నల్లధనమే ఆ సంక్షోభం నుంచి బయటపడేసింది!
నల్లధనమే ఆ సంక్షోభం నుంచి బయటపడేసింది!
Published Tue, Nov 15 2016 4:21 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ.. అభినందిస్తూ పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తుండగా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం వివాదాస్పదమైన కామెంట్లు చేశారు. ప్రపంచ ఆర్థికసంక్షోభం సమయంలో భారత ఆర్థికవ్యవస్థను బ్లాక్మనీనే రక్షించిందని నిపుణులు అభిప్రాయం పడ్డారని ఆయన మంగళవారం పేర్కొన్నారు. "నల్లధనం ఉత్పత్తి చేయరాదు. ఈ విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నా. కానీ ప్రపంచమంతా ఆర్థికసంక్షోభంలో కూరుకున్నప్పుడు భారత్ ఆ పరిస్థితుల నుంచి బయటపడేసింది మాత్రం నల్లధనమే. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సమాంతరంగా భారత్లో బ్లాక్మనీ ఉండటమే అని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు'' అని అఖిలేష్ పేర్కొన్నారు. తాను బ్లాక్మనీని వ్యతిరేకిస్తున్నానని, తనకు అసలు ఆ డబ్బే వద్దని వాఖ్యానించారు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మాత్తు నిర్ణయంపై స్పందించిన ఆయన ఈ కామెంట్లు చేశారు. బ్లాక్మనీని బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలు బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద భారీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సాధారణ ప్రజానీకానికి ప్రభుత్వం చాలా కష్టాలను విధిస్తుందని విమర్శించారు. బ్లాక్మనీని చెక్ చేయడానికి ఈ నోట్ల రద్దు ఏమీ ప్రయోజనం కలిగించదని వ్యాఖ్యానించారు. అవినీతిని చెక్ చేయడానికి మాత్రం ఇది ఓ మంచి చర్యఅని, అవినీతికి పాల్పడకూడదనే విషయంపై చాలామంది ప్రజలు అవగాహన పొందుతారని పేర్కొన్నారు. కానీ ఎవరైతే నల్లధనాన్ని రూ.500, రూ.1000 నోట్లలో దాచిపెట్టుకుని ఉంటారో, వారు మాత్రం ప్రస్తుతం రూ.2,000 నోట్ల కోసం వేచిచూస్తున్నారని అఖిలేష్ తెలిపారు.
Advertisement