంలో 767 పద్యంలో.. ‘‘తే. మౌళి పించము కంఠధామమున మెరయ విలసిత గ్రామముగ నొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసె జతుర నటమూర్తి గోపాలచక్రవర్తి’ పై పద్యంలో భువనమోహినీ రాగాల ప్రస్తా వన కనిపిస్తుంది. పోతన భాగవతంలో ప్రయోగిం చిన పదప్రయోగాల లాలిత్యానికి సంగీతం ఒక భాగమైంది. భాగవతాన్ని సంగీత సాహిత్య సమ లంకృతంగా శ్రీవాణి పదార్చన చేసి ఆ భాగవత ఫలాన్ని శ్రీరామాంకితం చేసి తను ధన్యుడై ప్రపంచ జాతిని ధన్యుల్ని చేశాడు. శిక్షలు, వివాహ వేడుకలు, ఆటలు, చల్దులు, ఊరగాయలు తెలుగువారికి చవిచూపిన చతు రుడు పోతన అంటే అతిశయోక్తి కాదేమో. పోతన నానుడులు కూడా అసలైన తెలుగుతనంతో దర్శిం పచేశాడు. ’ఊరకరారు మహాత్ములు’, ’వారిజాక్షు లందు వైవాహికములందు’ వంటివి గూడా పరి చయం చేశాడు. కుచేలుని ’బహుకుటుంబి’గా పరి చయం చేస్తాడు. అంతే కాకుండా తన భాగవ తంలో భక్తిచేత మాత్రమే భగవంతుడు సంతసి స్తాడని ప్రహ్లాదుని చేత పలికిస్తాడు. భగవంతుడు నిరంతరం భక్తులను కనిపెట్టుకుని ఉంటాడనే సత్యానికి ఒక ఉపమానాన్ని కూడా జోడిస్తాడు. ‘‘నాకు మేలుగోరు నా భక్తుడగువాడు భక్త జనుల కాన పరమగతియు భక్తుడెందు చనిన బరతెంతు వెనువెంట గోవు వెంట దగులు కోడె భంగి’’ (9–118) పై పద్యం అంతలో ‘గోవు వెంట దగులు కోడె భంగి’ అనే ప్రయోగం అర్థవంతమైన అర్థాలం కారంతో అలరారింది. పోతన భాగవతంలో ప్రయోగించిన ప్రతి అంశం ఒక నిర్దిష్ట ప్రమా ణంలో ఉంటుంది. గజేంద్రమోక్ష ఘట్టంలో సార్వజనీన తత్వం, సార్వకాలీనత్వం కనిపిస్తుంది. నిత్యం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడే జీవు లంతా కూడా గజేంద్రుని వంటి వారే. నిరంతరం భగవంతుని కరుణకైప్రార్థిస్తున్న వారే. ఈ విష యాన్ని నాడే గజేంద్రుని నోట పోతన ఇలా పల్కించాడు. ‘‘భక్తజనముల దీనులి పాలివాడు వినడె చూడడె తలపడ వేగరాడె’’ (8–87) అలాగే నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని పోతన గజేంద్రమోక్షంలో అద్భుతంగా తెలియజేశాడు. ‘‘లావొక్కింతయు.... సంరక్షింపు భద్రాత్మకా’’ పద్యం పోతన తెలియజేసిన పరబ్రహ్మ తత్వానికి సాక్షీభూతంగా నిలుస్తుంది. పోతన గజేంద్రుని మొరను అతనిపరంగానే కాక విశ్వం లోని జీవులందరి పరంచేస్తూ తెలియజేశాడు. విద్య అవసరాన్ని నాడే పోతన గుర్తించి వ్యక్తి, వ్యవస్థల పరంగా ఇలా తెలియజేశాడు. ‘‘చదువని వాడజ్ఞుండగు చదివిన సరసద్వివేక చతురత కలుగున్ జదువగ వలయును జనులకు జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ’’ పోతన భాగవత సమాజాన్ని మనసుతోనూ, తాను ఉన్న సమాజాన్ని ధర్మదృష్టితోనూ పరిశీలిం చాడు. వ్యక్తి వ్యవస్థ పరస్పరం ఒక ఆధారభూతం అంటూ అందుకు అనేక తార్కాణాలతో భాగవత ఆంధ్రీకరణలో తెలియజేశాడు. వ్యక్తి సత్యవ్రతం వ్యవస్థకు ఆదర్శం కావాలని అభిలషించాడు. అలాగే వ్యక్తి ప్రవర్తనపరంగా గర్వం కూడనిదని, గర్వించిన వారంతా కనుమరుగయ్యారని వామనా వతార ఘట్టంలో రాక్షసరాజు బలి నోట పలికిం చాడు (8.590). ‘కారే రాజులు రాజ్యముల్గలు గవే గర్వోన్నతింబొందరే, వారేరి సిరిమూట గట్టు కుని పోవంజాలిరే’ అనే తన ప్రకటిత భావానికి బలిని ఎంచు కుని పై భావాన్ని తెలియజేశాడు. తన జీవితంలో తృప్తిని ఎంతగా పొందాడో దాన్నే వామనునిచే తెలియజేశాడు. ‘దృప్తిం చెందని మనుజుడు సప్త ద్వీపములైన జక్కంబడునె’ (8–573) అని తెలిపాడు. ఇది ఒక రకంగా చెప్పా లంటే పోతన అంతరంగ ఆవిష్కరణే. వ్యక్తి వికాసం నడవడిలోనే ఉందని అది సామాన్యు నికైనా, అసమాన్యునికైనా సర్వసాధారణంగా తెలి యజేశాడు. జ్ఞానకాండను భాగవతం ద్వారా నిక్షిప్తం చేశాడు. పోతన భాగవతంలో శ్రీకృష్ణుడు మానవునిగా తన మాట, చేత తత్వాలను తెలియ జేయడానికి నటించాడనే విషయం పోతన ఆధా రాల సహితంగా నిరూపితం చేశాడు. మానవుల జీవిత గమనాలను నియంత్రణం చేసి ఆత్మ తత్వ స్వరూపుడైన భగవంతుని ఉనికిని తన భాగవతంలో అంతరంగ ఆవిష్కరణతో శాశ్వతం చేసి మానవ జాతికి దివ్య మార్గదర్శనం చేసిన పోతన కవి సంగీతకర్త (నాదోపాసకుడు), దార్శనికునిగా స్థిర చిర యశస్వి అయ్యాడు. భక్తి జ్ఞానకాసారం భాగవతంగా అందించిన పోతన తెలుగు సాహిత్య పేటి. (పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 30–12–2019న ‘పలికెద భాగవతం’ పద్యపఠన పోటీల బహుమతి ప్రదానోత్సవం సందర్భంగా) -డాక్టర్ నోరి రాజేశ్వరరావు మొబైల్ : 73370 85511 -
రామచంద్రమూర్తికి నేడు ఆత్మీయ సత్కారం
సాక్షి, హైదరాబాద్: సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తికి ఈ నెల 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన మిత్రులు, పాత్రికేయ సహచరులు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆయన 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సీనియర్ పాత్రికేయులు మల్లేపల్లి లక్ష్మయ్య, ఎమెస్కో విజయ్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ‘యాభై ఏళ్ల భారతీయ జర్నలిజం’అనే అంశంపై ఢిల్లీకి చెందిన సీనియర్ పాత్రికేయులు ఎస్. వెంకట నారాయణ కీలకోపన్యాసం చేయనున్నారు. ఈ సమావేశంలో డాక్టర్ రామచంద్రమూర్తి మిత్రులు, సన్నిహితులు, రాజకీయ, సామాజిక, మీడియా, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలిపారు. -
తెలుగు వర్సిటీకి సురవరం పేరు!
సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయానికి ‘సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం’గా పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన ఫైలు సీఎం కేసీఆర్ పరిశీలనలో ఉన్న ట్లు తెలిసింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశముంది. -
8 నుంచి తెలుగు వర్సిటీ దరఖాస్తులు
హైదరాబాద్,న్యూస్‌లైన్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులకు ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులు లభ్యమవుతాయి. వీటిని వర్సిటీ వెబ్ సైట్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.తెలుగుయూనివర్సిటీ.ఏసి.ఇన్) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను మే 30లోగా సమర్పించాలి. 2014-15వ విద్యా సంవత్సరానికి వర్సిటీలో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, జ్యోతిషం, జర్నలిజం, సంగీతం, నృత్యం, రంగస్థల కళలు, జానపద కళలు, చిత్రలేఖన, శిల్పకళలతో పాటు కొత్తగా ఇంద్రజాలంలో కోర్సును కూడా ప్రారంభించారు. ఈ మేరకు వీసీ ఆచార్య ఎల్లూరి శివారెడ్డి సోమవారం వివరాలను వెల్లడించారు. -
తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు భాషా సాహిత్యాలు, సంస్కృతి, వివిధ కళా ప్రక్రియల్లో విశిష్ట సేవలందించిన 12 మంది ప్రముఖులకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు(ఉపకులపతి) ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన గల ఎంపిక సంఘం.. 11 రంగాలకు సంబంధించి 12 మంది పురస్కార గ్రహీతలను ఎంపిక చేసింది. తిరునగరి(కవిత్వం), శలాక రఘునాథశర్మ(విమర్శ), బైరు రఘురాం(చిత్రకళ), కె.వి.సత్యనారాయణ(నృత్యం), ద్వారం దుర్గాప్రసాదరావు(సంగీతం), పాశం యాదగిరి(పత్రికా రంగం), డాక్టర్ బి.నాగిరెడ్డి(నాటక రంగం), పిల్లిట్ల సంజీవ(జానపద కళారంగం), నిడమర్తి లలితా కామేశ్వరి, కాశీభొట్ల రమాకుమారి(అవధానం), శివరాజు సుబ్బలక్ష్మి(ఉత్తమ రచయిత్రి), కలువకొలను సదానంద(కథ/నవల) ఈ పురస్కారాలకు ఎంపికైనట్లు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలను ప్రదానం చేస్తారు. పురస్కారం కింద రూ.20,116 నగదు, పురస్కార పత్రం అందజేస్తారు.