నాంపల్లి (హైదరాబాద్): దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లుగా జాతీయ ఆర్థిక అభివృద్ధి సూచిక దారుణంగా పడిపోయిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సామాజిక సదస్సులో పాల్గొన్న నాగేశ్వర్, సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. కారణాలు–ప్రభావాలు అనే అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలో 23 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని పేర్కొన్నారు. దేశ సంపదలో 20 శాతం కేవలం ఒక శాతం జనాభా చేతిలో ఉందన్నారు. బ్రిటన్ దేశాన్ని అధిగమించి ఐదవ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినప్పటికీ భారతదేశం తలసరి ఆదాయం, బ్రిటన్ ప్రజల తలసరి ఆదాయం కంటే 20 రెట్లు తక్కువగా ఉందన్నారు.
కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ఆదాయ పన్నును ఒకేసారి పది శాతం తగ్గించిందని చెప్పారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.లక్షా 80 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయిందని, ఈ విషయాన్ని నీతి ఆయోగ్ నివేదికలే చెప్తున్నాయని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఆలోచించడం, మతాచారాలను పాటించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా వ్యక్తుల ఇష్టాఇష్టాలు, వ్యక్తిగత సిద్ధాంతాల ప్రాతిపదికన పరిపాలన సాగడానికి వీల్లేదని పేర్కొన్నారు.
తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణంతో పాటు ఎగుమతి, దిగుమతుల మధ్య పెరిగిపోతున్న అంతరం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయన్నారు. కరోనా తర్వాతి కాలంలో కేంద్రం తీసుకున్న ఉద్దీపన చర్యల్లోనూ నిజాయితీ లోపించడంతో ప్రజల కు ఏ రకమైన ఉపశమనం లభించలేదన్నారు. సద స్సులో టీఎన్జీఓ కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు, తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎల్‌ఆర్‌ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ
Comments
Please login to add a commentAdd a comment